‘అందాల నటుడు’ అన్న మాటను ఇంటిపేరుగా మార్చుకున్నారు నటభూషణ శోభన్ బాబు. ఆయన నటజీవితం కూడా అంతే ప్రత్యేకతను సంతరించుకుంది. తెలుగు చిత్రసీమలో తారాపథం చేరుకోవడానికి దాదాపు పుష్కరకాలం ప్రయత్నం సాగించి, చివరకు అగ్రకథానాయకుల సరసన చోటు సంపాదించిన ఘనుడు నటభూషణ శోభన్ బాబు. ఇంతలా స్టార్ డమ్ కోసం తంటాలు పడ్డ మరో స్టార్ హీరో తెలుగునాట మనకు కనిపించరు.ఇద్దరు భామల మధ్య నలిగే పాత్రల్లో పలుమార్లు కనిపించి మురిపించిందీ ఆయనే. నుదుటిపై రింగుపడేలా హెయిర్ స్టైల్ సెట్ చేసుకొని, రింగుబాబుగానూ పేరొందిన ఘనతా ఆయనదే. ఈ నాటికీ ‘శోభన్ బాబు రింగు’ అన్న మాట తెలుగునాట విశేషంగా వినిపిస్తూనే ఉంటుంది.
శోభన్ బాబు అసలు పేరు ఉప్పు శోభనాచలపతిరావు. 1937 జనవరి 14న జన్మించిన శోభన్ బాబు బి.ఎస్సీ దాకా చదివారు. చదువుకొనే రోజుల నుంచీ నాటకాల్లో నటించేవారు. సినిమా రంగంలో రాణించాలన్న అభిలాషతో చెన్నపట్టణం చేరిన శోభన్ బాబు ఆరంభంలో పలు కష్టాలు, నష్టాలు చవిచూశారు. యన్టీఆర్ హీరోగా రూపొందిన పార్ట్ లీ కలర్ మూవీ ‘దైవబలం’ లో తొలిసారి తెరపై కనిపించారు శోభన్ బాబు. ఆ తరువాత నుంచీ యన్టీఆర్ ప్రోత్సాహంతో అనేక చిత్రాలలో నటించారు. దాదాపు 20కిపైగా యన్టీఆర్ సినిమాల్లో శోభన్ బాబు కీలక పాత్రలు పోషించారు. యన్టీఆర్ దగ్గరుండి మరీ ‘వీరాభిమన్యు’ లో టైటిల్ రోల్ పోషింప చేశారు.
వి.మధుసూదనరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘వీరాభిమన్యు’ అనూహ్య విజయం సాధించింది. అయినా, అందులో యన్టీఆర్ శ్రీకృష్ణ పాత్ర ముందు టైటిల్ రోల్ లో కనిపించినా, శోభన్ బాబుకు ఆశించిన స్టార్ డమ్ దక్కలేదు. మళ్ళీ యన్టీఆర్ సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తూ సాగారు. ఆ సమయంలో ‘పుణ్యవతి’లోనూ యన్టీఆర్, సినిమాకు ప్రాణం లాంటి పాత్రను శోభన్ బాబు చేత పోషింపచేశారు. అందులో “ఇంతేలే నిరుపేదల బ్రతుకులూ…” , “పెదవులపైన సంగీతం…” వంటి హిట్ సాంగ్స్ శోభన్ బాబుపైనే చిత్రీకరించారు. నటునిగా మంచి పేరు లభించిందే కానీ, కోరుకున్న తారాపథం దక్కలేదు. శారదనాయికగా రూపొందిన ‘మనుషులు మారాలి’ చిత్రం ఘనవిజయం సాధించినా, అప్పుడూ అంతే- శోభన్ బాబుకు ఆ క్రెడిట్ చిక్కలేదు. ఇలా ఎత్తులూ పల్లాలూ చూస్తూ సాగుతున్న శోభన్ బాబును విజయతీరం చేర్చిన చిత్రం ‘తాసిల్దార్ గారి అమ్మాయి’. ఆ చిత్రం తరువాత శోభన్ బాబు మరి వెనుదిరిగి చూసుకోలేదు.
అప్పటి దాకా యన్టీఆర్, ఏయన్నార్, జగ్గయ్య వంటి కథానాయకుల చిత్రాలలో సైడ్ రోల్స్ లో కనిపించిన శోభన్ బాబు, మధ్య మధ్యలో సోలో హీరోగా నటించినా, అంతగా అలరించలేకపోయారు. ‘తాసిల్దార్ గారి అమ్మాయి’లో తండ్రీకొడుకులుగా శోభన్ బాబు అభినయం జనాన్ని ఆకట్టుకుంది. ఆపై వరుసగా “చెల్లెలికాపురం, సంపూర్ణ రామాయణం, మానవుడు-దానవుడు, కాలం మారింది, జీవనతరంగాలు, శారద, మైనర్ బాబు, ఇదాలోకం, డాక్టర్ బాబు, ఖైదీబాబాయ్, మంచిమనుషులు” వంటి చిత్రాలలో కథానాయకునిగా మురిపించారు శోభన్ బాబు. ఈ చిత్రాల ద్వారా మహిళాభిమానులను విశేషంగా సంపాదించుకున్నారు. ‘లవ్వర్ బోయ్’ఇమేజ్ తో సాగారు. ఏయన్నార్ తరువాత నవలానాయకుడు అన్న టైటిల్ నూ సొంతం చేసుకున్నారు.
1975వ సంవత్సరం శోభన్ బాబు హవా విశేషంగా వీచింది. ఈ యేడాది శోభన్ బాబు నటించిన నాలుగు చిత్రాలు హైదరాబాద్ నగరంలో డైరెక్టుగా శతదినోత్సవాలు చూశాయి. ఆ రికార్డు ఇప్పటి దాకా భాగ్యనగరంలో ఏ హీరోకూ దక్కలేదు. “దేవుడు చేసిన పెళ్ళి, జీవనజ్యోతి, జేబుదొంగ, సోగ్గాడు” చిత్రాలు 1975లో హైదరాబాద్ లో డైరెక్ట్ హండ్రెడ్ డేస్ చూశాయి. దాంతో శోభన్ బాబు పేరు మారుమోగి పోయింది. ఉత్తమనటునిగా పలుమార్లు కళాసాగర్ అవార్డులు అందుకున్నారు శోభన్.
తన స్టార్ డమ్ తగ్గుముఖం పట్టగానే శోభన్ బాబు కెమెరా ముందుకు రాకూడదని నిర్ణయించుకున్నారు. ఎంత పరుగుపెట్టేవాడికైనా, ఏదో ఒక చోట అలసట కలుగక మానదు. పరువు ఉన్నప్పుడు పరుగు ఆపాలనీ అంటారు. పరుగు ఆపడమూ ఓ కళే అని శోభన్ బాబు నటజీవితాన్ని చూసి తెలుసుకోవాలి. చివరి దాకా ‘అందాలనటుడు’ అన్న పదం శోభన్ బాబుకు ఓ అలంకారంగా ఉండేది. ఆ ఇమేజ్ ను కాపాడుకుంటూనే ఆయన సాగారు.