కేరళలో వెలుగు జూసిన కొత్త వైరస్ నోరా టెర్రర్ పుట్టిస్తోంది. ఇప్పటికే 13 మందికి సోకినట్టు వెల్లడించిన ప్రభుత్వం, వ్యాధిని అరికట్టే అంశాల మీద దృష్టిపెట్టింది. ఇప్పుడు వ్యాధిసోకి బాధితులంతా వయనాడ్ జిల్లాకు చెందిన వెటర్నరీ కాలేజీ విద్యార్థులని తేలింది. అంతుచిక్కని వైరస్‌లతో కేరళ మళ్లీ మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. కరోనాతో ఇప్పటికే అతలాకుతలం అయిన కేరళలో ఇప్పుడు మరో కొత్త వైరస్ కనిపించింది. వయినాడ్ జిల్లాలోని ఓ పశు వైద్యకళాశాలకు చెందిన 13 మంది విద్యార్థుల్లో నోరా వైరస్ బయటపడింది. రెండు వారాల్లోనే ఇది పదమూడు మందికి సోకినట్టు కేరళ ఆరోగ్యశాఖ వెల్లడించింది. డయేరియా, వాంతులు ఈ వైరస్ లక్షణాలు అని చెప్పుకొచ్చిన ప్రభుత్వం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. కాలేజీ బయట హాస్టళ్లలోని విద్యార్థుల్లో తొలిసారి ఈ వైరస్‌ను గుర్తించారు. వారి రక్త నమూనాలను అలప్పుజలోని జాతీయ వైరాలజీ డిపార్ట్‌మెంట్‌కు పంపించారు. విషయం తెలుసుకున్న ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించి వ్యాధి వ్యాప్తిని అడ్డుకోడానికి కఠిన చర్యలు చేపట్టాలన్నారు. తాగునీటి వనరులను ఎప్పటికప్పుడు శుభ్రపర్చుకోవాలని, చికిత్స తీసుకుంటే వ్యాధి నుంచి కోలుకోవచ్చని తెలిపారు. ఇటీవల కోవలంలో వీధి శునకాలు మృతి చెందటం కూడా ప్రజల్ని ఆందోళనకు గురి చేసింది. రెండు వారాల్లోనే 20 కుక్కలు మృతి చెందాయి. ఏ వ్యాధి సోకి శునకాలు మృతి చెందాయనే విషయాన్ని పశుసంవర్ధక శాఖ వైద్యులు ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు. కనైన్ డిస్టెంపర్ వైరస్ శునకాల మరణానికి కారణం కావచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు మనుషులకు వ్యాపించినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు.