ఈటల రాజేందర్.. బీజేపీలో చేరినప్పటి నుంచి.. పార్టీలో కుదురుకోవడానికి సమయం తీసుకున్నారు. ప్రారంభంలో.. కనీసం జాతీయ అధ్యక్షుడితో కండువా వేయించుకోకుండానే పార్టీలో చేరారని.. బండి సంజయ్ తో పాటు.. కిషన్ రెడ్డి.. ఇతర సీనియర్లు ఈటలతో కలిసి నడవడం లేదని.. బీజేపీలో ఈటల ఒంటరి అయ్యారని.. రకరకాల ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. వాటిని అధిగమించేందుకు ఈటల చాలా సమయమే తీసుకున్నారు.
ఆ శ్రమకు.. నిర్మల్ సభ రూపంలో.. ఈటల ప్రతిఫలం అందుకున్నారు. పార్టీ అగ్రనేత, ప్రధాన వ్యూహకర్త, ప్రధాని మోడీకి అత్యంత ఆప్తుడు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఆ సభలో ఈటలకు ఇచ్చిన ప్రాధాన్యం చూస్తే.. ఆ సమయంలో ఈటల మొహంలో ఆనందం చూస్తే.. ఎవరైనా సరే.. ఇది అనూహ్య మార్పే అని గుర్తించగలరు. నిర్మల్ సభతో.. ఈటలకు బీజేపీలో సముచిత స్థానం దక్కేందుకు పునాది పడినట్టుగానూ.. చెప్పగలరు.
ఇక.. సభలో జరిగిన విషయం చూస్తే.. ఈటల గురించి అమిత్ షా పదే పదే ప్రస్తావించారు. ఆయన్ను పిలిచి.. చేతులు పైకెత్తి.. ఇద్దరూ కలిసి మరీ ప్రజలకు విజయ అభివాదం చేశారు. మరోవైపు.. ఈటల పేరు చెప్పగానే సభకు హాజరైన ఆయన అనుచరులు సంతోషంతో ఈలలు, కేకలు పెట్టి సందడి చేశారు. సభపై నేతలు మాట్లాడే వరస క్రమంలోనూ.. ఆయనకు పార్టీ రాష్ట్ర అగ్రనేతలు తగిన ప్రాధాన్యం ఇచ్చారు.
అంతా లెక్కిస్తే.. మాజీ మంత్రికి బీజేపీలో మంచి రోజులు ప్రారంభమయ్యాయనే చెప్పవచ్చు. అగ్ర నేత అమిత్ షా వచ్చిన తర్వాతే.. ఆయన రాత మారిందని.. అధిష్టానంతో నేరుగా ఈటల మంచి సంబంధాలు నెరుపుతున్నారని చెప్పడానికి ఈ సభే నిదర్శనమని.. అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా.. హుజూరాబాద్ లో తన విజయానికి బాటలుగా మలుచుకోవాల్సిన పని.. ఇక ఈటల చేతిలోనే ఉందని పరిశీలకులు అంటున్నారు.