హైదరాబాద్: టాలీవుడ్ లెజెండరీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని ఫిలింఛాంబర్‌లో ఉంచారు. ఆయనకు తుది నివాళులు అర్పించడానికి పలువురు సినీ ప్రముఖులు ఫిలింఛాంబర్‌కు తరలివస్తున్నారు. బుధవారం ఉదయం సిరివెన్నెల పార్థివదేహాన్ని త్రివిక్రమ్, రాజమౌళి, కీరవాణి, విక్టరీ వెంకటేష్, సాయికుమార్, తనికెళ్ల భరణి, మణిశర్మ, టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఎస్వీ కృష్ణారెడ్డి, మారుతి, మురళీమోహన్, నందినీరెడ్డి తదితరులు సందర్శించి నివాళులర్పించారు. తాజాగా హీరో నందమూరి బాలకృష్ణ కూడా సిరివెన్నెల భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాలయ్య ఎమోషనల్ అయ్యారు.
Read Also: సిరివెన్నెల మృతదేహానికి సజ్జనార్ నివాళి
ఈరోజు చాలా దుర్దినం అని… ఒక నమ్మలేని నిజం… ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదని బాలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాషకు, సాహిత్యానికి ఒక భూషణుడు సిరివెన్నెల అని.. తాను పుట్టిన నేలకు వన్నె తెచ్చిన మహా వ్యక్తి అని కొనియాడారు. 1984లో విశ్వనాథ్ దర్శకత్వంలో తాను నటించిన జననీ.. జన్మభూమి చిత్రంతోనే సిరివెన్నెల సినీ పరిశ్రమకు పరిచయం కావడం తన అదృష్టమన్నారు. సిరివెన్నెల లేరంటే చిత్ర పరిశ్రమ శోక సముద్రంలో ఉన్నట్లు ఉందన్నారు. తనకు సాహిత్యం అంటే ఇష్టమని.. సిరివెన్నెలతో కలిసినప్పుడల్లా తాము సాహిత్యంపై ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్లం అని తెలిపారు. సిరివెన్నెల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని స్పష్టం చేశారు. పుట్టినవారు గిట్టక తప్పదు.. కానీ 66 ఏళ్ళకే సిరివెన్నెల వెళ్లిపోయారంటూ బాలయ్య కంటతడి పెట్టుకున్నారు.