Bharat Bill Payment System: భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్(బీబీపీఎస్)లో ప్రస్తుతం మన దేశంలో ఉండేవాళ్లు మాత్రమే బిల్లులు పే చేసేందుకు అవకాశం ఉంది. ఈ ఆప్షన్‌ని ఇకపై విదేశాల్లో ఉండే భారతీయులకు (ఎన్‌ఆర్‌ఐలకు) కూడా అందుబాటులోకి తేవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిన్న శుక్రవారం ప్రతిపాదించింది. ఈ మేరకు విధివిధానాలను రూపొందించనున్నారు. గైడ్‌లైన్స్ వస్తే ఇక ఫారన్‌లో ఉన్నా భారత్‌లో బిల్లులు చెల్లించొచ్చు. బీబీపీఎస్ పరిధిలో ప్రస్తుతం 20 వేలకు పైగా బిల్లర్లు నమోదై ఉన్నారు.
కరంట్, వాటర్, టెలిఫోన్, బ్రాడ్ బ్యాండ్, కేబుల్ తదితర బిల్లులు దీని ద్వారా కట్టొచ్చు. వయసు మీదపడ్డ తల్లిదండ్రులు ఇండియాలో ఉండి, పిల్లలు ఇతర దేశాల్లో ఉంటే అలాంటివాళ్లు ఆయా కార్యాలయాలకు వెళ్లి బిల్లులు క్లియర్ చేయటం కష్టమవుతోంది. మన దేశంలో డిజిటల్ పేమెంట్లు పెద్దఎత్తున జరుగుతున్నా విదేశాల్లో ఉన్న ఇండియన్స్ ఈ బిల్లులను పే చేయటంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని ఆర్‌బీఐ ఈ ప్రపోజల్ తెచ్చింది.
Google Gift to India: ‘భారతమాత’కు గూగుల్ తల్లి జేజేలు. ‘ఇండియా కీ ఉదాన్’ ప్రారంభం
‘ఆర్మీ’కి సుమారు 2 లక్షల కోట్లు
2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు వివిధ సైనిక పరికరాల కొనుగోళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు రెండు లక్షల కోట్లు కేటాయించింది. ఈ మూడేళ్లలో 59 ఏఓఎన్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటి విలువ రూ.1,83,778 కోట్లు అని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ లోక్‌సభలో వెల్లడించారు. ఏఓఎన్ అంటే యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ. డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్‌లో మొట్టమొదటి దశ ఇదే. తర్వాత మరో రెండు దశలు ఉంటాయి. అవి.. టెండరింగ్, కాంట్రాక్టింగ్. ఈ మూడు దశలు దాటితేనే రక్షణ సామగ్రి సైన్యం చేతికి చేరుతుంది.
ప్లీజ్ ‘మహింద్రా’
బ్రిటన్‌లోని వెస్ట్ మిడ్‌ల్యాండ్స్ ఏరియాలో మోటర్ సైకిల్ ఫ్యాక్టరీ పెట్టాలంటూ మన దేశంలోని మహింద్రా అండ్ మహింద్రా (ఎం అండ్ ఎం) సంస్థపై లాబీయింగ్ జరుగుతోంది. యూకేలో వాహన తయారీ రంగానికి ఈ ప్రాంతం కీలక కేంద్రం. అక్కడ ఒకప్పుడు 400కు పైగా సంస్థలు ఉండేవి. వాటిలో ఏకంగా 10 లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందేవారు. మన దేశానికి చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ తయారీ కేంద్రం కూడా అక్కడ ఉండటం విశేషం. ఆ ప్రాంతానికి పూర్వ వైభవం తేవటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేయర్ ఆండీ స్ట్రీట్ ‘ఎం అండ్ ఎం’కి ఆహ్వానం పలికారు.