కరోనా బూస్టర్ డోస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. గతంలో రెండు డోసులు ఏ వ్యాక్సిన్ తీసుకున్నారో… బూస్టర్ డోసుగా కూడా దాన్నే తీసుకోవాలని స్పష్టం చేసింది. మిక్స్ అండ్ మ్యాచ్ వద్దని తేల్చి చెప్పింది మోడీ సర్కార్. మూడో డోసుల విషయంలో మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా చర్చ సాగుతోంది.
దేశంలో మళ్లీ కరోనా కోరలు చాస్తోంది. థర్డ్ వేవ్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే రోజువారీ కేసులు 2లక్షలకు చేరువలో వున్నాయి. అంతేకాదు… ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సీన్ తీసుకున్న వాళ్ళు కూడా ఇన్ఫెక్షన్ బారినపడుతున్నారు. ముఖ్యంగా డాక్టర్లు, వైద్య సిబ్బంది కరోనా బారినపడి ఐసోలేషన్లోకి వెళ్తున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది.
రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా దీని బారిన పడుతున్నవారు ఎక్కువమందే. ఈ పరిస్థితుల్లో ప్రమాదపుటంచున గల వారికి బూస్టర్ డోస్ లేదంటే అదనపు డోసు వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది ప్రభుత్వం. అయితే… మూడో డోస్‌గా గతంలో తీసుకున్న కంపెనీకి చెందిన వ్యాక్సిన్ తీసుకోవాలా? లేక మరే కంపెనీ వ్యాక్సిన్ అయినా తీసుకోవచ్చా అనే దానిపై సందిగ్ధం నెలకొంది. దీనితో సుదీర్ఘ చర్చ జరిగింది. అయితే, గతంలో తీసుకున్న కంపెనీకి చెందిన వ్యాక్సినే మూడో డోసుగా ఇవ్వాలన్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్-WHO సలహాను పాటించింది మోడీ సర్కార్.
గతంలో దేశంలో వ్యాక్సీన్ కొరత తలెత్తినప్పుడు మిక్స్ అండ్ మ్యాచ్ అంశం తెరపైకి వచ్చింది. మొదటి డోసుకు భిన్నమైంది రెండో డోసుగా ఇవ్వొచ్చని పలువురు ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. కానీ… ప్రభుత్వం మాత్రం రెండు డోసుల్నీ ఒక కంపెనీ ఉత్పత్తి చేసిన వాటిని పంపిణీ చేసింది. అయితే, వ్యాక్సీన్లకు తీవ్రమైన కొరత ఏర్పడినప్పుడు మాత్రమే మూడో డోసుగా మిక్స్ అండ్ మ్యాచ్‌కు ప్రయత్నించ వచ్చని WHO సూచిస్తోంది. అయితే, మిక్స్ అండ్ మ్యాచ్‌కు సంబంధించి ఇంకా తమ దగ్గర సమగ్ర సమాచారం లేదని, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్నది చెప్పలేమని WHO చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో మిక్స్ మ్యాచ్‌పై విషయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
దేశంలో ఇంత వరూ 151 కోట్ల డోసులకు పైగా కరోనా వ్యాక్సిన్ల పంపిణీ జరిగింది. 70కోట్ల మందికి పైగా రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. ప్రభుత్వపరంగా జరిగిన వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో కొందరికి కోవాగ్జిన్, ఇంకొందరికి కోవీషీల్డ్ వ్యాక్సీన్ లభించింది. ఇప్పుడు మూడో డోసుగా కూడా గతంలో తీసుకున్న కంపెనీకి చెందినే వ్యాక్సీనే తీసుకోవాలి.
కరోనా సోకిన వాళ్ల ఐసోలేషన్‌కు సంబంధించి కూడా కొత్త గైడ్‌లైన్స్ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. కరోనా పాజిటీవ్‌గా నిర్ధారణ అయినా… స్వల్ప లక్షణాలు లేదా ఎలాంటి లక్షణాలు లేని వాళ్లు వారం రోజుల పాటు హోం ఐసోలేషన్లో ఉంటే సరిపోతుంది. ఇటువంటి వాళ్లకు వరుసగా 3 రోజుల జ్వరం రాకూడదు. అంతేకాదు… కరోనా విషయంలో సొంత వైద్యం ఏమాత్రం పనికి రాదని కేంద్రం స్పష్టం చేసింది. X-రే, CT-స్కాన్ వంటి రేడియో ఆధారిత నిర్ధారణ పరీక్షలకు పరుగులు పెట్టొద్దని స్పష్టం చేసింది. డాక్టర్ సూచిస్తేనే అటువంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేసింది.