తెలంగాణ సర్కార్, సీఎం కేసీఆర్, ఆయన ఫ్యామిలీపై మరోసారి ఫైర్ అయ్యారు బీజేపీ నేత విజయశాంతి అలియాస్ రాములమ్మ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ దీక్షలో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ… అన్ని జిల్లాల్లో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.. కానీ, ఖాళీలను భర్తీ చేయడం లేదు.. పది మంది ఉద్యోగులు చేయాల్సిన పని.. ఇద్దరితో చేయిస్తున్నారని మండిపడ్డారు. జిల్లాల్లో పెండింగ్ ఫైళ్లు పెరిగిపోతున్నాయన్నారు. ఇక, సచివాలయంలోనూ ఫైళ్లు పేరుకపోతున్నాయన్న ఆమె.. సీఎం.. సచివాలయానికి రాకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. సీఎం పనిచేయరు.. కానీ, జీతం తీసుకుంటారు.. సీఎం ఫ్యామిలీ మొత్తం జీతాలు తీసుకుంటుందని విమర్శించారు.
ఇక, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు విజయశాంతి.. మీ తల్లి ఈ భూమిపైకి మిమ్మల్ని తీసుకురావడానికి ఎంత కష్టపడింది.. మీ చదువులు, భవిష్యత్ కోసం తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో ఒక్కసారి తెలుసుకోవాలని సూచించిన ఆమె.. తెలంగాణ కోసం చేసిన పోరాటం.. మళ్లీ ఇప్పుడు చేద్దామని పిలుపు ఇచ్చారు. పిరికితనంతో ఆత్మహత్యలు చేసుకోవద్దు.. ఈ ప్రభుత్వంపై పోరాటం చేద్దామని కోరిన రాములమ్మ.. ఈ ప్రభుత్వాన్ని కూలదూసే సత్తా యువతకు ఉందన్నారు.. కేసీఆర్ ప్రజా సమస్యలను పక్కకు పెట్టారని, టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం వచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో అనేక సమస్యలపై బీజేపీ పోరాడుతుందని వెల్లడించారు. జిల్లాలు పెరిగినప్పుడు.. ఉద్యోగాలు పెరగాలి.. మరి ఎందుకు భర్తీ చేయడం లేదు? అని ప్రశ్నించారు విజయశాంతి.. ఇంకా ఆమె ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి..