ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. రేపు అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని… ఈ అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ వెల్లడించింది. మూడు రోజుల పాటు ఏపీలో కుండపోత వర్షాలు పడతాయని వాతావరణశాఖ సూచించింది. ఈ మేరకు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రానున్న 24 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Read Also: నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వరుణుడి బీభత్సం..
మరోవైపు ఏపీలోని గుంటూరు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అటు కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ఏపీలోని రాయలసీమ జిల్లాలలో భారీ వర్షాల కారణంగా ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. దీంతో పలు జిల్లాల కలెక్టర్లు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.