తెలంగాణ కాంగ్రెస్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి మధ్య పొంతన కుదరడం లేదు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జగ్గారెడ్డి పార్టీలో విముఖతతోనే ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా కాంగ్రెస్‌లో జగ్గారెడ్డి తీరుతో టీఆర్‌ఎస్ కోవర్టు అంటూ వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఆయన నేను కేసీఆర్ కోవర్టును కాదని, నేనేవరికీ అమ్ముడుపోయే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. అయితే తాజాగా మరోసారి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో కొత్తగా వచ్చిన వారు చేసేదేమిలేదని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీకీ సోనియా, రాహుల్ గాంధీలే బలమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్‌లో బురద జల్లే సంస్కృతి ఈ మధ్యనే స్టార్ట్ అయ్యిందని ఆయన ఆరోపించారు. నేను కూడా సీఎంని కలవాలని అపాయింట్‌మెంట్ అడుగుతున్నానన్నారు. ఎవడో ఏదో అనుకుంటే నేనే రాజకీయం చేయలేను అని ఆయన మండిపడ్డారు. పార్టీ అధ్యక్షున్ని కలిస్తే తప్పు కానీ సీఎంని కలిస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలు సీఎంని కలవకూడదు అనేది తప్పని ఆయన అన్నారు. ఒక వ్యక్తి పార్టీని కబ్జా చేసే అవకాశం లేదని, కానీ పార్టీకి నష్టం చేకూర్చే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.