జమ్మలమడుగు వైసీపీలో నేతల మధ్య పంచాయితీ మళ్లీ మొదటికొచ్చిందా? పార్టీ పెద్దల సంతృప్తి కోసమే చేతులు కలిపారా? నాయకుల మధ్య వైరం అలాగే ఉందా? కొత్త రగడ పార్టీలో కాక రేపుతోందా? ఆ ఇద్దరు నాయకుల మధ్య సయోధ్య కష్టమేనా? లెట్స్ వాచ్!
ఇద్దరి మధ్య సఖ్యత కష్టమేనా?
కడప జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలకు కేంద్రమైన జమ్మలమడుగులో 2019 ఎన్నికల తర్వాత కీలక పరిణామాలు జరిగాయి. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి టీడీపీని వైసీపీలో చేరిన తర్వాత నియోజకవర్గంపై మరింత పట్టు చిక్కిందని అధికారపార్టీ నేతలు భావించారు. కానీ.. రామసుబ్బారెడ్డిపై గెలిచిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాత్రం.. వైరిపక్షం చేరికను జీర్ణించుకోలేకపోతున్నారు. కలిసి పనిచేయాలని పార్టీ పెద్దలు చెబుతున్నా.. ఎమ్మెల్యే వర్గం ససేమిరా అనడం.. అవమానాలు.. అలకలు.. కామనైపోయాయి. పలు సందర్భాలలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి.. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డిల మధ్య సయోధ్యకు యత్నించినా అవి ఫలించ లేదు. తాజాగా ఇద్దరి మధ్య జరిగిన ఘటన చూశాక ఇద్దరి మధ్య సఖ్యత సాధ్యమేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
రామసుబ్బారెడ్డిని ముందు వరసలోకి రావాలన్న ఎంపీ అవినాష్
‘వెనక ఉన్నవాళ్లను వెనకనే ఉండనీలే.. ముందు స్థలం లేదన్న’ ఎమ్మెల్యే!
ఇటీవల జమ్మలమడుగులో కొత్త కూరగాయల మార్కెట్ ప్రారంభోత్సవానికి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి వచ్చారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి కూడా హాజరయ్యారు. అయితే రామసుబ్బారెడ్డి వెనక వరసలో కూర్చున్నారు. అది గమనించిన ఎంపీ అవినాష్‌రెడ్డి.. ముందు వరసలోకి రావాలని రామసుబ్బారెడ్డిని కోరారు. ఎంపీ విన్నపం మేరకు రామసుబ్బారెడ్డి ముందుకు రాబోతుండగా.. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చేసిన కామెంట్స్ వేడి పుట్టించాయి. ‘వెనక ఉన్నవాళ్లను వెనకనే ఉండనీలే.. ముందు స్థలం లేదు..!’ అని ఓపెన్‌గానే ఎమ్మెల్యే కామెంట్ చేశారట. దీంతో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వ్యాఖ్యలను అవమానంగా భావించిన రామసుబ్బారెడ్డి మీటింగ్ నుంచి వెంటనే వెళ్లిపోయారు. ఎంపీ అవినాష్‌రెడ్డి ఫోన్ చేసినా రామసుబ్బారెడ్డి తిరిగి రాలేదు.
రామసుబ్బారెడ్డిని పులివెందులకు పిలిచి మాట్లాడిన ఎంపీ అవినాష్‌రెడ్డి
పదే పదే అవమానాలు సరికాదన్న రామసుబ్బారెడ్డి!
కొత్త రగడను అక్కిడితో వదిలేస్తే రచ్చ అవుతుందని అనుకున్నారో ఏమో.. అదే రోజు సాయంత్రం రామసుబ్బారెడ్డిని పులివెందులకు పిలిచి మాట్లాడారట ఎంపీ అవినాష్‌రెడ్డి. ‘ఏదో అయిపోయిందే అన్నా.. సర్దుకుపోదాం..! ‘ అని రామసుబ్బారెడ్డితో చెప్పారట ఎంపీ. కానీ.. సీనియర్ నేతగా ఉన్న తనకు ఈ అవమానాలేంటని గట్టిగానే ప్రశ్నించారట మాజీ మంత్రి. ఇలాంటివి పునావృతం కాకుండా చూడాలని ఎంపీతో చెప్పారట. వాస్తవానికి రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరినప్పటి నుంచి ఎమ్మెల్యేతో ఆయన వ్యవహారం ఉప్పు నిప్పుగా ఉండటంతో పార్టీ పెద్దలు సయోధ్యకు యత్నించారు. రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని చెబుతారు. మొన్న ఉగాది రోజున రామసుబ్బారెడ్డి ఇంటికి MLA సుధీర్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి, వైసీపీ కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబులు అల్పాహార విందుకు వెళ్లారు. ఆ సందర్భంగా రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చేయి చేయి కలిపి కలిసి పనిచేస్తామన్నట్టుగా మీడియా ముందు ప్రకటించారు. అదంతా వట్టిదేనని తాజా ఎపిసోడ్‌తో తేలిపోయింది.
జమ్మలమడుగు వైసీపీలో మళ్లీ మొదటికొచ్చిన రగడ
అంతా బాగుంది ఇక కలిసిపోయారు అనుకునే సమయంలో మళ్ళీ సీన్ మొదటికి వచ్చింది. జమ్మలమడుగు రాజకీయాలలో రామసుబ్బారెడ్డి ప్రమేయాన్ని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. మాజీ మంత్రి అనుచరులకు ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు కాకుండా సుధీర్‌రెడ్డి అడ్డుకుంటున్నారట. మరి.. మార్కెట్ ఓపెనింగ్ ఎపిసోడ్‌లో చెలరేగిన మంటలను పార్టీ పెద్దలు ఏవిధంగా చల్లారుస్తారో చూడాలి.