తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ సైతం తాజాగా ప్రకటించారు. గతంలో మాదిరిగా ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని తేల్చిచెప్పారు. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని.. వాటన్నింటిని పూర్తి చేశాకే ఎన్నికలకు వెళుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక టీఆర్ఎస్ ఆవిర్భావించిన 20ఏళ్లు పూర్తయిన సందర్భంగా వచ్చే నెల 15న వరంగల్ లో భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు.‘విజయగర్జన’ పేరుతో నిర్వహించనున్న ఈసభకు దాదాపు 10లక్షల మందిని తరలించి ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే షాకివ్వాలని టీఆర్ఎస్ భావిస్తోంది.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యతను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీసుకున్నారు. ప్రతిపక్షాలకు గట్టి షాకిచ్చేలా ‘విజయగర్జన’ సభను విజయవంతం చేయాలని ఆయన భావిస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రత్యామ్నాయం లేదని అందరి తెల్సివచ్చేలా ఈ సభను నిర్వహించేలా కేటీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ప్రతీ గ్రామం నుంచి జనాలను బస్సుల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలంతా రంగంలోకి దిగుతున్నారు.
విజయగర్జన సభకు ఇన్ చార్జిగా మంత్రి కేటీఆర్ వ్యవహరించనుండగా పర్యవేక్షణ బాధ్యతను ఎంపీ కేశవరావు నిర్వర్తించనున్నారు. ఈమేరకు మంత్రి కేటీఆర్ ప్రతీరోజు 20నియోజకవర్గాల వర్గాల ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటి కానున్నారు. దీనిలో భాగంగానే సోమవారం టీఆర్ఎస్ భవన్లో 20మంది ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ భేటి అయ్యారు. క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ గురించి ప్రజలు ఏం అనుకుంటున్నారు? గ్రౌండ్ లెవల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అనే వాటిపై ఆయన ఆరా తీస్తున్నారు. రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన ప్రజల్లోకి ఎలాంటి అభిప్రాయం ఏర్పడింది? ప్రజల మన్నలను పొందేలా ఇంకా ఎలాంటి కార్యక్రమాలను రూపొందించవచ్చు అనే వాటిపై ఎమ్మెల్యేల అభిప్రాయం కోరారు.
టీఆర్ఎస్ ను గ్రామస్థాయిలో మరింత బలపరిచేలా ఎమ్మెల్యేలంతా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. ఈమేరకు ప్రత్యేక కార్యచరణను సిద్ధం చేయాలని ఆదేశించారు. అదేవిధంగా విజయగర్జన సభను విజయవంతం చేసేలా ఎమ్మెల్యేలంతా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కేటీఆర్ సూచించారు. విజయగర్జన సభను విజయవంతం చేసేందుకు మంత్రి కేటీఆర్ ప్రతీ రోజు 20మంది చొప్పున దాదాపు 400మంది టీఆర్ఎస్ ముఖ్య నేతలను భేటికానున్నట్లు తెలుస్తోంది. వరంగల్ లో నిర్వహించే ఈ సభకు దాదాపు 10లక్షల మందిని తరలించి ప్రతిపక్షాలకు గట్టి షాకివ్వాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈమేరకు ఆపార్టీ ముఖ్యనేతలంతా రంగంలోకి దిగి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.