టీమిండియాలో ప్రస్తుతం కెప్టెన్సీ రగడ నడుస్తోంది. టీ20 ప్రపంచకప్ తర్వాత టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి కోహ్లీ తప్పుకోగా.. ఈ మధ్య అతడిని వన్డే సారథిగానూ తప్పిస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే తనను కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు గంటన్నర ముందే చెప్పారని కోహ్లీ చెప్పడం అతడి అభిమానులను తెగ బాధించింది. కోహ్లీ-గంగూలీ చెప్పిన విషయాలు వేర్వేరుగా ఉండటం క్రికెట్ అభిమానుల్ని గందరగోళానికి గురిచేసింది.
Read Also: విరాట్ కోహ్లీకి ద్రావిడ్ స్పెషల్ క్లాస్
2014లో ధోనీ నుంచి టెస్టు బాధ్యతలు అందుకున్న కోహ్లీ.. ఓ ఏడాది కుంబ్లే కోచింగ్‌లో జట్టును సమర్ధంగానే నడిపించాడు. కానీ ఆ తర్వాత అంతర్గత విభేదాల కారణంగా కుంబ్లే కోచ్‌గా తప్పుకున్నాడు. ఆ తర్వాత బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీకి ఇష్టం లేకపోయినా కోహ్లీ కోసం మాజీ క్రికెటర్, కామెంటేటర్ రవిశాస్త్రిని భారత జట్టు కోచ్‌గా నియమించారు. ఆ తర్వాత కోహ్లీ-రవిశాస్త్రి జోడీ చాలా బాగా రాణించింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశాల్లో ఆయా జట్లనే టెస్టు సిరీసుల్లో ఓడించి అద్భుతాలు చేసింది. దీంతో పాటు టెస్టు ర్యాంకుల్లో టీమిండియా అగ్రస్థానంలో నిలిచింది. కానీ గతేడాది టెస్టు ఛాంపియన్ షిప్‌లో మాత్రం రన్నరప్‌గా నిలిచింది. ఇప్పుడు 2023 టెస్టు ఛాంపియన్ షిప్ కోసం టీమిండియా సమాయత్తమవుతోంది. ప్రస్తుతం టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్‌గా విరాట్ ఉన్నాడు. 2021 టెస్టు ఛాంపియన్ షిప్ వరకు అతడే కొనసాగవచ్చు. ఇందులో ఎలాంటి ఢోకా లేదు. ఎందుకంటే టెస్టుల్లో కోహ్లీ బాధ్యతల్ని అందుకునే ఆటగాడు ప్రస్తుతం ఇంకా బీసీసీఐకి కనిపించడం లేదనే విషయం మాత్రం అంగీకరించాల్సిందే.
Read Also: కీపర్ రిషబ్ పంత్ కు అరుదైన గౌరవం
అయితే పరిమిత ఓవర్ల ఫార్మాట్ విషయంలో మాత్రం కోహ్లీకి ప్రత్యామ్నాయాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ కెప్టెన్‌గా ఇప్పటివరకు కప్పు కొట్టలేకపోయిన కోహ్లీని, ముంబై ఇండియన్స్ జట్టును ఐదుసార్లు విజేతగా నిలిపిన రోహిత్ శర్మను పోల్చి చూస్తున్నారు. దీనికి తోడు 2019 వన్డే ప్రపంచకప్, ఈ ఏడాది యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో కోహ్లీ సారథ్యంలో మన జట్టు కప్పు గెలుచుకోకపోవడం అతడికి మరో మైనస్‌గా మారింది. 2017లో ధోనీ నుంచి పరిమిత ఓవర్ల కెప్టెన్సీ అందుకున్న విరాట్ సాధారణ మ్యాచుల్లో బాగానే సక్సెస్ అయినప్పటికీ ఐసీసీ టోర్నీల్లో మాత్రం తేలిపోతున్నాడు. అతడి వైఫల్యాలను ఎత్తిచూపడానికి విమర్శకులకు ఇది కూడా ఓ అవకాశమైంది.
