నీటిపారుదల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష.. ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలి!
జల వనరుల శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల పని తీరుపై ఆరా తీశారు. పోలవరం ప్రాజెక్టుపై చర్చించారు. నిర్ధేశించికున్న లక్ష్యాల మేర పనులు జరగకపోతే.. ఇటు అధికారులు, అటు కాంట్రాక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అనుమతులు ఉండి నిధుల సమస్యలేని ప్రాజెక్టుల్లో జాప్యాన్ని సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వివిధ సాగునీటి ప్రాజెక్టుల పనులు, కొత్తగా చేపట్టే ప్రాజెక్టులపై ఆరా తీశారు. ముందుగా పోలవరం పనులపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. మొత్తం 1379 మీటర్ల డయాఫ్రం వాల్ నిర్మాణం జరగాల్సి ఉందని.. గత నెల ప్రారంభమైన డయాఫ్రం వాల్ పనుల్లో ఇప్పటి వరకు 51 మీటర్లు పూర్తి అయ్యిందని…ఇంకా 1328 మీటర్లు పూర్తి చెయ్యాలని అధికారులు వివరించారు.
వల్లభనేని వంశీ అరెస్ట్.. తదుపరి చర్యలపై మాజీ ఏఏజీ పొన్నవోలు సమాలోచనలు..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో తదుపరి చర్యలపై అతడి తరపు న్యాయవాదులు కసరత్తు చేస్తున్నారు. మాజీ అడిషినల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సమాలోచనలు కొనసాగిస్తున్నారు. వంశీని కోర్టులో హాజరు పరిస్తే రిమాండ్ ను సవాలు చేస్తూ పిటిషన్ చేయటంపై చర్చిస్తున్నారు. రిమాండ్ విధిస్తే బెయిల్ పిటిషన్ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే, కృష్ణలంక పోలీసు స్టేషన్ లో వల్లభనేని వంశీని పోలీసులు విచారిస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి వంశీని ఎంక్వైరీ చేస్తున్నారు. పటమట పోలీసు స్టేషన్ లో నమోదైన కేసులో వంశీకి ఆధారాలు చూపించి వివరణ తీసుకుంటున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంలో పని చేసే సత్యవర్ధన్ ను కిడ్నాప్, దాడి చేశారనే అభియోగాలతో వంశీపై కేసు నమోదు అయింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద వల్లభనేని వంశీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదులో బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలపై వంశీ వివరణను తీసుకుంటున్నారు.
వంశీని ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కావడం లేదు..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు ఎందుకు అరెస్టు చేశారో అర్థం కాలేదు అని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. వంశీ టీడీపీ కార్యాలయ దాడి ఘటనలో బెయిలుపై ఉన్నారు.. ఆయన అరెస్టు పట్ల అందరం దిగ్భ్రాంతి చెందాం.. టీడీపీ దాడి ఘటనలో ఫిర్యాదు చేసిన వ్యక్తి మెజిస్ట్రేట్ వద్దకు వెళ్ళి తాను అసలు ఫిర్యాదు చేయలేదని చెప్పారు.. టీడీపీ వాళ్ళు దొంగ కేసు పెట్టించారని తెలుసుకున్నారు.. ఇది ఒక ఫాల్స్ కేసు అని ప్రపంచానికి తెలిసిందని ఆయన పేర్కొన్నారు. వెంటనే వాళ్ళ సోదరుడిని బెదిరించి మరో తప్పుడు కేసు పెట్టించారు.. వంశీ టీడీపీ నేతలను దూషించటం ఏంటని వాళ్ళు కక్ష్య కట్టారు.. ఎన్నోసార్లు న్యాయస్థానాలకు వెళ్లిన వంశీ బెయిలు తెచ్చుకోగలిగారు.. టీడీపీ వాళ్ళు పోలీసులతో కుమ్మక్కై ఇదంతా చేశారని అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఇక, పోలీసులు వల్లభనేని వంశీని కలవకుండా అతడి భార్యను అనుమతించడం లేదని మాజీమంత్రి అంబటి రాంబాబు అన్నారు. మేము మా రిప్రెసెంటేషన్ ఇవ్వటానికి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చాం.. టైం ఇచ్చిన డీజీపీ మమ్మల్ని కలవలేదన్నారు.
తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై రాజ్యసభలో నిర్మల సీతారామన్ సంచలన వ్యాఖ్యలు..
రాజ్యసభలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రస్తావించారు. ఏపీ విభజన సమయంలో తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉందన్నారు. కానీ ఇప్పుడు అది అప్పుల కుప్పగా తయారైందని తెలిపారు. “నేను ఏ పార్టీని తప్పు పట్టడం లేదు. ఇందిరాగాంధీ గెలిచిన మెదక్ నియోజకవర్గంలో తొలుత రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసింది మోడీ ప్రభుత్వం. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించింది నరేంద్ర మోడీ ప్రభుత్వమే. ఎరువుల ఉత్పత్తిలో రికార్డు స్థాయిలో 12.7 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని పెంచాం. నిజామాబాదులో పసుపు బోర్డు ఏర్పాటు చేసిన ఘనత నరేంద్ర మోడీదే. అత్యద్భుతమైన పసుపు పండే ప్రాంతం నిజామాబాద్. తెలంగాణకు చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం జహీరాబాద్లో పారిశ్రామిక కారిడార్ను ఏర్పాటు చేసినందుకు కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.” అని ఆమె వెల్లడించారు. వరంగల్లో పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేశామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గుర్తు చేశారు. “సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశాం. బీబీనగర్ లో ఎయిమ్స్ ఏర్పాటు చేశాం. 2605 కిలోమీటర్ల జాతీయ రహదారులను వేశాం. భారత్ మాల కింద నాలుగు గ్రీన్ కారిడార్లు ఏర్పాటు చేశాం. 5337 కోట్ల రూపాయల బడ్జెట్ను రైల్వేల అభివృద్ధి కోసం తెలంగాణకు కేటాయించాం.
తూముకుంట మున్సిపాలిటీలో అక్రమ కట్టడాల కూల్చివేత… ప్రకృతి రిసార్ట్స్ నేల మట్టం
తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరయాంజల్ గ్రామంలోని కోమటి కుంటలో గురువారం హైడ్రా అక్రమ కట్టడాలను తొలగించింది. కోమటికుంట ఎఫ్‌టీఎల్ లో నిర్మాణాలపై హైడ్రాకు స్థానికులు ఫిర్యాదులు చేశారు. హైడ్రా ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులతో పూర్తి స్థాయి విచారణ చేపట్టింది. కోమటి కుంట చెరువు పరిధిలో నిర్మించిన ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్వెన్షన్ కు ఎలాంటి నిర్మాణ అనుమతులు లేవని వెల్లడింది.. అలాగే చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోనే ఈ నిర్మాణాలు జరిగినట్టు విచారణలో తేలడంతో కూల్చివేతలకు ఆదేశించింది. హైడ్రా నోటీసులపై ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్మెన్షన్ ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన వాటిని కూల్చివేయాలంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.. తామే తొలగిస్తామని.. 30 రోజుల సమయం కావాలని హైకోర్టును ప్రకృతి రిసార్ట్స్ నిర్వాహకులు కోరారు.. 30 రోజులు దాటినా వాటిని తొలగించకపోవడంతో..నేరుగా రంగంలోకి దిగి కూల్చివేతలు చేపపట్టారు.
మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధింపు..
మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గత రెండేళ్లుగా జాతుల మధ్య ఘర్షణ కారణంగా ఈశాన్య రాష్ట్రం అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆ రాష్ట్ర సీఎం పదవికి బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. కొత్తగా ఎవరూ కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించలేదు. దీంతో కేంద్రం మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ‘‘గవర్నర్ నుంచి నివేదిక అందిన తర్వాత, ఇతర సమాచారాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత, ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం కొనసాగించలేని పరిస్థితి తలెత్తిందని నేను సంతృప్తి చెందాను’’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది. బీరెన్ సింగ్ రాజీనామా తర్వాత సీఎం అభ్యర్థిపై బీజేపీ ఏకాభిప్రాయం రాకపోవడంతో కేంద్రం ఈ చర్య తీసుకుంది.
ప్రధాని మోడీ, ట్రంప్ మధ్య చర్చకు రానున్న అంశాలు ఇవే..
అమెరికా అధ్యక్షుడుగా డొనాల్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రధాని నరేంద్రమోడీ తొలిసారి యూఎస్ పర్యటనకు వెళ్లారు. ఈ భేటీపై భారత్‌తో పాటు అమెరికా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ.. ‘‘కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన మూడు వారాల్లోనే ప్రధాని మోడీని అమెరికా సందర్శించమని ఆహ్వానించడం భారత్-అమెరికా భాగస్వామ్య ప్రాముఖ్యతను చూపిస్తుంది.’’ అని అన్నారు. ‘‘వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, రక్షణ సహకారం, ఉగ్రవాద నిరోధకత, ఇండో-పసిఫిక్ భద్రత,’’ వంటి అంశాలు ఇరు దేశాధినేతల మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత పలు దేశాలను సుంకాల పేరుతో బెదిరిస్తున్నారు. కెనడా, మెక్సికోలపై సుంకాలను విధించారు. అమెరికా ఫస్ట్ అనే వైఖరికి ట్రంప్ ప్రాధాన్యత ఇస్తున్నాడు. అయితే, పలు సందర్భాల్లో భారత్ కూడా భారీగా సుంకాలు విధిస్తోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మోడీ భారత్‌పై సుంకాల విధింపును నిరోధించడం పర్యటన ప్రధాన ఉద్దేశం కావచ్చు.
