ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘మారుతి సుజుకి’కి 2025 నవంబర్ మాసం ప్రత్యేకంగా మారిందనే చెప్పాలి. గత నెలలో ఎన్నడూ లేనివిధంగా కంపెనీ అత్యధిక కార్ల విక్రయాలను నమోదు చేసింది. ఒకే నెలలో 2.29 లక్షలకు పైగా కార్లను విక్రయించింది. దాంతో మారుతి సుజుకి చరిత్ర సృష్టించింది. మారుతి సుజుకి ఒక నెలలో ఇన్ని కార్లను ఎన్నడూ అమ్మలేదు. జీఎస్టీ రేటు తగ్గింపు, పండుగ సీజన్ అమ్మకాలు కంపెనీకి కలిసొచ్చాయి.
నవంబర్ 2025లో మారుతి సుజుకి మొత్తం 229,021 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది దేశీయ మార్కెట్లో తన బ్రాండ్ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోకు బలమైన డిమాండ్‌ను, అంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ కార్ల ప్రజాదరణలో వృద్ధిని స్పష్టంగా సూచిస్తుంది. మొత్తం అమ్మకాలలో 174,593 యూనిట్లు దేశీయ మార్కెట్లో అమ్ముడయ్యాయి. 8,371 యూనిట్లు ఇతర OEMలకు (టయోటాతో సహా) రవాణా చేయబడ్డాయి. ఈ రికార్డును సాధించడంలో ఎగుమతులు ప్రధాన పాత్ర పోషించాయి. ముఖ్యంగా జిమ్నీ ఫైవ్-డోర్, బాలెనో వంటి మోడళ్లకు ప్రపంచ డిమాండ్ ఉండడం కలిసొచ్చింది.
మారుతి సుజుకి ఎంట్రీ-లెవల్, కాంపాక్ట్ కార్లకు డిమాండ్ బాగా ఉంది. ఈ విభాగంలో ఆల్టో K10, S-ప్రెస్సో, బాలెనో, స్విఫ్ట్, వాగన్ఆర్, డిజైర్, సెలెరియో అమ్మకాలు బాగున్నాయి. జీఎస్టీ 2.0 అమలు తర్వాత ధర తగ్గింపు, పండుగ సీజన్ కావడంతో అమ్మకాలు భారీగా జరిగాయి. మినీ, కాంపాక్ట్ విభాగాలు కలిసి 85,273 యూనిట్స్ అమ్ముడయ్యాయి. గత సంవత్సరంతో పోలిస్తే చాలా ఎక్కువ. మారుతి సుజుకి యుటిలిటీ వెహికల్ విభాగంలో తన ఉనికిని చాటుతోంది. ఇటీవల కంపెనీ తన కొత్త మిడ్-సైజ్ SUV విక్టోరిస్‌ను విడుదల చేసింది. బ్రెజ్జా, ఎర్టిగా, గ్రాండ్ విటారా, XL6, జిమ్నీ, ఇన్విక్టో వంటి ప్రసిద్ధ SUVలు 72,498 యూనిట్లను విక్రయించాయి.
అత్యంత ప్రజాదరణ పొందిన కారు మారుతి ఈకో నవంబర్‌లో 13,200 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈకో వ్యాన్‌కు డిమాండ్ స్థిరంగా ఉంది. సూపర్ క్యారీ 3,622 యూనిట్లు అమ్ముడైంది. మొత్తం దేశీయ అమ్మకాలు 174,593 యూనిట్లకు చేరుకున్నాయి. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు అమ్మకాలు కూడా గత ఆర్థిక సంవత్సరం కంటే మెరుగ్గా ఉన్నాయి. మారుతి సుజుకి తన తొలి ఎలక్ట్రిక్ కారు మారుతి ఇ విటారాను విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ SUV రెండు వేర్వేరు బ్యాటరీ ప్యాక్‌లతో వచ్చింది. ఏడు ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉన్న మారుతి మొదటి కారు ఇదే. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిమీ వరకు ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది.