తెలుగు సినిమాకు పాటే ప్రాణం. చాలా మంది పాటలు రాయగలరు. కానీ, వాటికి ప్రాణం పోసేది మాత్రం కొందరే. అందులో సిరివెన్నెల సుప్రిసిద్ధులు. ఏది రాసినా..అందులోని ఏదో ఒక వాఖ్యం నీలో నిలిచిపోతుంది. మనసు తలుపు తడుతుంది. ఆయన కలం నుంచి జాలువారిన పాట మన నాలుకపై నాట్యమాడుతుంది.
సిరివెన్నెల ఈ లోకం నుంచి వెళ్లిపోవచ్చు…కానీ ఆయన పంచిన ఆ పాటల వెన్నెల కరిగిపోదు. ఆ సుమధుర గీతాలు నిత్యం ఆయనను గుర్తు చేస్తూనే ఉంటాయి. అందుకే అంటారు మహానుభావులకు మరణం లేదని.
ఓ కృష్ణశాస్ర్తి ..ఓ ఆత్రేయ..ఓ ఆరుద్ర..ఓ సినారే.. ఓ వేటూరిలా ఓ సీతారామశాస్త్రి. ఆయన పేరు తెలుగు హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆది భిక్షువు వాడినేది కోరేది…బూడిదిచ్చేవాడినేది అడిగేది..అని అడిగిన వేదాంతి. బోటనీ క్లాసు ఉంది మ్యాటనీ ఆట వుంది..అంటూ అల్లరి చేసిన తుంటరి. ఏది పాట రాసినా దానికో స్థాయి కల్పించిన సృజనశీలి.. సాహిత్య శిల్పి. గొప్ప రచయితే కాదు గొప్ప కవి కూడా. చిత్రసీమ పాటల తోటలో ఆయన పూయించిన అందమైన పూలెన్నో. ఎంతని వాటిని ఏరుకోగలం.
సముద్రాల రాఘవాచార్య నుంచి వేటూరి వరకు ఎందరో మహానుభావులు తెలుగు హృదయాలను రంజింప చేశారు. ప్రేక్షకులను అలరింపజేశారు. పాటను సుసంపన్నం చేశారు. తెలుగు పాటపై తమదైన ముద్రవేశారు. తెలుగు సినిమా పాట స్థాయిని పెంచి తెలుగువారికి గర్వకారణమయ్యారు. రాసిన ప్రతి పాటకు న్యాయం చేసి వారికి నిజమైన వారసుడు అనిపించుకున్నారు సిరివెన్నెల. అద్భుతమైన సాహిత్య విలువలతో తెలుగు ఖ్యాతి ఖండంతారలకు విస్తరింపచేశారాయన.
సిరివెన్నెల కన్నుమూత తెలుగు పాటకు గుండె కోత. ఆయన ఇంటి పేరు చెంబోలు. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు. విశ్వనాథ్ సిరివెన్నెలే ఆయన ఇంటి పేరైంది. నాటి నుంచి తనలో శ్వాస ఉన్నంత వరకు మనకు పాటల వెన్నెల పంచారు.
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని సమాజాన్ని’ అని ప్రశ్నించిన ఆయన ఆవేశంలో శ్రీశీ వంటి ఓ అభ్యుదయ కవిని చూస్తాం. ఆయన సామాజిక విలువలకు..సామాజిక స్పృహకు ఆ పాట అద్దం పడుతుంది. జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది ..అన్నపుడు ఆయనలో ఓ ఆత్రేయ కనిపిస్తారు. రుద్రవీణలో..నమ్మకు నమ్మకు ఈ రేయిని..అంటూ ఆరుద్రను మరిపిస్తారు. తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ ..అంటూ కృష్ణశాస్త్రి భావుకతను స్పృశిస్తారు. అంతేకాదు.. సినారే చిలిపితనం…వేటూరి కొంటె తనం కలగలిపిన సరస శృంగార కవి సిరివెన్నెల.
కె. విశ్వనాథ్ కాంబినేషన్‌లో వచ్చిన సిరివెన్నెల,స్వయం కృషి, స్వర్ణకమలం, శృతి లయలు వంటి అనేక సినిమాలకు సీతారామశాస్త్రి అద్భుత సాహిత్యం అందించారు. తాజాగా రాజమౌళి కొత్త సినిమా ఆర్ ఆర్ ఆర్ కోసం రాశారు. నాని ‘శ్యామ్ సింగరారు’ సినిమా కోసం రెండు పాటలు రాశారు. ఇదే ఆయన చివరి చిత్రం.
మూడు దశాబ్ధాలకు పైగా ఆయన పాటల పరిమళం తెలుగునాట గుభాళించింది. ఆయన జీవించి ఉన్నన్ని రోజులు మనకు రోజూ సాహిత్య విందే. పదకొండు నందులు అందుకున్నారు. రెండేళ్ల క్రితం భారత ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది. భౌతికంగా లేకపోయినా..ప్రతీ పాటలో ఆయన జీవించే ఉంటారు.!!
-Dr. Ramesh Babu Bhonagiri