Satyanarayana Swamy Vratam In English: కాలం మారుతోంది.. కాలంతో పాటే మనుషులు కూడా మారుతున్నారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రజలు అప్‌డేట్ అవుతున్నారు. అయితే పూజలు చేయడంలో కూడా పంతుళ్లు అప్‌డేట్ అవుతుండటం విశేషంగానే పరిగణించాలి. తాజాగా ఇంటి గృహప్రవేశం సందర్భంగా నిర్వహించిన సత్యనారాయణస్వామి వ్రతాన్ని ఓ పంతులు ఇంగ్లీష్‌లో చేయించాడు. మాములుగా అయితే తెలుగులోనే సత్యనారాయణస్వామి వ్రతం కథను చదువుతారు. అయితే ఇక్కడ పంతులు అనర్గళంగా ఇంగ్లీష్‌లోనే సత్యనారాయణస్వామి వ్రతం కథను చెప్తుండటంతో నెటిజన్‌లు నోరెళ్లబెడుతున్నారు. ప్రస్తుతం పంతులు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పంతులు ఇంగ్లీష్‌లో చెప్పే వ్రతాన్ని ఆ ఇంట్లోని వాళ్లు ఆసక్తిగా వింటున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. అయితే ఈ వీడియో ఎక్కడ తీశారన్న విషయం స్పష్టంగా తెలియరాలేదు.
Read Also: Friendship Day 2022: కులమతాలకు అతీతం.. పేద, ధనిక తేడా తెలియని బంధం..!!
కాగా పెళ్లయిన నూతన దంపతులు, గృహప్రవేశం చేసిన దంపతులు సత్యనారాయణస్వామి వ్రతాన్ని నిర్వహించడం హిందూవుల సంప్రదాయంగా వస్తోంది. శ్రావణమాసం, కార్తీక మాసంలో కూడా చాలా మంది సత్యనారాయణస్వామి వ్రతాలను చేసుకుంటారు. ఈ వ్రతం చేయడం వల్ల సకల సంతోషాలు కలుగుతాయని భావిస్తుంటారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర కలయిక రూపంలో దర్శనమిచ్చే అవతారమే సత్యనారాయణ స్వామిగా కొలుస్తారు. అందుకే పెళ్లి అయిన వారి చేత సత్యనారాయణస్వామి వ్రతాన్ని చేయిస్తే వారి కొత్త జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా వారి దాంపత్య జీవితం సజావుగా సాగుతుందని హిందు సంప్రదాయంలో భక్తులు నమ్ముతుంటారు.