వరంగల్ దశ తిరగనుందా? ఓరుల్లు ఇక హెల్త్ సిటీగా రూపుదిద్దుకోనుందా? అంటే అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఎంతో చారిత్రక నేపథ్యం వున్న వరంగల్ నగరంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మాణానికి సంబంధించి జీవో విడుదలైంది. 15 ఎకరాల్లో 1,100 కోట్లతో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణాలకు అనుమతి మంజూరు చేస్తూ జీవో జారీచేసింది రాష్ట్ర ప్రభుత్వం.
24 ఫ్లోర్లతో భారీ భవన సముదాయం, 2,000 పడకలు ఇక్కడ ఏర్పాటుచేయనున్నారు. సూపర్ స్పెషాలిటీ కోసం 800 పడకలు వుంటాయి. వరంగల్ ను హెల్త్ హబ్ గా తీర్చిదిద్దడం కోసం వేగంగా అడుగులు పడుతుండడంతో వరంగల్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ సెంట్రల్ జైల్ స్థలంలో 33 అంతస్థుల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి 11 వందల కోట్ల నిధులు విడుదల చేసింది ప్రభుత్వం.
జూన్ 21వ తేదీన 33 అంతస్తుల ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు సీఎం కేసీఆర్. ముఖ్యమంత్రి కేసీఆర్ కు, వైద్యారోగ్య శాఖామంత్రి హరీష్ రావు కు ఓరుగల్లు ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలిపారు జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు.
రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్. ఎ. ఎం. రిజ్వీ, జీ ఓ 158 ని జారీ చేశారు. ఇందులో సివిల్ వర్క్స్ కి 509 కోట్లు, మంచినీరు, పారిశుద్ధ్యం కోసం 20.36 కోట్లు, మెకానికల్, ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్ పనుల కోసం 182.18 కోట్లు, వైద్య పరికరాల కోసం 105 కోట్లు, అనుబంధ పనుల కోసం 54.28 కోట్లు, చట్టబద్ధమైన పనులు, పన్నుల కోసం 229.18 కోట్ల నిధుల కోసం అనుమతులు ఇచ్చారు. Tsmsidc, dme ఆధ్వర్యంలో వెంటనే పనులు చేపట్టాలని రిజ్వి ఆ జీ ఓ లో అదేశించారు.
ఇదిలా ఉండగా, వరంగల్ హెల్త్ సిటీ నిర్మాణంలో భాగంగా, వరంగల్ సెంట్రల్ జైలు స్థలం లో సీఎం కెసిఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం శంకు స్థాపన చేయడమే గాక, ఇచ్చిన మాట ప్రకారం నిధులు కూడా మంజూరు చేయడమే పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు సీఎం కెసిఆర్, వరంగల్ అభివృద్ధి పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న కేటీఆర్ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.
అలాగే, ఆర్థిక శాఖ మంత్రి, వైద్య ఆరోగ్యశాఖ అప్పగించడం వల్ల పనులు మరింత వేగం కాగలవని ఆశిస్తూ, మంత్రి హరీష్ రావుకి కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తి అయితే, హైదరాబాద్ స్థాయి అద్భుత వైద్యం, ఇక్కడే ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. హైదరాబాద్ లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పై భారం తగ్గుతుందని చెప్పారు. సీఎం కెసిఆర్ అధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్య, వైద్యం, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు. మాట తప్పని, మడమ తిప్పని ప్రభుత్వం కేసిఆర్ ది అని మరోసారి రుజువైందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.