ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై పోలీసు కేసు నమోదైంది. ఇటీవల అమలాపురంలో జరిగిన అలర్లలో గాయపడిన వారిని సోము వీర్రాజు పరామర్శించేందుకు వెళ్తున్న క్రమంలో జొన్నాడ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అమలాపురంలో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నందున తాము అభ్యంతరాలు తెలుపుతున్నామని సోము వీర్రాజుకు పోలీసులు స్పష్టం చేశారు.
అయితే విధి నిర్వహణలో ఉన్న ఎస్సైను నెట్టివేశారని, పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణల కారణంగా సోము వీర్రాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు కోనసీమ జిల్లా ఆలమూరు పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 353, సెక్షన్ 506 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే సోము వీర్రాజుతో పోలీసుల వాగ్వాదం ఓ ప్రణాళిక ప్రకారం జరిగిందని ఏపీ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. జొన్నాడ జంక్షన్ లో పోలీసులు సోము వీర్రాజుతో వాగ్వాదానికి దిగగా మరో పోలీసు దాన్ని వీడియోలో చిత్రీకరించడమే అందుకు నిదర్శనమని చెప్తున్నారు.