కరోనా విజృంభణ కొనసాగుతోన్న సమయంలో.. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందు.. ఎంతోమంది కరోనా రోగులను నయం చేసింది.. దీంతో.. క్రమంగా అటు పరుగులు పెట్టారు జనం.. అయితే, ఎప్పుడైతే.. దానిపై పూర్తిస్థాయిలో అధ్యయనం మొదలైందో.. అప్పటి నుంచి మందు పంపిణీ నిలిచిపోయింది.. ఇక, ఆనందయ్య ఆయుర్వేద మందుపై ఆయుష్ పరిశోధన చేస్తున్న విషయం తెలిసిందే కాగా.. ఆయుష్ కమిషనర్ రాములు… ఇవాళ ఆనందయ్య మందుపై నివేదికను ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు అందజేశారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాములు.. ఆనందయ్య మందుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. ఆ మందు ద్వారా ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేసిన ఆయన.. పూర్తి నివేదిక వచ్చిన తర్వాత ప్రజలకు పంపిణీ చేయవచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. అయితే, తుది నివేదిక రావడానికి మరో మూడు, నాలుగు రోజుల సమయం పట్టవచ్చు అన్నారు.. సీసీఆర్‌ఏఎస్ నివేదక వచ్చిన తర్వాతే.. ఆనందయ్య మందు పంపిణీపై సర్కార్ ఫైనల్‌గా ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు రాములు.
ఇక, ఆనందయ్య ఇప్పటికే 70-80 వేల మందికి మందు పంపిణీ చేశామని చెబుతున్నారు. వేల సంఖ్యలో మందు తీసుకుంటే ఒకరిద్దరికి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీన్ని పెద్ద సమస్యగా చూడాల్సిన అవసరం లేదన్నారు రాములు.. ఆనందయ్య మందు తీసుకున్నవారి ఆరోగ్య పరిస్థితి వైద్యులు పరిశీలిస్తున్నారు అని.. ఈ మందులో 18 రకాల మూలికలను ఆనందయ్య ఉపయోగిస్తున్నారన్న ఆయుష్ కమిషనర్.. ఆ మందు శాంపిల్స్‌ను హైదరాబాద్ ల్యాబ్‌కు పంపిచామని.. ఆ రిపోర్టులలో కూడా హానికారకాలు లేవని తేలిందన్నారు.. అయితే, ఆ మందుపై మరో మూడు రిపోర్టులు రావాల్సి ఉందన్నారు ఆయుష్ కమిషన్ రాములు.