AP Government: ధరల నియంత్రణ, మార్కెట్ ఇంటర్వెన్షన్లపై మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం.. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో మంత్రుల కమిటీ వేశారు.. కమిటీలో సభ్యులుగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఉన్నారు.. ఇక, పౌరసరఫరాల శాఖ ఎక్స్ఆఫీషియో కార్యదర్శి ఈ కమిటీకి కన్వీనర్ గా ఉంటారని ప్రభుత్వం పేర్కొంది.. నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు ఆకస్మికంగా ఎందుకు పెరుగుతున్నాయన్న అంశంపై అధ్యయనం చేయాలని ఆదేశించింది.. నిత్యావసరాలు, కూరగాయలు ధరల తగ్గింపునకు చేపట్టాల్సిన చర్యలపైనా సిఫార్సులు చేయాలని స్పష్టం చేసింది..
Read Also: Baba Siddique : బాబా సిద్ధిఖీ హత్య కేసులో పాకిస్థాన్‌కు సంబంధం.. డ్రోన్ ద్వారా ఆయుధాల ఆర్డర్
ఇక, ఉత్పత్తి, సప్లై, డిమాండ్ , ధరలకు సంబంధించిన అంశాలు, పంటల తీరు, ఎగుమతులు, దిగుమతులపై కూడా అధ్యయనం చేయాల్సిందిగా మంత్రుల కమిటీకి సూచించింది ప్రభుత్వం.. వినియోగదారులకు అందుబాటు ధరల్లో నిత్యావసరాలు, కూరగాయలు లభించేలా తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని సూచించింది.. ధరలు నియంత్రణలోకి తెచ్చేందుకు అవసరమైన యంత్రాంగం రూపకల్పనకు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని పేర్కొంది.. వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా ఈ అంశాలపై ఓ డేటా బేస్ ను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.. ధరలు పెరిగినప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ ను అమలు చేసేలా శాశ్వతప్రాతిపదికన ధరల నియంత్రణ నిధిని ఏర్పాటు చేసేందుకు సూచలను చేయాలని తెలిపింది.. ధరల పెరుగుదల , నియంత్రణ, మార్కెట్ ఇంటర్వెన్షన్లపై అధికారుల కమిటీ ఇచ్చిన సిఫార్సులను అధ్యయనం చేయాలని సూచించింది.. ఆహారపంటలు, నిత్యావసరాలకు సంబంధించి ఉత్పత్తి, సరఫరా, నిల్వలకు సంబంధించి దీర్ఘ, స్వల్పకాలిక ప్రణాళికల అమలుపైనా సిఫార్సులు కోరింది ప్రభుత్వం.. ఉత్పత్తి, నిల్వల్లో ఆధునిక టెక్నాలజీ వినియోగం ద్వారా ఏడాది పొడవునా ధరల్ని నియంత్రణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించింది. వ్యవసాయదారులు, మిల్లర్లు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ , ఆహారధాన్యాలు, పప్పు దినుసులు, వంటనూనె డీలర్లు, ఎగుమతి, దిగుమతిదార్లతో సమావేశం కావాలని స్పష్టం చేసింది.. అధ్యయనం అనంతరం తదుపరి నిర్ణయం కోసం సమగ్ర నివేదిక సమర్పించాలని మంత్రుల కమిటీని ఆదేశించింది ప్రభుత్వం..