‘పూజా మన కాజా…. ఆమె లెగ్ పెడితే సూపర్ హిట్’ అంటూ ‘బీస్ట్’ను తెలుగులో విడుదల చేసిన ‘దిల్’ రాజు ఆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పొగడ్తలతో ముంచెత్తారు. ఆమె నటించిన ‘డీజే, అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో’ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయని ఉదాహరణగా పేర్కొన్నారు. పూజా హెగ్డే ఇప్పుడు ఆల్ ఇండియా హీరోయిన్, పాన్ ఇండియా హీరోయిన్, సినిమా సినిమాకూ ఆమె నటిగానూ ఎంతో పరిణతి చూపుతోందని కితాబిచ్చారు. అయితే అదే సమయంలో ఆయన ఈ యేడాది పూజా హెగ్డే నటించిన పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ పరాజయాన్ని ఎలా మర్చిపోయారని మరికొందరు అనుమానం వ్యక్తం చేశారు. సినిమా రంగం విజయాలను గుర్తు పెట్టుకుంటుంది తప్పితే పరాజయాలను కాదనేది వాస్తవం. చేదు నిజాలైన పరాజయాలు ఒక్కోసారి ఆకాశంలో విహరిస్తున్న తారలను నేల మీదకు తీసుకొస్తాయి.
అది నిర్మాతలకే మంచిది. ‘దిల్’ రాజు ఆకాశానికి ఎత్తిన పూజా హెగ్డే తాజా చిత్రం ‘బీస్ట్’ కూడా ఆమెను, ఆమె అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. చిత్రం ఏమంటే… దాదాపు పదేళ్ళ తర్వాత పూజా ‘బీస్ట్’తో కోలీవుడ్ లో రీ-ఎంట్రీ ఇచ్చింది. విజయ్ సినిమాలో నటించే ఛాన్స్ దక్కడంతో ఈసారి విజయకేతనం ఎగరేయడం ఖాయమని భావించింది. కానీ ఆమె పాత్రకు ఈ సినిమాలో ఎలాంటి ప్రాధాన్యం లేకపోయింది. సినిమా ప్రారంభంలో ఒక పాట, ఎండ్ టైటిల్ కార్డ్స్ సమయంలో మరో పాటలోనూ పూజా నర్తించింది. ఇక నటనకూ ఎలాంటి స్కోప్ లేకపోయింది. దాంతో సహజంగానే పూజా కోసం థియేటర్లకు వచ్చిన వాళ్ళంతా నిరాశకు లోనయ్యారు. ఇక ఈ నెలాఖరులో రాబోతున్న ‘ఆచార్య’ మీదే అమ్మడు ఆశలన్నీ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.