నన్ను వాళ్లు చంపేస్తారు.. లావణ్య సంచలన వ్యాఖ్యలు..
తనకు ప్రాణహాని ఉందని లావణ్య పేర్కొంది. తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు ప్రాణ హాని ఉందని.. బతికి ఉంటానో లేదో తెలియదని తెలిపింది. మస్తాన్ సాయి, వాళ్ళ పేరెంట్స్ నన్ను చంపేస్తారని వాపోయింది.. గడప దాటలంటే భయపడుతున్నట్లు తెలిపింది.. వైరల్ అయిన వీడియోపై స్పందించింది. తాను కాల్ మాట్లాడుతున్నప్పుడు మస్తాన్ సాయి రికార్డ్ చేశాడని.. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో, ఆడియో కూడా అదే అంది.. చాలా మంది యువతుల వీడియోలు ఎక్కడ అమ్ముతున్నాడో పోలీసులు తేల్చాలని తెలిపింది. తాను ఒక్కటే మస్తాన్ సాయిపై పోరాటం చేస్తున్నానని.. ఈ పోరాటంలో తాను చనిపోవచ్చని చెప్పుకొచ్చింది. “నన్ను బెదిరిస్తున్నారు. నాకు థ్రెట్ కాల్స్ కూడా వస్తున్నాయి. ఇక్కడితో ఇక ఆపాలి అంటున్నారు. లేదా చంపేస్తున్నామంటున్నారు. రాజ్ తరుణ్ ఉండగా.. ఈ అమ్మాయి బయటకు రాదని వాళ్ల ధైర్యం. రాజ్ తరుణ్ సినిమాకు చెందిన వ్యక్తి కాబట్టి.. అతడు సినిమాకు సంబంధించిన వ్యక్తి.. అతని కెరియర్ కోసం.. లేదా పరువు కోసం ఉంటాడు.. అలాంటి వ్యక్తి ఉన్నప్పుడు ఈ అమ్మాయి బయటకు రాదు. అని నన్ను చాలా టార్గెట్ చేశారు.
Zee5 ఒరిజినల్ చిత్రం ‘మిసెస్’ కు విశేషమైన స్పందన.. గూగుల్‌లో బంఫర్ రేటింగ్
‘మిసెస్’ చిత్రం ZEE5 ఫ్లాట్ ఫాంపై సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే 150 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలతో దూసుకుపోతోంది. జీ5లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. సన్యా మల్హోత్రా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రస్తుతం ఆడియెన్స్‌ను మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. 7.3 IMDb రేటింగ్‌తో పాటు, గూగుల్‌లో యూజర్ రేటింగ్ 4.6/5తో అత్యధికంగా సర్చ్ చేస్తున్న చిత్రంగా ‘మిసెస్’ సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమాను బవేజా స్టూడియోస్‌తో కలిసి జియో స్టూడియోస్ నిర్మించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందీ ప్రేక్షకులకు చూడటానికి అందుబాటులో ఉంది. కాగా.. ఈ చిత్రాన్ని సీనియర్ మేకర్స్, ప్రముఖ నటీనటులు దీన్ని ప్రశంసించారు. ఈ సందర్భంగా ZEE5లో SVOD ఇండియా, గ్లోబల్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ శ్రేష్ఠ్ గుప్తా మాట్లాడుతూ.. ఈ చిత్రానికి వచ్చిన అసాధారణ ఆదరణ చూసి అందరం సంతోషిస్తున్నామన్నారు. సమాజంలో అర్ధవంతమైన మార్పుకు దారితీసే కథనాలకు ZEE5 పెద్ద పీఠ వేస్తుందనే నిబద్ధతను మరోసారి పునరుద్ఘాటించారు. ఇలాంటి ఎన్నో సామాజిక సందేశాత్మక కథల్ని అందించేందుకు మున్ముందు ప్రయత్నిస్తూనే ఉంటామని తెలిపారు.