ఈరోజు కాంగ్రెస్ పార్టీ విద్యార్ధి, నిరుద్యోగ సైరన్‌కు పిలుపునిచ్చింది. దిల్‌షుఖ్ నగర్‌కు చేరుకొని అక్కడి నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ చేయాలి అన్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. అయితే, దిల్‌షుఖ్ నగర్- ఎల్బీనగర్ ప్రాంతంలో నిత్యం ట్రాఫిక్ అధికంగా ఉంటుంది. దీంతో పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సీఎం అయ్యాక పేదోళ్లు విద్యకు దూరం అయ్యారని, కులవృత్తులకు పరిమితం కావాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ రాక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. శాంతియుతంగా నిరసన తెలపాలనే సైరన్‌కు పిలుపునిచ్చామని, ఎల్బీనగర్ ను ఇండియా, పాకిస్థాన్ సరిహద్దులా మార్చారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గృహనిర్భంధంతో తమను అడ్డుకోవాలని అనుకుంటున్నారని, తెలంగాణ మేధావులు, ఉద్యోగులు ఆలోచన చేయాలని అన్నారు. ఉస్మానియా యూనివర్శిటీ ఉద్యమ స్పూర్తి ఎక్కడకు పోయిందని అన్నారు. అమర వీరుల ప్రాణాలకు విలువ లేకుండా పోయిందని, భారీ పోలీసుల బలగాలు పెట్టి ప్రభుత్వం ఎవరిమీద దాడి చేయాలని చూస్తోందని ప్రశ్నించారు. ప్రజలు తిరస్కరించిన వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చారని, ప్రభుత్వాన్ని ఇచ్చిన నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. నిరుద్యోగులకు ఆగ్రహం వస్తే ప్రభుత్వం కాలి బూడిద అవుతుందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
Read: 75 శాతం మంది ప్రజలు బీజేపీ వైపే ఉన్నారు… ఈటల