కరవు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో ఈసారి ఆశించిన స్థాయిలో వర్షం కురవకపోయినా.. రైతులు మాత్రం లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. అదెలా అంటే జిల్లాకు ప్రధాన నీటి వనరుగా అన్న తుంగభద్రకు గతంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వరద నీరు రావడమే. జులై రెండవ వారంలోనే గేట్లు ఎత్తివేయడం.. హెచ్చెల్సీకి నీరు విడుదల చేయడంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. దేశంలో అత్యల్ప వర్షపాతం కురిసే ప్రాంతంలో అనంతపురం జిల్లా కూడా ఒకటి. ఇక్కడ వర్షాలు ఎప్పుడొస్తాయో తెలియదు. రైతులు ఆకాశం వైపు చూడటం తప్ప చినుకు కిందకు రాలే పరిస్థితి ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాకు ప్రధాన సాగు, తాగునీటి వనరు తుంగభద్ర జలాశయం. ఏపీ, కర్ణాటక ఉమ్మడి ప్రాజెక్ట్ అయిన తుంగభద్ర నుంచి అనంతపురం జిల్లాకు నికర వాటా ఉంది.
అందుకే ఇక్కడ సుమారు రెండులక్షల ఎకరాల్లో వరి ఇతర పంటలు సాగవుతాయి. గత మూడేళ్లుగా వర్షాలు సంవృద్ధిగా కురుస్తుండటంతో ఆశించిన స్థాయిలో నీరు తుంగభద్రకు చేరుతోంది. అయితే గత పదేళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి జులై నెలలోనే తుంగభద్ర జలాశయంకు నీరు చేరింది. అనంతపురం జిల్లాలో ఈ ఏడాది వర్షాలు కురవకపోయినా.. కర్ణాటక ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా రికార్డు స్థాయిలో వరద వచ్చింది. అందుకే జులై రెండవ వారంలోనే జలాశయం పూర్తిగా నిండి గేట్లు ఎత్తివేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దాదాపు వారం రోజులుగా లక్ష క్యూసెక్కులకు పైగా ఇన్ ఫ్లో ఉంది. దీంతో అనంతపురం జిల్లా నీరు సరఫరా అయ్యే హెచ్చెల్సీకి కూడా రెండవ వారంలోనే నీటి విడుదల చేశారు.
Ramarao On Duty Trailer: ధర్మం కోసం రామారావు చేసిన డ్యూటీ ఏంటి..?
ఇప్పటికే తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీకి విడుదల చేసిన వాటా నీరు జిల్లా సరిహద్దుకు చేరింది. ఈ నెల 12న టీబీపీ బోర్డు అధికారులు నీటిని విడుదల చేశారు. కర్ణాటకను దాటుకుని.. సరిహద్దులోని 105వ కి.మీ. వద్దకు బుధవారం అర్ధరాత్రి తుంగభద్ర జలాలు చేరుకున్నాయి. దీంతో బొమ్మనహాళ్, కణేకల్లు మండలాల్లోని ఆయకట్టు కింద వరి, మొక్కజొన్న, పత్తి, జొన్న తదితర పంటలను సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. వరి రైతులు ఇప్పటికే నారు పోశారు. సోనా మసూరీని వదిలి, తక్కువ రోజుల్లో దిగుబడి చేతికి వచ్చే వరి రకాలను వినియోగిస్తున్నారు. గతంలో ఏపీ వాటా 32టీఎంసీలు ఉండగా.. తుంగభద్రలో పూడిక కారణంగా అది క్రమంగా 24టీఎంసీలకు పడిపోయింది. మూడేళ్ల క్రితం వరకు పూర్తి నీరు తీసుకున్న సందర్భాలు లేవు. అయితే గత మూడేళ్లుగా వర్షాలు బాగా కురుస్తుండటంతో వాటా కంటే ఎక్కువగా నీరు తీసుకునే పరిస్థితి ఉంది. ఈసారి జులైలోనే నీటి రాకపై రైతుల్లో మరింత ఆశలు పెరిగాయి.
ప్రస్తుతం తుంగభద్ర జలాశాయం నుంచి లక్ష 30వేల క్యూసెక్కుల నీరు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. కానీ మనం వాటిని వినియోగించుకోలేని దుస్థితి. దీనికి ప్రధానమైన కారణం.. హెచ్చెల్సీ కాలువ అధ్వాన్న స్థితికి చేరుకోవడం. అక్విటేడ్ లు, స్ట్రక్ఛర్లు ప్రమాదంగా మారాయి. కాల్వ గట్లు మొత్తం కంపచెట్ల పెరగిపోయాయి. ఏటా నీటి విడుదలకు ముందు జలవనరులశాఖ అధికారులు కంపచెట్లు తొలగించడం…పాడైన నిర్మాణాలను పునరుద్ధరించడం వంటి పనులు చేపట్టే వారు. ఈ సారి నీటి విడుదల తేదీ ఖరారైనా పనులు చేపట్టలేదు.
కర్ణాటకలోని హొసపేట వద్ద ఉన్న తుంగభద్ర డ్యాం నుంచి హెచ్ ఎల్సీ 105 కిలోమీటర్లు కర్ణాటకలో ఉంది. పొరుగు రాష్ట్రం సరిహద్దు 105 కిలోమీటరు నుంచి సుమారు 81 కిలోమీటర్లు అనంతపురం జిల్లాలో ఉంది. కర్ణాటకలో 105 కిలోమీటర్ల కాల్వ ఆధునికీకరణ పనులను అక్కడి ప్రభుత్వం ఇటీవల పూర్తిచేసింది. దాదాపు 4000 క్యూసెక్కుల నీరు పారే విధంగా కాల్వను వెడల్పు చేశారు. కానీ ఇక్కడ కాలువ వెడల్పు సంగతి పక్కన బెడితే అసలు మరమ్మతులు చేసే పరిస్థితి కూడా లేదు. అందుకే కనీసం 2వేల క్యూసెక్కుల సమార్థ్యంతో కూడా నీరు తీసుకోలేని పరిస్థితి ఉంది. నీరు ఏమాత్రం ఎక్కువగా విడుదల చేసినా కాలువ గట్లు తెగిపోతాయి. గతంలో ఇలాంటి పరిస్థితులు చూశారు కూడా. మొత్తం మీద జులై రెండవ వారంలో నీరు ఈస్థాయిలో రావడం సంతోషకరమైనా వాటిని పూర్తి స్థాయిలో వినియోగించు కోలేకపోతున్నాం.
Taneti Vanitha: వరద బాధితుల్ని ఆదుకుంటాం