చదువుకున్నవాళ్లు విదేశాలకు వెళ్లి వ్యాపారాలు చేసుకుంటున్నారు.. ప్రపంచ దేశాల అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఎంతో ఉంది.. కానీ, మనదేశానికి వారు సేవలు అందించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జరిగిన 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండా ఎగురవేసిన ఆయన.. ఆ తర్వాత ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఇతర దేశాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న భారతీయులు.. మన దేశానికి సేవ చేయకపోవడానికి మన రాజకీయ నాయకులే ప్రధాన కారణమని మండిపడ్డారు.. ఇక్కడ ఏది పెట్టాలన్నా.. కౌన్సిలర్ నుంచి ఎమ్మెల్యే వరకు అందరకీ లంచాలు ఇవ్వాల్సి వస్తోందంటూ సంచలన ఆరోపణలు చేసిన జనసేనాని.. ఈ విధానం మారితేనే దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు..
ఇక, నాటి త్యాగాలు, ఉద్యమ స్ఫూర్తి నేటి తరంలో రావాలని ఆకాంక్షించారు పవన్ కల్యాణ్.. డబ్బులిచ్చి ఓట్లు కొనుక్కునే విధానం, ఓట్లు అమ్ముకునే విధానం మారాలన్న ఆయన… ప్రభుత్వ పథకాలకు సీఎం ఆయన కుటుంబ సభ్యుల పేర్లు పెట్టుకుంటున్నారని విమర్శించారు. మన దేశం, రాష్ట్రం కోసం పోరాడే మహనీయులు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. జనసేన అధికారంలోకి వస్తే అన్ని పథకాలకు జాతీయ నాయకుల పేర్లే పెడతామని.. రాష్ట్రంలోని మహనీయుల పేర్లను కూడా పెడతామని వెల్లడించారు. ఇక, జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన 75వ స్వాతంత్ర్య వేడుకలను చూసేందుకు.. పవన్ ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి..