తెలుగు రాష్ట్రాల రైతులకు కల్పతెరువుగా మారిన నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన నిర్వహించి నేటితో 66 ఏళ్లు పూర్తవుతోంది. 1955, డిసెంబర్ 10న అప్పటి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ డ్యాం నిర్మాణం 1970లో పూర్తయింది. కృష్ణానదిలపై నిర్మించబడ్డ ఆనకట్టల్లో నాగార్జునసాగర్ అతిపెద్దది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో వేలాది మంది కార్మికుల శ్రమశక్తి ఉంది. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో చాలామంది కార్మికులు అసువులు కూడా బాశారు. ప్రపంచంలో రాతినిర్మాణ ప్రాజెక్టుల్లోనే నాగార్జునసాగర్ డ్యాం పొడవు, ఎత్తు ప్రథమస్థానంలో ఉంటాయి. ఈ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ఈ డ్యాం 408 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 26 క్రస్ట్ గేట్లు ఉన్నాయి.
Read Also: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. తెలంగాణలో పట్టాలెక్కనున్న కొత్త పథకం
నాగార్జున సాగర్ ప్రాజెక్టులో కుడి, ఎడమ కాల్వలు కీలకంగా ఉంటాయి. కుడి కాల్వ ఏపీకి, ఎడమ కాల్వ తెలంగాణకు అనుసంధానం చేయబడి ఉంటుంది. కుడికాల్వకు 1956, అక్టోబర్ 10న శంకుస్థాపన చేయగా… 1967 ఆగస్టు 4న కుడికాల్వ ద్వారా నీటిని విడుదల చేసి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ జాతికి అంకితం చేశారు. అందుకే ఈ కాల్వను జవహర్ కెనాల్ అని పిలుస్తారు. ఈ కాల్వ గుంటూరు, ప్రకాశం జిల్లాలలో సుమారు 203కి.మీ. మేర ప్రవహిస్తూ ఉంటుంది. ఎడమ కాల్వకు 1959లో అప్పటి గవర్నర్ భీంసేన్ సచార్ శంకుస్థాపన నిర్వహించగా… ఎడమ కాల్వను కూడా కుడికాల్వతో పాటే 1967 ఆగస్టు 4న ఇందిరాగాంధీనే ప్రారంభించారు. ఎడమ కాల్వను లాల్‌బహదూర్ కెనాల్ అని పిలుస్తారు. మొత్తం 297 కి.మీ. పరిధిలో ఉన్న ఈ కాలువ ద్వారా 10.38 లక్షల ఎకరాలకు నీరు అందుతోంది.