2025-26 Academic: తెలంగాణలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల వార్షిక ఫీజుల పెంపుపై స్పష్టత ఇంకా రాలేదు. 2025–26 విద్యా సంవత్సరం నుంచి వచ్చే మూడు సంవత్సరాల పాటు ఫీజులను నిర్ణయించేందుకు టీఏఎఫ్ఆర్సీ (తెలంగాణ అడ్మిషన్లు & ఫీజులు నియంత్రణ కమిటీ) అనేక సార్లు సమావేశమైనా, ఇప్పటికీ తుది నిర్ణయం తీసుకోలేకపోయింది. ప్రైవేట్ కాలేజీలు ఆడిట్ నివేదికలను తమ అనుకూలంగా రూపొందించారని ఆరోపణల నేపథ్యంలో, విద్యాశాఖ , ఉన్నత విద్యామండలి ప్రత్యేకంగా సమీక్ష సమావేశాలు నిర్వహించాయి. అయితే ఫీజుల ఖరారుపై నిర్ణయం మళ్లీ వాయిదా పడింది. మార్చి నెలలో నిర్వహించిన హియరింగ్‌లో కొన్ని కాలేజీలు మాత్రమే టీఏఎఫ్ఆర్సీ ప్రతిపాదనలకు అంగీకారం తెలిపాయి. మిగిలినవి విరుద్ధంగా స్పందించాయి.
విద్యా నాణ్యతపై సందేహాలు ఉన్నా కూడా కొన్నికాలేజీలు తమ ఫీజులను రూ.1.5 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు పెంచాలని ప్రతిపాదించాయి. దీని ప్రకారం, మూడు సంవత్సరాల్లో ఒక విద్యార్థికి రూ.5 లక్షల వరకు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది తల్లిదండ్రులకు, ప్రభుత్వానికి పెద్ద భారం అవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇంజనీరింగ్ సీట్ల పెంపు, కోర్సుల విలీనంపై తుది నిర్ణయం ప్రభుత్వాధీనమేనని హైకోర్టు తాజాగా స్పష్టం చేసింది. అందులో భాగంగా, ప్రభుత్వం ఫీజు వ్యవహారాన్ని పునః సమీక్షిస్తోంది. కొన్నికాలేజీలు ప్రతిపాదించిన పెంపు శాతాలు ఏకంగా 70% వరకు ఉండటం అధికారులు ఆశ్చర్యానికి గురిచేసింది.
1500 కంటే ఎక్కువ సీట్లు కలిగిన కొన్ని కాలేజీలు ఇప్పటికే రూ.24 కోట్లు వరకు వార్షిక ఆదాయం పొందుతుండగా, ఫీజు పెరిగితే ఇది రూ.40 కోట్లకు చేరుతుందని అంచనా. కొన్ని ప్రముఖ కాలేజీలు ఏకంగా రూ.2 లక్షల ఫీజు పెంపును కోరడం మీద అధికారులు తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. టీఏఎఫ్ఆర్సీ సిఫార్సులను స్వీకరించలేమని కొందరు తేల్చిచెప్పారు. ఫీజు పెంపు 30 శాతాన్ని మించకూడదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో టీఏఎఫ్ఆర్సీ కొత్త ఫీజు జాబితాను సవరించాల్సి ఉంటుంది. ఆపై మరోసారి సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఇష్టారీతిగా ఫీజు పెంపుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక ఖర్చుతో ప్రైవేట్ కోర్సులపై మరింత భారం పడుతుందన్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.