దేశంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయని సంతోషించే సమయంలో కేంద్రం మరో బాంబు పేల్చింది. ధక్షిణాఫ్రికాలో బి.1.1.529 అనే కొత్త వేరియంట్‌ను గుర్తించారని, కొత్త వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెబుతూ కేంద్రం హైఅలర్ట్ ప్రకటించింది. అన్ని రాష్ట్రప్రభుత్వాలకు కేంద్రం లేఖ రాసింది. ఇక విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు మూడంచెల పద్దతిలో స్క్రీనింగ్ చేయాలని కేంద్రం ఆదేశించింది. విదేశాల నుంచి వచ్చేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా దక్షిణాఫ్రికా, హాంకాంగ్ నుంచి వచ్చే వారిపట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
Read: అధికమొత్తంలో బొగ్గును కొనుగోలు చేస్తున్న ఆఫ్ఘన్లు… ఎందుకంటే…
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రం కొత్త వేరియంట్ పట్ల హైఅలర్ట్ ప్రకటించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా మాటను మర్చిపోయి ప్రజలు ఇప్పుడిప్పుడే సాధారణ జీవనం గడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో కొత్త వేరియంట్‌పై అలర్ట్ రావడంతో ప్రజల్లో అయోమయం, భయం నెలకొన్నది. భారత్‌లో డెల్టా వేరియంట్ ఎలాంటి భీభత్సం సృష్టించిందో చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు సంభవించాయి.
డెల్టా వేరియంటలో 8 మ్యూటేషన్లు జరిగితే, కొత్తగా దక్షిణాఫ్రికాలో బయటపడిన బి.1.1.529 వేరియంట్‌లో 32కి పైగా మ్యూటేషన్లు జరిగినట్టు వైరాలజిస్టులు గుర్తించారు. అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఈ వేరియంట్‌ను గుర్తించిన వైరాలజిస్ట్ టులియో డే ఒలివెరా పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలో బయటపడిన ఈ వేరియంట్ ఇప్పుడు బోట్స్‌వానా, హాంకాంగ్‌లో కూడా బయటపడినట్టు తెలిపారు. ఈ నెల మొదట్లో రోజూ 106 కేసులు నమోదవుతుండగా, ఈ వేరియంట్‌ను గుర్తించిన తరువాత దక్షిణాఫ్రికాలో రోజూ వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయని వైరాలజిస్టులు తెలిపారు. కాగా, దక్షిణాఫ్రికా, హాంకాంగ్ నుంచి వచ్చే ప్రయాణికుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం హెచ్చరించింది.