Google Gift to India: మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తికావొస్తున్న నేపథ్యంలో సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ‘ఇండియా కీ ఉదాన్’ అనే ఆన్‌లైన్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇండియా మరికొద్ది రోజుల్లో ఇండిపెండెన్స్ డేకి సంబంధించి డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించనుంది. దీంతో ఈ అరుదైన మైలురాయికి మరింత వన్నె తెచ్చేందుకు గూగుల్ నడుం బిగించింది.
75 ఏళ్ల సుదీర్ఘ కాలంలో మన దేశం సాధించిన అద్భుత విజయాలను ఈ ప్రాజెక్టులో భాగంగా సచిత్రంగా, కళాత్మకంగా చూపిస్తోంది. దేశ చరిత్రకు, చారిత్రక ఘటనలకు అద్దం పట్టేలా దాదాపు రెండు నిమిషాల నిడివి గల స్పెషల్ వీడియోను రూపొందించింది. ఈ ప్రాజెక్టును ‘గూగుల్ ఆర్ట్స్ అండ్ కల్చర్’ విభాగం చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి నిన్న శుక్రవారం ఢిల్లీలో అధికారికంగా ఆరంభించారు.
Paytm Net Loss: పేటీఎంకి పెరిగిన నష్టం. షుగర్ మిల్లులకు ‘తీపి’ కబురు
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను విజయవంతం చేసేందుకు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖతో కలిసి పనిచేస్తామని గూగుల్ ప్రకటించింది. 1947 నుంచి ఇప్పటిదాక భారతదేశ పరిణామక్రమాన్ని, దేశాభివృద్ధికి పౌరులు అందించిన అసమాన సేవలను గణాంకాలతో, కంటెంట్‌తో సహా వివరించింది. ఇందులో భాగంగా ‘డూడుల్4గూగుల్ కంటెస్ట్-2022’ను నిర్వహిస్తోంది. ‘రానున్న 25 ఏళ్లలో నా ఇండియా ఎలా ఉండబోతోందంటే’ అనే అంశంపై 1-10 తరగతి విద్యార్థులకు ఈ పోటీ పెడుతోంది.
ఎంట్రీలను ఆహ్వానిస్తోంది. విజేతకు రూ.5 లక్షల నగదు బహుమతి(కాలేజ్ స్కాలర్‌షిప్) ప్రకటించింది. మరో రూ.2 లక్షలను టెక్నాలజీ ప్యాకేజీ కింద విజేత చదువుకునే స్కూల్‌కి లేదా స్వచ్ఛంద సంస్థకి అందిస్తుంది. విన్నర్ రూపొందించిన డూడుల్4గూగుల్‌ని నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవం సందర్భంగా గూగుల్ హోం పేజీలో ప్రదర్శిస్తుంది. నలుగురు గ్రూప్ విజేతలకు, 15 మంది ఫైనలిస్టులకు సైతం ప్రైజ్‌లు ఇవ్వనుంది.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ‘హర్ ఘర్ తిరంగా’ నేపథ్యంలోనూ ఒక స్పెషల్ డూడుల్‌ని క్రియేట్ చేయాలని గూగుల్ టీమ్‌ని కోరారు. ఆ ప్రత్యేక డూడుల్.. గూగుల్ యూజర్లతోపాటు ప్రతిఒక్కరికీ స్ఫూర్తిగా నిలుస్తుందని, ఈ క్యాంపెయిన్‌లో పాల్గొనేలా ప్రోత్సహిస్తుందని సూచించారు. ‘కేంద్ర ప్రభుత్వ సంరక్షణలో ఉన్న 3000కు పైగా చారిత్రక కట్టడాలకు డిజిటల్ మ్యాపింగ్ రూపకల్పనలో గూగుల్ సంస్థ మా మంత్రిత్వ శాఖకు సాయపడనుంది. అరుదైన ఆర్కైవ్స్‌ని డిజిటల్ మెటీరియల్ రూపంలోకి మారుస్తుంది.
డిజిటల్ మ్యాపింగ్ అందుబాటులోకి వస్తే ఆ పర్యాటక ప్రాంతాల పర్యవేక్షణను మరింత కట్టుదిట్టంగా నిర్వహించొచ్చు. ఆక్రమణలను అరికట్టొచ్చు’ అని కిషన్‌రెడ్డి చెప్పారు. ‘ఇండియా కీ ఉదాన్’ పేరిట చేపట్టిన ఈ ఆన్‌లైన్ కలెక్షన్‌ని గూగుల్ ఆర్ట్స్ అండ్ కల్చర్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఇందులో 120 ఇలస్ట్రేషన్లు, 21 స్టోరీలు ఉన్నాయి. వీటిని 10 మంది ప్రతిభావంతులైన ఆర్టిస్టులు రూపొందించారు. గూగుల్ ఆర్ట్స్ అండ్ కల్చర్ విభాగం తొలి దశాబ్ది వేడుకలను నిర్వహించుకుంటోంది.