పార్లమెంట్ సమావేశాలలో విపక్ష పార్టీల ఉమ్మడి వ్యూహం ఖరారు చేసేందుకు ఇవాళ ఉదయం రాహుల్ గాంధీ అధ్యక్షత సమావేశం అయ్యారు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు… తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఎన్‌సీపీ, శివసేన, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ.. ఎస్పీ, సీపీఎం, ఆమ్‌ఆద్మీ, సీపీఐ, ఇలా 14 ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రభుత్వంపై పోరాటం చేసే విధంగా ఉమ్మడి వ్యూహాన్ని రచించేలా సమాలోచనలు జరిపారు. అంతేగాక, కేంద్రం తీరుకు నిరసనగా పార్లమెంట్ బయట విపక్షాలు ఆందోళన చేయనున్నారు. జులై 19న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాగా… అందుకు ఒక్క రోజు ముందు పెగాసస్‌తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారం వెలుగు చూసింది. ప్రతిపక్ష నేతలు, కొందరు కేంద్ర మంత్రులు. ఇతర ప్రముఖులు, సీనియర్ జర్నలిస్టుల ఫోన్లను కూడా హ్యాక్ చేసినట్టు కథనాలు వచ్చాయి. అప్పటి నుంచి పెగాసస్ పై విపక్షాలు ఆందోళన చేస్తూనే ఉన్నాయి.. పార్లమెంట్ ఉభసభల్లోనూ ప్రతీరోజూ విపక్షాల నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక, ఈ రోజు మధ్యాహ్నం జంతర్ మంతర్ లో దీక్ష చేస్తున్న రైతులకు సంఘీభావం తెలపనున్నారు విపక్ష పార్టీల ఎంపీలు. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ కూడా హాజరుకానున్నారు.