Read Also: సచిన్ రికార్డ్ బ్రేక్ చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్
మరోవైపు 2019 నవంబరులో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన పింక్ బాల్ టెస్టులో చివరగా సెంచరీ చేసిన కోహ్లీ.. ఆ తర్వాత మూడంకెల స్కోరు చేయలేకపోయాడు. ఇప్పటికీ సెంచరీ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అలాగే రాబోయే కాలంలో 2022 టీ20 ప్రపంచకప్(ఆస్ట్రేలియా), 2023 వన్డే ప్రపంచకప్(ఇండియా) కూడా ఉన్నాయి. వీటిని కూడా బీసీసీఐ దృష్టిలో పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. అందుకే విరాట్‌ను పరిమిత ఓవర్ల ఫార్మాట్ల నుంచి తప్పించి కొత్త వాళ్లకు కెప్టెన్సీ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఆ సమయంలో ఐపీఎల్‌లో ఐదుసార్లు తన జట్టును విజేతగా నిలిపిన రోహిత్ కనిపించాడు. అతడి అనుభవం కూడా జట్టుకు పనికొస్తుందని భావించిన భారత క్రికెట్ బోర్డు.. హిట్ మ్యాన్‌కు బాధ్యతలు అప్పగించింది.
ఒకవేళ రోహిత్ సక్సెస్ కాకపోతే?
కోహ్లీని తప్పించి రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇచ్చారు. ఒకవేళ రోహిత్ శర్మ కూడా కెప్టెన్ గా సక్సెస్ కాకపోతే ఏంటి? అని పలువురు క్రీడాభిమానులు అంటున్నారు. దీంతో కెప్టెన్ రోహిత్‌కు దక్షిణాఫ్రికా పర్యటనలో జరిగే వన్డే సిరీస్ పరీక్షగా నిలవనుంది. నయా కెప్టెన్ రోహిత్ శర్మ అనుభవం, టీమ్ ఇండియాకు ఈ సిరీస్‌లో ఎంతవరకు పనికొస్తుందో వేచిచూడాలి.
రోహిత్ కూడా తాత్కాలికమేనా?
ప్రస్తుతం వన్డేలకు కొత్త కెప్టెన్‌గా నియమించిన రోహిత్ శర్మ కూడా కెప్టెన్‌గా మహా అయితే మరో 2-3 ఏళ్లు మాత్రమే ఉండేలా కనిపిస్తుంది. ప్రస్తుతం అతడి వయసు 34 ఏళ్లు. మరికొన్నేళ్లలో అతడు రిటైర్మెంట్ కూడా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ సమయంలోనే కోహ్లీ కూడా ఆటకు వీడ్కోలు పలికొచ్చు కూడా. అందులో భాగంగానే రానున్న రెండేళ్లు కీలక టోర్నీలు ఉన్నాయి కాబట్టే సీనియర్ క్రికెటర్, ఓపెనర్ రోహిత్ శర్మకు అవకాశామిచ్చినట్లు తెలుస్తోంది.
ఆ తర్వాత కెప్టెన్ ఎవరు?
రోహిత్ శర్మ తర్వాత టీమ్ ఇండియాకు కనిపిస్తున్న ఆశాకిరణం కేఎల్ రాహుల్. రోహిత్ తర్వాత కెప్టెన్ అయ్యే అవకాశాలు ఇతడికి మెండుగా ఉన్నాయి. ఏ స్థానంలో అయినా సరే బ్యాటింగ్ చేయగలడం, ఓపెనర్‌గా బ్యాటింగ్‌లో మంచి రికార్డు ఉండటం, వికెట్ కీపర్ కూడా కావడం ఇతడికి కలిసొచ్చే అంశాలు. ఈ నేపథ్యంలోనే దక్షిణాఫ్రికా టూర్‌లో టెస్టు జట్టుకు ఇతడినే వైస్ కెప్టెన్‌గా నియమించారు. అన్నీ కుదిరితే త్వరలో అన్ని ఫార్మాట్లకు టీమ్ ఇండియాకు కేఎల్ రాహుల్ కెప్టెన్ కావొచ్చు.