సింగరేణిలో సుదీర్ఘకాలం తరువాత సమ్మె సైరన్ మోగింది.నేటి నుంచి మూడు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చాయి కార్మిక సంఘాలు. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఆందోళనలకు దిగారు. మరో 11 డిమాండ్లతో కార్మిక సంఘాలు సమ్మె చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా 88 బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా సింగరేణి కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి.18 ఏళ్ల తర్వాత అన్ని కార్మిక సంఘాలు ఏకమయ్యాయి. రాష్ట్రంలోని నాలుగు బొగ్గు బ్లాకులు సింగరేణికి కాకుండా ప్రైవేటు సంస్థలకు అప్పగించడం కార్మికులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ బొగ్గు బ్లాకుల అన్వేషణ కోసం సంస్థ 750 కోట్లు ఖర్చు చేసింది. నూతనంగా గుర్తించిన బొగ్గు బ్లాకులను తన పరిధిలోకి తీసుకువచ్చేలా కేంద్రం ఇటీవలే చట్టం చేసింది. ఫలితంగా సింగరేణి సంస్థకు నూతన గనుల అనుమతి లభించలేదు. ఈ క్రమంలోనే సింగరేణి యాజమాన్యం గుర్తించిన నాలుగు బొగ్గు బ్లాకులను కేంద్రం స్వాధీనం చేసుకొని వేలం వేసేందుకు నిర్ణయించింది. ఈనెల 13న బొగ్గు బ్లాకులకు సంబంధించిన బిడ్డింగ్ ఉంది. ఐతే..దీనికంటే ముందే సమ్మె చేసి కేంద్రానికి తమ నిరసన తెలపాలని నిర్ణయించాయి కార్మిక సంఘాలు. అందులో భాగంగానే గతనెల టిబిజీకేఎస్ యూనియన్ సమ్మె నోటీసు ఇచ్చింది.
గుర్తింపు యూనియన్ టీబీజీకేఎస్, జాతీయ కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్, బీఎంఎస్ జేఏసీగా ఏర్పడి సమ్మెకు దిగాయి.నేటి నుంచి 72 గంటల పాటు సింగరేణిలో ఉన్న 44 గనులు 19 ఓసీపీలు, 25 భూగర్భ కేంద్రాల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోనుంది. రోజుకు 2 లక్షల టన్నుల చొప్పున మూడు రోజుల్లో 6 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలగనుందని యాజమాన్యం చెబుతోంది. హైదరాబాదులోని రీజినల్ లేబర్ కమిషనర్‌తో జరిగిన చర్చలు విఫలం కావటంతో సమ్మె చేసేందుకు కార్మిక సంఘాలు మొగ్గు చూపించాయి.