(జూన్ 12న హీరో గోపీచంద్ పుట్టినరోజు)
“ఎక్కడ పారేసుకుంటామో, అక్కడే వెదకాలి” అంటారు పెద్దలు. గోపీచంద్ మనసు చిత్రసీమలో పారేసుకున్నాడు. కాబట్టి, అక్కడే తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని తపించాడు. చివరకు అనుకున్నది సాధించి, హీరోగా విజయాన్ని సొంతం చేసుకున్నాడు. మాస్ హీరోగా పలు చిత్రాలలో జనాన్ని అలరించిన గోపీచంద్, ఓ నాటి ప్రముఖ దర్శకుడు టి.కృష్ణ తనయుడు! టి.కృష్ణ దర్శకత్వంలో అనేక అభ్యుదయభావాలతో చిత్రాలు రూపొంది విజయం సాధించాయి. వాటిలో ‘ప్రతిఘటన’ చిత్రం మరపురానిది. గోపీచంద్ అన్న ప్రేమ్ చంద్ కూడా తండ్రి బాటలోనే పయనిస్తూ దర్శకుడు కావాలని కలలు కన్నాడు. ముత్యాల సుబ్బయ్య వద్ద అసోసియేట్ గా పనిచేస్తున్న ప్రేమ్ చంద్ కారు ప్రమాదంలో మరణించారు. ఆ సమయంలో రష్యాలో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న గోపీచంద్ కు తన చదువు పూర్తి కాగానే చిత్రసీమపై మనసు మళ్ళింది. ఆ విషయాన్ని తన తండ్రికి ఆప్తులైన వారితో చెప్పాడు. టి.కృష్ణ మెమోరియల్ ఫిలిమ్స్ బ్యానర్ పై గోపీచంద్ ను హీరోగా పరిచయం చేస్తూ ఎమ్.నాగేశ్వరరావు ‘తొలివలపు’ చిత్రాన్ని నిర్మించారు. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ సమయంలో దర్శకుడు తేజ తన ‘జయం’ చిత్రంలో గోపీచంద్ కు విలన్ వేషం ఇచ్చాడు. ఆ సినిమాలో గోపీచంద్ నటన అందరినీ అలరించింది.
‘జయం’లో ప్రతినాయకునిగా మార్కులు సంపాదించిన గోపీచంద్ కు తరువాత కూడా తేజ తన ‘నిజం’లో విలన్ గానే అవకాశమిచ్చాడు. అది అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ, గోపీచంద్ నటునిగా మార్కులు పోగేసుకోగలిగాడు. ఆ తరువాత ఎమ్మెస్ రాజు నిర్మించిన ‘వర్షం’లోనూ మరోమారు ప్రతినాయకునిగా గోపీచంద్ అలరించాడు. ఆ సినిమా ఘనవిజయంతో గోపీచంద్ కు వరుసగా విలన్ వేషాలే వచ్చాయి. అయితే హీరో కావాలన్న అభిలాషతో ఉన్న గోపీచంద్ వాటిలో దేనినీ అంగీకరించలేదు. టి.కృష్ణకు సన్నిహితులైన పోకూరి బాబూరావు, గోపీచంద్ హీరోగా ‘యజ్ఞం’ చిత్రం నిర్మించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తరువాత “ఆంధ్రుడు, లక్ష్యం, శౌర్యం” వంటి చిత్రాలలో హీరోగా అలరించాడు గోపీచంద్. అతను కోరుకున్న హీరో స్థానం లభించింది. ఆ పై గోపీచంద్ ను వరుస పరాజయాలు పలకరించాయి. ఆ సమయంలో ‘లౌక్యం’ మంచి విజయాన్ని అందించింది. తరువాత “జిల్, సౌఖ్యం” చిత్రాలు కూడా ఆకట్టుకున్నాయి. “గౌతమ్ నంద, ఆక్సిజన్, పంతం, చాణక్య” చిత్రాలు అంతగా అలరించలేకపోయాయి. నయనతార వంటి స్టార్ హీరోయిన్, అనేక బ్లాక్ బస్టర్స్ తీసిన బి.గోపాల్ కాంబినేషన్ లో గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’లో నటించాడు. ఆ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల విడుదలకు నోచుకోలేక పోయింది. ప్రస్తుతం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన ‘సీటీమార్’పైనే ఆయన ఆశలన్నీ ఉన్నాయి. ఈ సినిమా ఏప్రిల్ లో జనం ముందుకు రావలసి ఉంది. అయితే కరోనా కల్లోలం కారణంగా వాయిదా పడింది. మారుతి దర్శకత్వంలో ‘పక్కా కమర్షియల్’ అనే చిత్రంలో గోపీచంద్ నటిస్తున్నాడు. ఈ పుట్టినరోజు తరువాత గోపీచంద్ కోరుకుంటున్న సక్సెస్ ఆయన దరి చేరుతుందని ఆశిద్దాం.