ఏపీ ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలల నిర్వహణ పట్ల వ్యవహరిస్తున్న తీరుకి నిరసనగా విద్యార్ధులు ఆందోళన బాట పట్టారు. ఎయిడెడ్ పాఠశాలల పైన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. అనంతపురం నగరంలోని గిల్దాఫ్ ఎయిడెడ్ బాలికల పాఠశాలలో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు.
స్కూల్ యాజమాన్యం బలవంతంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సంతకాలు చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అంతా పేద విద్యార్థులు పల్లెల నుంచి వచ్చి చదువుకుంటున్నామని, ఉన్నపళంగా ఇప్పటికిప్పుడు వేరే స్కూల్ కు వెళ్లి చదువుకోమంటే ఎలా అని ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..అమ్మ ఒడి పథకం వద్దు మా స్కూలే ముద్దు అంటూ నినాదాలు చేశారు. స్కూల్ విద్యార్థుల ధర్నాతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది.