నేడు టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. వేడుకల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
నేడు తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వేడుకలు ఘనంగా జరగనున్నాయి. నేటి ఉదయం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌కు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. అక్కడ పార్టీ కార్యకర్తలతో భేటీ కానున్నారు. అనంతరం, టీడీపీ జెండాను ఎగురవేసి.. ఆ తర్వాత మధ్యాహ్నం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయం దగ్గర జరిగే వేడుకల్లో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేశ్, ఇతర నేతలు పాల్గొంటారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.
గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి.. కోట్లు అప్పు మిగిల్చింది!
నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీలను అభివృద్ధి చేశాం.. కానీ, గత వైసీపీ ప్రభుత్వం మున్సిపాలిటీలను నిర్వీర్యం చేసింది అని ఆరోపించారు. ఖజానా ఖాళీ చేసి వెళ్ళింది.. రాష్ట్రానికి 10 లక్షల కోట్లు అప్పు మిగిల్చి వెళ్ళింది అని మండిపడ్డారు. ఇక, ప్రజా మద్దతుతో తిరిగి మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అని మంత్రి నారాయణ పేర్కొన్నా
టీడీపీలో కాకరేపుతున్న తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి ఎపిసోడ్..
ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారంపై టీడీపీ పార్టీలో కాక రేపుతుంది. గత కొంత కాలంగా ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో కొలికపూడి ఎపిసోడ్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు పార్టీ నేత రమేష్ రెడ్డిపై 48 గంటల్లోగా చర్యలు తీసుకోకపోతే రాజీనామా చేస్తానని రెండు రోజుల క్రితం కొలికపూడి ప్రకటించారు. కాగా, ఇవాళ 11 గంటలకు కొలికపూడి డెడ్ లైన్ పూర్తవనుంది. ఎమ్మెల్యే ఏం చేస్తారనే అంశంపై చర్చ జోరుగా కొనసాగుతుంది. మరోవైపు కొలికపూడి శ్రీనివాసరావు తీరుపై తెలుగు దేశం పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. ఇప్పటికే, కమిటీ ద్వారా పార్టీ హైకమాండ్‌కు నివేదిక అందింది. ఇక, కొలికపూడిపై చర్యలకు రంగం సిద్ధం చేస్తుంది.
ఓఎంసీ కేసులో విచారణ పూర్తి.. మే 6న ఫైనల్ జడ్జిమెంట్
కర్ణాటక మాజీ మంత్రి, గనుల వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డిపై నమోదైన ఓఎంసీ కేసును సీబీఐ కోర్టు విచారించింది. ఈ కేసులో విచారణ శుక్రవారం ముగిసింది. ఓఎంసీ కేసులో తుది తీర్పును మే 6న సీబీఐ కోర్టు వెల్లడించనుంది. ఈ కేసులో సీబీఐ కోర్టు ట్రయల్ పూర్తి చేసింది. ఓఎంసీ కేసులో 2011లో గాలి జనార్దన్ రెడ్డి సోదరులపైన కేసు నమోదైంది. దాదాపు 13 ఏళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతోంది.
ఓఎంసీ కేసుపై నాలుగు నెలల్లో విచారణ పూర్తి చేసి తీర్పు వెల్లడించాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సీబీఐ తాజాగా విచారణ పూర్తి చేసింది. మే 6న తుది తీర్పు రానుంది. అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డిని, ఓఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి నిందితులుగా ఉన్నారు. ఇదే కేసులో మరో ఐదుగురు నిందితులు ఉన్నారు. మొత్తం ఏడుగురు నిందితులపై న్యాయస్థానం తీర్పు వెల్లడించనుంది.
150కి చేరిన మయన్మార్, బ్యాంకాక్ భూకంప మృతుల సంఖ్య
మయన్మార్, బ్యాంకాక్‌లో చోటుచేసుకున్న భూకంపాలు కారణంగా 150 మందికి పైగా మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు. మరోవైపు రెస్క్యూ సిబ్బంది సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. శిథిలాల కింద మరికొంత మంది ఉంటారని అనుమానిస్తు్న్నారు. ఇక థాయిలాండ్ ప్రధాని అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. భూకంప కేంద్రం మయన్మార్ రాజధాని నేపిడా నుంచి 250 కి.మీ దూరంలో ఉన్న సాగింగ్ నగరానికి 16 కి.మీ దూరంలో ఏర్పడింది. శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటలకు 7.7, 6.4 తీవ్రతతో శక్తివంతమైన భూకంపాలు కారణంగా మయన్మార్, థాయ్‌లాండ్ దేశాలు గజగజ వణికిపోయాయి. మయన్మార్‌లోని మండలేలోని ఒక మసీదులో ప్రార్థనలు చేస్తుండగా కూలిపోయింది. అలాగే ఒక విశ్వవిద్యాలయ భవనం నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో కూడా పలువురు చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని మయన్మార్ జుంటా చీఫ్ మిన్ ఆంగ్ హ్లైంగ్ హెచ్చరించారు. అత్యవసర పరిస్థితి ప్రకటించారు. సహాయం కోసం విజ్ఞప్తి చేశారు.
‘జటాధర’ షూటింగ్‌పై సోనాక్షి అప్డేట్
‘జటాధర’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సుధీర్ బాబు. వెంకట్ కల్యాణ్ కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్నఈ ప్రాజెక్ట్‌లో కథానాయికగా బాలీవుడ్ బ్యూటి సోనాక్షి సిన్హా నటిస్తోంది. మైథాలాజికల్, సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో రైన్ అంజలి, శిల్పా శిరోడ్కర్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. జీ స్టూడియో సమర్పణలో ఉమేశ్ కె.ఆర్.భన్సాల్, ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీతో మొదటిసారిగా తెలుగులో అడుగుపెడుతుంది సోనాక్షి. తన పాత్ర కొత్తగా ఉండబోతున్నట్లు ఫస్ట్ లుక్ చూస్తేనే అర్ధం అవుతుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు ‘జటాధర’ మూవీ షూటింగ్ షెడ్యూల్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది.. ‘ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్.. ప్రస్తుతం రెండో షెడ్యూల్ జరుగుతుంది.ఇలాంటి చిత్రంలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇందులో నా పాత్ర మీమల్ని కచ్చితంగా ఆకట్టుకుంటుంది. త్వరలోనే ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్‌లో జాయిన్ కాబోతున్నాను. ఇంతకన్నా ఇంకేం చెప్పలేను..’ అని తెలిపింది. ప్రజంట్ ఈ అమ్మడు మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శ్రీరామ నవమి ఎఫెక్ట్.. ఐపీఎల్ షెడ్యూల్‌లో మార్పు..
ఏప్రిల్ 6న జరిగే ఐపీఎల్ మ్యాచ్ షెడ్యూల్‌లో మార్పు చోటు చేసుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ గెయింట్స్ మధ్య ఏప్రిల్ 6న ఈడెన్ గార్డెన్స్‌లో జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ రీషెడ్యూల్ అయ్యింది. ఏప్రిల్ 6న జరగాల్సిన మ్యాచ్ ఏప్రిల్ 8న నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఏప్రిల్ 6న మ్యాచ్ నిర్వహణకు బెంగాల్ పోలీసుల నుంచి అనుమతి లభించ లేదు. ఏప్రిల్ 6న శ్రీరామ నవమి కావడంతో… బెంగాల్‌లో సుమారు 20 వేల చోట్ల భారీగా ర్యాలీలు తీసేందుకు బీజేపీ నేత సువేందు అధికారి ప్లాన్ చేశారు. దీంతో భద్రతాపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు… స్టేడియం వద్ద సెక్యూరిటీ కల్పించలేం అని తేల్చిచెప్పేశారు. బీసీసీఐ ప్రకటన కంటే ముందు ఈ మ్యాచ్ కోల్‌కతాలో కాకుండా గౌహతిలో జరుగుతుందనే పుకార్లు షికార్లు చేశాయి. కానీ బీసీసీఐ ఆ వదంతులకు చెక్ పెట్టింది. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్, కోల్‌కతా ప్రభుత్వం కూడా ఈ పుకార్లను తోసిపుచ్చాయి. ఈ మ్యాచ్ తప్పకుండా కోల్‌కతాలోనే నిర్వహిస్తామని స్పష్టం చేశాయి. కాగా.. నిన్న (శుక్రవారం) చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా బీసీసీఐ తన నిర్ణయాన్ని ప్రకటించింది. మ్యాచ్ వేదికలో ఎటువంటి మార్పు ఉండదని తేల్చ చెప్పేసింది. మ్యాచ్ తేదీలో మార్పు చేసింది. ఏప్రిల్ 8న మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.
హార్దిక్ పాండ్యా పునరాగమనం.. గెలుపు అవకాశాలు ఇవే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో శనివారం (మార్చి 29) జరిగే మ్యాచ్ నంబర్-9లో గుజరాత్ టైటాన్స్ (GT), ముంబై ఇండియన్స్ (MI) తలపడనున్నాయి. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. ఈ సీజన్‌లో గుజరాత్ తన తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS)తో 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. మరోవైపు, ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇప్పుడు గుజరాత్, ముంబై జట్ల లక్ష్యం ఈ సీజన్‌లో తొలి విజయం సాధించడమే. ఈ మ్యాచ్ కోసం అభిమానులు రెండు జట్ల ప్లేయింగ్-11పై కూడా ఒక కన్నేసి ఉంచుతారు. ముంబై ఇండియన్స్ ప్లేయింగ్-11లోకి కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఎంట్రీ ఖాయం అయింది. నిషేధం కారణంగా హార్దిక్ సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌కు దూరమయ్యాడు. హార్దిక్ పాండ్యా తిరిగి రావడం జట్టు బ్యాటింగ్‌కు మరింత బలం చేకూరుస్తుంది. ప్లేయింగ్-11లో రాబిన్ మింజ్ స్థానంలో హార్దిక్ ఆడగలడు.