నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజును ఎందుకు జైలుకు తరలించారని సీఐడీని ప్రశ్నించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. రఘురామ కృష్ణంరాజు కేసులో హైకోర్టులో ప్రారంభమైన వాదనలు కాసేపటి క్రితమే ముగిశాయి.. రఘురామ కృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితిపై జిల్లా కోర్టు నుంచి వైద్య బృందం నివేదిక హైకోర్టుకు చేరింది.. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింగి.. ఈ సందర్భంగా జరిగిన పరిణామాలను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు రఘురామ తరపు న్యాయవాదులు.. ఇదే సమయంలో.. సీఐడీ కూడా అన్ని విషయాలను కోర్టుకు వివరించింది. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా.. సీఐడీ కోర్టు ఆదేశాల ప్రకారం.. రఘురామను జైలుకు తరలించారని ఆయన తరపు లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.. కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను రీకాల్ చేయాలని కూడా హైకోర్టుకు విన్నవించారు. ఈ వ్యవహారంపై ఆరా తీసిన హైకోర్టు.. రఘురామను ఎందుకు జైలుకు పంపించారని సీఐడీని ప్రశ్నించింది.. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల తర్వాత ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారా? అని కూడా ప్రశ్నించింది. దీనిపై బదులిచ్చిన సీఐడీ.. మేజిస్ట్రేట్ ఆదేశాల ప్రకారమే తాము నడుచుకున్నామని సమాధానం ఇచ్చింది.