ఈ టైటిల్ చూడగానే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ఏంటి క్రికెట్ ఆడుతోందని అనుకుంటున్నారా? అలా అయితే మీరు పప్పులో కాలేసినట్లే. అనుష్క శర్మ 88 బంతుల్లో 52 పరుగులు చేసిందంటూ బీసీసీఐ ట్వీట్ చేసినప్పటి నుంచి నెటిజన్లు ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే బీసీసీఐ ట్వీట్‌లో ఉన్న పేరు విరాట్ కోహ్లీ భార్యది కాదు.. మహిళల అండర్ 19 క్రికెటర్‌ది. మహిళల అండర్-19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీలో భాగంగా టీమ్ బీ జట్టుకు అనుష్క బ్రిజ్ మోహన్ శర్మ ప్రాతినిధ్యం వహిస్తోంది.
Read Also: మన బోణీ అదిరేనా? నేడే అప్ఘనిస్తాన్‌తో భారత్ ఢీ
ఈ సందర్భంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అనుష్క శర్మ 88 బంతుల్లో 52 పరుగులు చేసింది. దీంతో బీసీసీఐ ఉమెన్ ట్విట్టర్ ఖాతాలో ఈ మ్యాచ్‌కు సంబంధించి అప్‌డేట్ ఇచ్చారు. అందులో అనుష్కశర్మ అని రాసి ఉండటంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో అభిమానులు విరాట్ కోహ్లీని ఉద్దేశిస్తూ మీమ్స్, ఫన్నీ పోస్టులు పెడుతున్నారు. అనుష్క మ్యాచ్ ఆడటానికి వెళ్తే.. వామికను ఎవరు చూసుకుంటారు అంటూ ఛలోక్తులు విసురుతున్నారు. కాగా టీ20 ప్రపంచకప్‌లో భారత్ వరుస వైఫల్యాల నేపథ్యంలో విరాట్ కోహ్లీతో పాటు అనుష్క శర్మ, వామికపై కొందరు అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే.
Anushka Sharma 52 runs in 88 balls (5×4, 1×6) India B 140/0 #U19ChallengerTrophy
— BCCI Women (@BCCIWomen) November 2, 2021