తిరుపతి పర్యటనలో సీఎం జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా టీసీఎల్ గ్రూప్‌కు చెందిన ప్యానెల్ ఆప్టో డిస్‌ప్లే టెక్నాలజీ లిమిటెడ్ (POTPL), డిక్సాన్ టెక్నాలజీస్, ఫాక్స్ లింక్, సన్నీ ఆప్టో టెక్ కంపెనీలకు సీఎం జగన్ భూమి పూజ చేశారు. టీసీఎల్ కంపెనీ తిరుపతిలో టీవీ ప్యానెళ్లను తయారుచేయనుంది. రూ.1230 కోట్లతో టీసీఎల్ గ్రూప్ ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 3,174 మందికి ఉపాధి కలగనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ట్రయల్ ప్రొడక్షన్స్ కోసం ఇప్పటికే వెయ్యి మంది కార్మికులు ఈ కంపెనీ కోసం పనిచేస్తున్నారని తెలిపింది. సన్నీ ఆప్టో టెక్ కంపెనీ కెమెరా మాడ్యూల్స్‌ను తయారు చేయనుంది. ఎంఐ, శాంసంగ్, ఒప్పో, వివో వంటి కంపెనీలకు కెమెరా మాడ్యూల్స్‌ను సన్నీ ఆప్టో టెక్ కంపెనీ అందించనుంది. ఇప్పటివరకు ఈ కంపెనీ రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఈ కంపెనీ ద్వారా 1200 మంది ఉపాధి కలగనుంది.
అటు ఇనగలూరులో అపాచీ పరిశ్రమకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అపాచీ పరిశ్రమలో అడిడాస్ షూస్, లెదర్ జాకెట్స్, బెల్టులు వంటి ఉత్పత్తులు తయారుకానున్నాయి. తొలి దశలో అపాచీ పరిశ్రమ రూ.350 కోట్ల పెట్టుబడులు పెట్టగా.. వచ్చే ఐదేళ్లలో మరో రూ.350 కోట్ల పెట్టబడి పెట్టనుంది. అపాచీ పరిశ్రమ ద్వారా మొత్తం 15వేల మందికి ఉపాధి లభించనుంది. అపాచీ పరిశ్రమకు శంకుస్థాపన అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. అపాచీ పరిశ్రమ ఏర్పాటుతో 10వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రపంచంలో అత్యుత్తమ కంపెనీ ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. 2023 సెప్టెంబర్ కల్లా పరిశ్రమ అందుబాటులో వస్తుందని.. 80 శాతం మంది స్థానికులకే ఉద్యోగాలు రానున్నాయని పేర్కొన్నారు.