తెలంగాణలో బీజేపీ-టీఆర్ఎస్ నేతల మధ్య హోరాహోరీ మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. మంత్రి హరీష్ రావు సందర్భం వచ్చినప్పుడల్లా బీజేపీ నేతల్ని చెడుగుడు ఆడేస్తుంటారు. కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారు. 317 జీవో రద్దు అంటే.. నిరుద్యోగులకు ఉద్యోగాలు వద్దు అన్నట్టే అన్నారు మంత్రి హరీష్ రావు. జిల్లాల్లో స్థానికులకు ఉద్యోగాలు దక్కుతాయి. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా 317 జీఓ వచ్చింది. ఎవరి మీద పోరాటం చేస్తున్నారో బీజేపీ నేతలు ఆలోచించుకోవాలన్నారు.
ఈ ప్రక్రియ పూర్తి అయితే ఖాళీగా ఉన్న 60, 70 వేల ఉద్యోగాలను నింపాలని ప్రభుత్వం చూస్తోంది. వాళ్ళకి నిరుద్యోగుల మీద ప్రేమ లేదు. కేవలం రాజకీయం కోసం మాట్లాడుతున్నారు. పేదలకు ఉద్యోగాలు రావొద్దని..మాట్లాడుతున్నారు. నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే కేంద్రం వద్ద ఖాళీగా ఉన్న 10లక్షల 62 వేల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి. అవి నింపకుండా నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారు.
మీరు భర్తీ చేయరు.. మేము చేసే ప్రయత్నం చేస్తే ఒప్పుకోరు. దమ్ముంటే తెలంగాణ పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా తేవాలని హరీష్ రావు సవాల్ విసిరారు. వడ్లు కోనరు, డీజిల్ ధర పెంచుతారు, ఎరువుల ధర పెంచుతరు, బాయిల కాడ మీటర్లు పెడుతరు.. ఉద్యోగాలు ఇవ్వరు. రైతులకు పెట్టుబడి పెంచుతారు. ఒక్కజాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలేరు. మెడికల్ కాలేజీ ఇవ్వరు. ఇలా అన్ని వర్గాల వారికి, అన్ని విషయాల్లో బీజేపీ నష్టం చేసింది. బీజేపీ నాయకులకు కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు హరీష్ రావు.