అసలు కంటే.. కొసరు ఎక్కువట.. అసలు మందు ఇప్పటికే ఆపేశారు.. కానీ, ఇదే ఆ మందు అంటూ బ్లాక్ మార్కెట్‌లో సొమ్ము చేసుకోవడానికి బయల్దేరారు కేటుగాళ్లు.. విషయానికి వస్తే.. కరోనాకు ఆయుర్వేద మందుతో ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయారు కృష్ణపట్నం ఆనందయ్య.. ఇప్పుడు.. వార్తా కథనాలు మొత్తం ఆయన చుట్టే తిరుగుతున్నాయి.. మందులు ఏం వాడుతున్నారు దగ్గర నుంచి ఎలా తయారు చేశారు.. పంపిణీపై చర్చ సాగుతోంది.. ఇక, దీనిపై పూర్తిస్థాయిలో తేల్చేందుకు ఆయూష్ డిపార్ట్‌మెంట్‌కు కూడా రంగంలోకి దిగింది. అయితే, వందల మందికి మాత్రమే మందు తయారు చేస్తున్నారు.. కానీ, వేలాది మంది తరలిరావడంతో మందు పంపిణీ నిలిపివేశారు. ఇప్పుడు సర్కార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే మందు తయారు చేయడం, పంపిణీ చేయడం ఉంటుందని.. ఎవరూ కృష్ణపట్నం రావొద్దని ఇప్పటికే ప్రకటించారు. అయితే, ఇదే అదునుగా చెలరేగిపోతున్నారు కేటుగాళ్లు.. ఇది ఆనందయ్య తయారు చేసిన కరోనా ఆయుర్వేద మందు అంటూ బ్లాక్ మార్కెట్‌లో అమ్మేస్తున్నారు.. అష్టకష్టాలుపడి అక్కడివరకు వచ్చిన ప్రజల అవసరాన్ని క్యాష్ చేసుకుంటున్నారు కేటుగాళ్లు.. ఒక్కో ప్యాకెట్‌కు రూ. 3 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారని చెబుతున్నారు.. ఆనందయ్య దగ్గర కరోనా మందు కోసం క్యూలో పడిగాపులు పడ్డా మందు దొరకపోవడంతో.. బ్లాక్ మార్కెట్‌ను ఆశ్రయిస్తున్నారు బాధితులు. ఇక్కడ ప్రజలు గమనించాల్సి విషయం ఏంటంటే.. ఆనందయ్య మందు తయారు చేయడమే ఆపేశాడు.. ఏదో తొందరపడి బ్లాక్ మార్కెట్‌లో మందు కొనుగోలు చేస్తే.. అందులో ఏముందో.. తీసుకుంటే ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి.