మధ్యప్రదేశ్ భోపాల్‌లోని ఓ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కమలా నెహ్రూ ఆస్పత్రిలోని మూడో అంతస్తులో మంటలు చెలరేగడంతో నలుగురు చిన్నారులు మరణించారు. ప్రమాదం జరిగిన పిల్లల వార్డులో మొత్తం 40 మంది చిన్నారులు ఉండగా.. మిగతా 36 మంది క్షేమంగా ఉన్నారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న 12 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. మంటలు చెలరేగిన విషయాన్ని తెలుసుకున్న పిల్లల బంధువులు వార్డులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఆస్పత్రి పరిసరాల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Read Also: 50 మంది చిన్నారులను దత్తత తీసుకున్న టీచర్
అగ్నిప్రమాదం జరిగిన కమలా నెహ్రూ ఆస్పత్రికి ఆ రాష్ట్ర మంత్రి విశ్వాస్ సారంగ్ చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనకు షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. కాగా మృతుల తల్లిదండ్రులకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని మంత్రి సారంగ్ ప్రకటించారు.