YS Jagan: విలువలు, విశ్వసనీయతే మన పార్టీ సిద్ధాంతం.. ఈ సిద్ధాంతాన్ని నేను గట్టిగా నమ్ముతాను అన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఉమ్మడి కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు జగన్.. ఈ సమావేశానికి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మేయర్ బీవై రామయ్య, మాజీ ఎమ్మెల్యేలు శ్రీదేవి, శిల్పా రవి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్ సహా పలువురు నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇవాళ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నాం. వైసీపీకి మొదటి బీజం కర్నూలు జిల్లా నల్లకాలువలోనే పడింది. కేవలం ఇచ్చిన మాటకోసం.. ఎందాకైనా వెళ్లాం.. ఆ ప్రస్థానంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. బలమైన పార్టీగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎదిగింది. ఆరోజు నుంచి నాతోనే మీరంతా అడుగులు వేశారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ నాతోనే ఉన్నారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతే మన పార్టీ సిద్ధాంతం. విలువలకు, విశ్వసనీయతకు అర్థం చెప్పిన పార్టీ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నారు.. ఈ రెండు పదాలే పార్టీని నడిపించాయి. గట్టిగా ఈ సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను. నాలో ఈరెండింటిని చూసి నాతోపాటుగా అడుగులో అడుగు వేశారని గుర్తుచేసుకున్నారు..
రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజం.. ఇవాళ్టికి కూడా పార్టీకి చెందిన ఏ నాయకుడైనా గర్వంగా కాలర్ ఎగరవేసుకుని ప్రజల వద్దకు వెళ్లగలడు అన్నారు వైఎస్ జగన్.. ప్రతి కుటుంబాన్ని చిరునవ్వుతో పలకరించి ఆశీస్సులు తీసుకునే కెపాసిటీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే ఉందన్న ఆయన.. మనం రాకముందు రాజకీయాలు ఒకలా ఉండేవి. మనం వచ్చిన తర్వాత రాజకీయాలకున్న అర్ధాన్ని మార్చాం. ఇచ్చిన మాటకు ఎవరైనా కట్టుబడి ఉండాలని చెప్పాం.. రాజకీయ అవసరాలకోసం గతంలో ఇష్టం వచ్చినట్టు మేనిఫెస్టో ఇచ్చేవారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేసేవారు. మనం వచ్చాక, మేనిఫెస్టోను ఒక పవిత్రమైన గ్రంథం మాదిరిగా భావించాం. ప్రతి అంశాన్నీ నెరవేర్చాలని తపన, తాపత్రయం పడ్డాం. కోవిడ్ ఉన్నా సరే అన్ని హామీలను నెరవేర్చాం. సంక్షోభం ఉన్నా, ఏరోజూ సాకులు వెతుక్కోలేదు. 99 శాతం పైచిలుకు హామీలను నెరవేర్చాం. గడపగడపకూ ప్రతి ఇంటికీ వెళ్లాం. ఇన్ని చేసినా మనం ఓటమి చెందామని ఆవేదన వ్యక్తం చేశారు.. చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మారు. ప్రతి ఇంటికీ తన మనుషులను చంద్రబాబు పంపాడు. కరపత్రాలు, బాండ్లు చంద్రబాబు పేరిట పంచారు. ప్రతి వర్గాన్నీ మోసం చేశారు. దీనివల్ల పదిశాతం ప్రజలు చంద్రబాబును నమ్మారు. జగన్ చేశాడు కాబట్టి, చంద్రబాబు కూడా చేస్తాడని నమ్మారు. జగన్ కన్నా ఎక్కువ చేస్తానని చంద్రబాబు అన్న మాటలను నమ్మారు.. చంద్రబాబు మారాడేమోనని ప్రజలు నమ్మారు. అందుకే 50 శాతం నుంచి 40 శాతానికి ఓటు షేరు తగ్గిందని వివరించారు..
Read Also: US-China Trade War: అమెరికా కవ్వింపు చర్యలకు చైనా భయపడదు..
చంద్రబాబు వచ్చి 11 నెలలు అయిపోయింది. రెండు బడ్జెట్లు పెట్టాడు. చంద్రబాబు నాయుడు హామీలు నెరవేరుస్తాడని ఆశగా ఎదురుచూస్తున్నారు. మాట ఇచ్చాను కాని, ఇప్పుడు భయం వేస్తుందని చంద్రబాబు ఇప్పుడు అంటున్నాడు అని దుయ్యబట్టారు వైఎస్ జగన్.. రాష్ట్రానికున్న అప్పులపై అబద్ధాలు చెప్తున్నాడు. ప్రతిరోజూ అబద్ధాలు చెప్తున్నాడు. జగన్ ఉన్నప్పుడు నాలుగువేళ్లూ నోట్లోకి వెళ్లాయని ప్రజలు అనుకున్నారు. ఇప్పుడు ఉన్న ప్లేటును చంద్రబాబు లాగేశాడని అంటున్నారని వ్యాఖ్యానించారు.. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో పూర్తి తిరోగమనం. ఆరోగ్యశ్రీకి 3500 కోట్లు బకాయి పెట్టారు. వైద్యం చేయలేమని ఆస్పత్రులు చెప్తున్నాయి. ఏ రైతుకూ గిట్టుబాటు ధర రావడంలేదు. రైతులకు పెట్టుబడి సహాయం అందడంలేదు. ఫీజు రియింబర్స్‌మెంట్, వసతి దీవెన అందడంలేదు. పరిపాలనలో పారదర్శకత పూర్తిగా పక్కకు పోయిందని విమర్శించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..