Friendship Day 2022: సృష్టిలో దేవుడు మనుషులందరితో బంధాలు సృష్టిస్తాడు. అయితే మనకు తెలియకుండానే ఏర్పడే బంధం ఫ్రెండ్‌షిప్ ఒక్కటే. ఎవరు ఎప్పుడు మనకు స్నేహితులు అవుతారో మనకే తెలియదు. కులమతాలకు అతీతంగా, పేద, ధనిక అనే తేడా లేకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం పుడుతుంది. కొంతమంది స్నేహితులు ప్రాణానికి ప్రాణంలాగా నిలుస్తారు. అన్ని విషయాల్లోనూ తోడుగా నిలుస్తారు. ఏ కష్టంగా వచ్చినా ఆదుకుంటారు. కష్టసమయంలో కలత చెందిన మనసుకు ప్రశాంతతను కలిగించే దివ్యమైన ఔషధం ఏమైనా ఉందంటే అది స్నేహం మాత్రమే. స్నేహితులు మనకు గురువులా బోధించి దారి చూపిస్తారు. తప్పు చేసినప్పుడు మందలిస్తారు. ప్రతిరోజూ మాట్లాడుకోకపోయినా అవసరమైనప్పుడు మనకు ధైర్యం, ఓదార్పు చెప్పే వాడే నిజమైన స్నేహితుడు. స్నేహం చేయడం మీ బలహీనత అయితే ప్రపంచంలో మీ అంత బలవంతుడెవరూ ఉండరు.
Read Also: Vice President Salary: ఉప రాష్ట్రపతి ఎంత వేతనం అందుకుంటారు? ఎలాంటి సదుపాయాలు లభిస్తాయి?
తల్లిదండ్రులు, తోబుట్టువులు లేని వారు ఉంటారు కానీ స్నేహితులు లేని వారు ఉండరు. సొంతవాళ్లకు చెప్పుకోలేని విషయాలను దోస్తులకు చెప్పుకుంటాం. బాధైనా, సంతోషమైనా పంచుకుంటాం. కుటుంబసభ్యుల కంటే వాళ్లతోనే ఎక్కువ గడుపుతాం. స్నేహమంటే పార్టీలు చేసుకోవడం మాత్రమే కాదు జీవితాంతం తోడుంటాననే ధైర్యాన్ని కల్పించడం. అయితే స్నేహితుల దినోత్సవం అంటే కానుకలు ఇచ్చిపుచ్చుకోవడం, శుభాకాంక్షలు చెప్పుకోవడం, విందులు చేసుకోవడం కాకుండా స్నేహం, శాంతి పెంపొందించే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి ఆగస్టు నెలను అంతర్జాతీయ స్నేహితుల మాసంగా ప్రకటించింది. మన దేశంలో ఆగస్టులో వచ్చే తొలి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటాం.
మీ కోసం కొన్ని ఫ్రెండ్ షిప్ డే కోట్స్:
• స్నేహమంటే మాటలతో పుట్టి చూపులతో మొదలయ్యేది కాదు … స్నేహమంటే మనసులో పుట్టి మట్టిలో కలిసిపోయేది
• డబ్బు లేని వాడు పేదవాడు.. స్నేహితుడు లేనివాడు దురదృష్టవంతుడు
• ద్వేషించడానికి క్షణ కాలం సరిపోతుంది.. కానీ అదే స్నేహానికి మాత్రం ఒక జీవిత కాలం పడుతుంది
• స్నేహం చిన్న విషయం కాదు.. ఎంత పెద్ద సమస్యనైనా చిన్నదిగా మార్చే సాధనం
• ఆనందం చెప్పలేనిది, సంతోషం పట్టలేనిది, కోపం పనికిరానిది, ప్రేమ చెరిగిపోనిది.. స్నేహం మాత్రం మరువరానిది