సోషల్ మీడియాలో మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించి అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శలు చేశారు. ఫేక్ ట్వీట్‌పై తాను సీఐడీకి ఫిర్యాదు చేస్తే.. సోది రాంబాబు సోది మాటలు మాట్లాడుతున్నాడంటూ ఫైర్ అయ్యారు. తాను ఫాల్స్ కంప్లైంట్ చేశానంటూ ఏదేదో మాట్లాడుతున్నాడని.. ఫేక్ ట్వీట్‌ను ఆయన తనను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేయడం నిజం కాదా అని దేవినేని ఉమా ప్రశ్నించారు.
తాను సీఐడీకి ఫిర్యాదు చేయడంతో సోది రాంబాబు 36 గంటలు పారిపోయాడని.. ఆయన్ను ఎప్పుడు విచారిస్తారో సీఐడీ చెప్పాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు. అంతేకాకుండా కుప్పం గురించి కామెంట్స్ చేసిన మంత్రి అంబటి రాంబాబుకు దేవినేని ఉమ కౌంటర్ ఇచ్చారు. ‘కుప్పం గురించి నీకెందుకు సోది రాంబాబు.. సత్తెనపల్లిలో గెలవగలవా.. గడప గడపకు వెళ్తే నీ సోది, సొల్లు కబుర్లు చాలు రాంబాబు అంటూ ప్రజలే అంటున్నారు’ అంటూ మండిపడ్డారు. కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే ప్రకటించారని.. అసలు ఈ ప్రభుత్వానికి సిగ్గుందా అని దేవినేని ఉమా ప్రశ్నించారు. నరేగా బిల్లులు తీసుకోవడానికి కోర్టు ధిక్కారం కేసులు వేయాల్సి వచ్చిందన్నారు. నరేగా పెండింగ్ బిల్లుల్లో రూ. 1277 కోట్లకు రూ. 230 కోట్ల విడుదలకు ఆర్ధిక శాఖ ఆమోదం తెలపడం ప్రజాస్వామ్య విజయం అని దేవినేని ఉమ అభిప్రాయపడ్డారు.