దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 30 శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీకి ఎదురుగాలి వీచింది. బీజేపీ కేవలం 7 స్థానాల్లో మాత్రమే గెలవగా… ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మాత్రం 8 స్థానాల్లో విజయం సాధించింది. మిగతా 15 స్థానాలను ప్రాంతీయ పార్టీలు గెలుచుకున్నాయి. దేశంలో మూడు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగితే కేవలం మధ్యప్రదేశ్ ఖండ్వా స్థానంలోనే బీజేపీ విజయం సాధించింది. దాద్రానగర్ హవేలీలో శివసేన, హిమాచల్ ప్రదేశ్ మండీలో కాంగ్రెస్ విజయం సాధించాయి.
Read Also: దీపావళి వేళ ప్రజలకు ఊరట… తగ్గిన వంటనూనెల ధరలు
బెంగాల్‌లో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే అన్నిచోట్ల టీఎంసీ విజయకేతనం ఎగురవేసింది. మూడు చోట్ల అయితే బీజేపీ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. ఇక కర్ణాటకలో రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ చెరొకటి గెలుచుకున్నాయి. రాజస్థాన్‌లో రెండు అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్ విజయం సాధించింది. అసోంలో 5 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా మిత్రపక్షం యూపీపీఎల్‌తో కలిసి బీజేపీ అన్ని స్థానాలను కైవసం చేసుకుంది. మధ్యప్రదేశ్‌లో మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా రెండు చోట్ల బీజేపీ, మరో చోట కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీకి షాక్ తగిలిందనే చెప్పాలి. సీఎం జైరాం ఠాకూర్ సొంత జిల్లాలోని లోక్‌సభ స్థానాన్ని, మరో మూడు శాసనసభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది.