ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక అక్కడ ప్రజలు పడరానిపాట్లు పడుతున్నారు. దాదాపు అన్ని దేశాలు తమ ఎంబసీలను ఖాళీ చేసి వెళ్లిపోయాయి. అంతర్జాతీయంగా తాలిబన్ ప్రభుత్వానికి గుర్తింపులేకపోవడంతో ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్నారు. పైగా పలు ఉగ్రవాద సంస్థలు ఆఫ్ఘన్‌లో దాడులకు పాల్పడుతున్నాయి. ప్రజాస్వామిక ప్రభుత్వం లేకపోవడంతో అమెరికా నిధులను నిలిపివేసింది. అయితే, మానవతా దృక్పధంతో ఇండియా వంటి దేశాలు ప్రజలు శీతాకాలంలో ఇబ్బందులు పడకూడదని 50 వేల మెట్రిక్ టన్నుల గోధుమలను, మందులను సరఫరా చేస్తున్నది.
Read: వాల్డమార్ట్ బాటలో అంబానీ… ఆస్తుల పంపకం విషయంలో…
ఇక ఇదిలా ఉంటే, రాజధాని కాబూల్‌లోని ప్రజలు పెద్ద మొత్తంలో బొగ్గును కొనుగోలు చేస్తున్నారు. టన్నుల కొద్ది బొగ్గును కొనుగోలు చేసి ఇండ్లలో నిల్వ చేసుకుంటున్నారు. శీతాకాలంలో అక్కడ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయి. ఇండ్లలో వేడి కోసం బొగ్గును మండిస్తారు. గ్యాస్, ఎలక్ట్రిసిటీ సాయంతో నడిచే హీటర్లు ఉన్నా, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాటిని కొనగోలు చేయలేమని, బొగ్గు అయితే తక్కువ ధరకు దొరుకుందని అందుకే కొనుగోలు చేస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. బొగ్గును మండించడం వలన వాతావరణానికి హాని కలిగించే వాయువులు విడుదలయ్యి పర్యావరణం దెబ్బ తింటుందని, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలిసినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో బొగ్గును వినియోగించాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు.