ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి షాక్.. టీడీపీ అభ్యర్థి విజయం
మొన్నటికి మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ అభ్యర్థికి ఓటమి తప్పలేదు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించారు.. ఆమెకు 23 ఓట్లు వచ్చాయి.. అయితే, ఎమ్మెల్యే కోటాలోని ఏడు స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఏడుగురు అభ్యర్థులను బరిలోకి దింపగా.. టీడీపీ అధినేత చంద్రబాబు.. తమ అభ్యర్థిగా పంచుమర్తి అనురాధాను ప్రకటించారు.. ఇక, ఈ ఎన్నికలపై ఆదినుంచి టెన్షన్ నెలకొంది.. ఏడు స్థానాలు మేమే కైవసం చేసుకుంటామని అధికార వైసీపీ నేతలు చెబుతూ రాగా.. ఆ ఒక్కటి మాదే.. అని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు.. మొత్తంగా 23 ఓట్ల రావడంతో టీడీపీ అభ్యర్థి అనురాధ విక్టరీ కొట్టారు..
టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్.. ఆ సమయంలో ఉచిత ప్రయాణం..
ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ విద్యార్థులకు శుభవార్త చెప్పింది ఏపీఎస్‌ఆర్టీసీ.. రాష్ట్రంలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వారికి గుడ్‌న్యూస్ వినిపించింది.. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు.. అన్ని పల్లె వెలుగు, సిటీ ఆర్జినరీ బస్సుల్లో ఈ సౌకర్యం ఉంటుంది. బస్సు పాస్ లేకున్నా.. హాల్ టికెట్ చూపించి విద్యార్థులు ఉచితంగా తమ గమ్యస్థానం నుంచి పరీక్షా కేంద్రానికి.. ఆ తర్వాత ఎగ్జామ్ సెంటర్ నుంచి తమ గమ్యస్థానాలకు ప్రయాణించవచ్చు అని ఏపీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది.. కాగా, ఏప్రిల్ 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు పరీక్షల సమయంలో ఈ అవకాశం ఉంటుంది.. మరోవైపు.. పరీక్షల సమయంలో విద్యార్థులను తరలించేందుకు ప్రత్యేకంగా బస్సులను సిద్ధం చేస్తోంది ఏపీఎస్‌ఆర్టీసీ. హాల్ టిక్కెట్ ఉంటే చాలు అనుమతించాలని ఆర్టీసీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు ఏపీఎస్‌ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేఎస్ బ్రహ్మానంద రెడ్డి.. కాగా, ఏప్రిల్ 3వ తేదీ నుండి ఏప్రిల్ 18వ తేదీ వరకు టెన్త్ పరీక్షల సమయంలోనే ఈ సదవకాశం ఉంటుంది.. ఇక, ఈ విద్యా సంవత్సరం దాదాపు 6.5 లక్షల మంది పరీక్షలకు హాజరుకాబోతున్నారు.
దేవాదాయ శాఖ చరిత్రలో శుభదినం.. శ్రీశైలంలో సరిహద్దు సమస్య పరిష్కారం
దేవాదాయ, ధర్మాదాయ శాఖ చరిత్రలో ఈ రోజు శుభదినంగా పేర్కొన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ.. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. శ్రీశైలం దేవస్థానం సరిహద్దు సమస్యకు పరిష్కారం దొరికింది.. రెండో ప్రధాన ఆలయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని తెలిపారు. అటవీశాఖతో చాలా కాలంగా భూవివాదం కొనసాగుతోంది.. అయితే, రెవెన్యూ, ఎండోమెంట్, ఫారెస్ట్ శాఖలతో సమీక్ష నిర్వహించాం.. మూడు శాఖలు సమన్వయంతో పనిచేసి సరిహద్దులు నిర్ణయం తీసుకున్నాం.. 4,430 ఎకరాల భూమికి బౌండరీ ఫిక్స్ చేసే దిశగా ముందుకువెళ్తున్నామని.. సరిహద్దులు నిర్ణయించే విషయమై స్కెచ్ రెఢీ చేసి.. ఎంవోయూ కుదుర్చుకున్నామని తెలిపారు. శ్రీశైలం దేవస్థానం, దేవాదాయశాఖ చరిత్రలో ఈరోజు నుంచి సువర్ణాధ్యాయం మొదలవుతోందని పేర్కొన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. సమస్య పరిష్కారానికి స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, అధికారులు ఎంతో సహకరించారని కృతజ్ఞతలు తెలిపారు మంత్రి కొట్టు.. ఇక, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ.. చాలా కాలంగా శ్రీశైలం దేవస్థానానికి చెందిన 5300 ఎకరాల అటవీశాఖ భూములతో ఇబ్బందులున్నాయి.. ఇప్పుడు దశాబ్ధాల కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు.. ఎవరూ పరిష్కరించలేని సమస్యకు ఈ రోజు ఓ పరిష్కారం దొరికింది.. మాఢవీధుల ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యిందన్నారు. దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సమస్య పరిష్కారానికి ఎంతో శ్రద్ధ తీసుకున్నారని.. మంత్రులు ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొట్టు సత్యనారాయణకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి.
ఆరుగురు గెలిచారు.. ఆయన మాత్రం ఓడారు..
ఆంధ్రప్రదేశ్‌లో ఉత్కంఠరేపిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రకటించారు.. అయితే, ఈ ఎన్నికల్లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరు స్థానాలను కైవసం చేసుకుంది. అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ బరిలోకి దింపిన అనురాధ 23 ఓట్లు సాధించి విజయం సాధించారు.. ఏడు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఏడుగురిని బరిలోకి దింపితే.. వైసీపీ అభ్యర్థి కోలా గురువులు మినహా మిగతా ఆరుగురు విజయం సాధించారు.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలుగా మర్రి రాజశేఖర్, బొమ్మి ఇజ్రాయిల్, పోతుల సునీత, చంద్రగిరి ఏసురత్నం, పెన్మత్స సూర్యనారాయణ రాజు, జయ మంగళ వెంకటరమణ విజయం సాధించారు.. టీడీపీ అభ్యర్థి అనురాధ విజయం సాధించడంతో.. వైసీపీ అభ్యర్థి కోలా గురువులు ఓటమి చవిచూడాల్సి వచ్చింది.. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన పోలింగ్‌లో మొత్తం 175 ఓట్లకు గాను అన్ని ఓట్లు అంటే 175 ఓట్లు పోల్ అయ్యాయి.. ఓట్ల లెక్కింపులో అన్ని ఓట్లు వాలిడ్ అయినట్టు ముందే అధికారులు ప్రకటించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత అప్రమత్తమైన అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. బరిలో ఉన్న ఒక్కో అభ్యర్థికి 21 మంది ఎమ్మెల్యేలను కేటాయించింది.. ఇక, మంత్రులను, నేతలను ఇంఛార్జ్‌లుగా పెట్టి.. ఫాలో అప్ చేసింది.. మొత్తం ఏడు స్థానాలను గెలుచుకునే విధంగా స్కెచ్ వేశారు వైసీపీ అధినేత.. కానీ, సరైన సంఖ్యలో ఎమ్మెల్యేలు లేకపోయినా.. టీడీపీ మాత్రం ఓ స్థానాన్ని గెలుచుకోవడంతో.. తమ పార్టీ ఎమ్మెల్యేలవైపు అనుమానంగా చూడాల్సిన పరిస్థితి వైసీపీకి ఏర్పడింది.
సంబరాల్లో టీడీపీ శ్రేణులు.. దేవుడు స్క్రిప్ట్ తిరగ రాశాడు..!
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అనురాధ విజయం సాధించడంతో సంబరాల్లో ముగినిపోయాయి తెలుగుదేశం పార్టీ శ్రేణులు.. రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. చంద్రబాబు నివాసంలో సంబరాలు జరిగాయి.. టపాసులు కాలుస్తూ కార్యకర్తల కేరింతలు కొట్టారు.. టీడీపీలో జోష్ నింపిన ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పందించిన టీడీపీ నేతలు.. ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. దేవుడి స్క్రిప్ట్ తిరగ రాశాడు. 23 ఓట్లతో గెలిచాం.. ఇవాళ తేదీ 23, ఏడాది 2023 అన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. అన్నింటికంటే ఎక్కువ ఓట్లు మా అభ్యర్థికి వచ్చినా ప్రకటనలో మళ్లీ జాప్యం చేశారన్న ఆయన.. అనవసరంగా పోటీ పెట్టారంటూ కుక్కలన్నీ మొరిగాయి. మా ఎమ్మెల్యేల మీద నిఘా పెట్టారు. మా వ్యాపారాలు దెబ్బతిసే ప్రయత్నం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసేలా విందు రాజకీయాలు చేశారు. మేం పోటీ పెట్టడం వల్లే ఎమ్మెల్యేలపై జగన్‌కు అమిత గౌరవం పెరిగిందన్నారు..
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మరో బాంబు.. ట్విటర్ మాజీ సీఈవోపై సంచలన రిపోర్టు
అదానీ గ్రూప్‌పై గత జనవరిలో సంచలన ఆరోపణలు చేసిన యూఎస్ షార్ట్ షెల్లర్ సంస్థ హిండెన్ బర్గ్ రీసెర్చ్ మరో సంచలన ప్రకటన చేసింది. హిండెన్‌బర్గ్ రీసెర్స్ తన బాంబును ఈ సారి ట్విటర్ మాజీ సీఈవో జాక్ డోర్సేపై వేసింది. జాక్ డోర్సే నేతృత్వంలోని చెల్లింపుల సంస్థ బ్లాక్ ఇంక్ భారీ అక్రమాలకు పాల్పడిందని గురువారం తెలిపింది. దీనికి సంబంధించిన నివేదికను ట్విటర్ ఖాతాలో వెల్లడించింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ గురువారం ప్రకటించిన రిపోర్టులో జాక్ డోర్సే నేతృత్వంలోని బ్లాక్ సంస్థ అక్రమాలను బయట పెట్టింది. తమ రెండేళ్ల పరిశోధనలో కీలక విషయాలను గుర్తించినట్టు హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తన వెబ్‌సైట్‌లో ప్రచురించిన నోట్‌లో పేర్కొంది. ముఖ్యంగా తన కస్టమర్లను ఎక్కువగా చూపించి వారి ఖర్చులను తక్కువ చేసిందని ఆరోపించింది. తన ఫేక్ లెక్కలు,నకిలీ కస్టమర్ల సంఖ్యతో పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించడమే బ్లాక్ వ్యాపారం వెనుకున్న మాయాజాలం అని వ్యాఖ్యానించింది. తాము సమీక్షించిన ఖాతాల్లో 40 శాతం నుండి 75 శాతం నకిలీవని, మోసానికి పాల్పడినవీ లేదా ఒకే వ్యక్తితో ముడిపడి ఉన్న అదనపు ఖాతాలని వెల్లడించింది. కాగా 2009లో ఏర్పాటైన బ్లాక్ సంస్థ మొబైల్ బ్యాంకింగ్ సేవలను అందిస్తుంది. ఈ నివేదిక తర్వాత ప్రీమార్కెట్ ట్రేడింగ్‌లో బ్లాక్ షేర్లు 18 శాతం కుప్పకూలడం గమనార్హం.
నగర వీధిలో జీబ్రా హల్ చల్.. రోడ్డుపై ఏం చేసిందంటే..
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఓ జీబ్రా హల్ చల్ చేసింది. జంతుప్రదర్శనశాల నుండి గురువారం తప్పించుకున్న జీబ్రా మూడు గంటలపాటు సియోల్‌లోని పలు వీధుల్లో తిరుగుతూ అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది. సియోల్ చిల్డ్రన్స్ గ్రాండ్ పార్క్‌లోని జూ నుండి సెరో అనే జీబ్రా తప్పించుకుంది. రోడ్డుపై పరిగెడుతూ హల్ చల్ చేసింది. రోడ్లపై కార్లను దాటుకుంటూ, వీధిలో తిరుగింది. జీబ్రాను పట్టుకునేందకు అధికారులు తీశ్రంగా శ్రమించారు. అతి కష్టం మీద జీబ్రాకు మత్తు ఇచ్చి జూకి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఐటీ దిగ్గజం యాక్సెంచర్‌లో కలవరం..19 వేల మంది ఉద్యోగుల తొలగింపు
ఆర్థిక సంక్షోభం ప్రపంచ దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే ట్విటర్, మెటా, గూగుల్ తదితర దిగ్గజ కంపెనీలు కూడా భారీగా లేఆఫ్స్ ప్రకటించాయి. తాజాగా యాక్సెంచర్ కూడా అదే దారిలో పయనించింది. అంతర్జాతీయ స్థూల-ఆర్థిక పరిస్థితులు, ఆదాయ వృద్ధి మందగమనం మధ్య దాదాపు 19,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు గ్లోబల్ ఐటీ సేవల సంస్థ యాక్సెంచర్ గురువారం ప్రకటించింది. సగానికి పైగా తొలగింపులు దాని బిల్ చేయని కార్పొరేట్ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులపై ప్రభావం చూపుతాయని కంపెనీ వెల్లడించింది. కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో 2.5 శాతం మందిపై వేటు పడింది. దాదాపు సగం మంది ఈ ఆర్థిక సంవత్సరంలో వెళ్లిపోతారని కంపెనీ చెప్పింది. భారతదేశంలో యాక్సెంచర్ పెద్ద ఐటీ కంపెనీ. 2023 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికానికి త్రైమాసిక ఫలితాలను అందజేస్తూ, కంపెనీ వార్షిక రాబడి వృద్ధి, లాభాల అంచనాలను కూడా తగ్గించింది.కంపెనీ ఆదాయాలు 15.8 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని, ఇది US డాలర్లలో 5 శాతం పెరిగిందని తెలిపింది. కొత్త బుకింగ్‌లు 13 శాతం వృద్ధితో 22.1 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. కంపెనీ రెండవ త్రైమాసికంలో $244 మిలియన్ల వ్యాపార ఆప్టిమైజేషన్ ఖర్చులను నమోదు చేసింది. 2024 ఆర్థిక సంవత్సరం నాటికి మొత్తం ఖర్చులు సుమారు $1.5 బిలియన్లను నమోదు చేయాలని భావిస్తోంది. ఖర్చులను తగ్గించడానికి తాము చర్యలు తీసుకుంటున్నామని యాక్సెంచర్ చైర్ మరియు CEO జూలీ స్వీట్ తెలిపారు.
బహుశా.. బంగారు బొమ్మ అంటే ఇలానే ఉంటుందేమో
ఏ మాయ చేశావే అంటూ తెలుగు కుర్రకారు గుండెల్లో తిష్టవేసుకోని కూర్చుండి పోయింది సమంత రూత్ ప్రభు. అమ్మడికి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో హేటర్స్ కూడా అంతే మంది ఉన్నారు. సక్సెస్ ఉన్నప్పుడే శత్రువులు ఎక్కువగా ఉంటారు అన్న పెద్దలు ఊరికే చెప్పలేదు. హేటర్స్ ఎప్పుడు హేట్ చేస్తూనే ఉంటారు.. వాటిని పట్టించుకోకుండా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లి.. మనం హ్యాపీగా ఉండాలి. ఇదే సామ్ ఫిలాసఫీ. అనుకున్నట్లుగానే ట్రోల్స్ ను కానీ, విమర్శలను కానీ సామ్ పట్టించుకోకుండా విజయపథంలో దూసుకుపోవడానికి రెడీ అవుతోంది. ఇక చైతన్యతో విడాకులు తీసుకున్నప్పుడు కానీ, మయోసైటిస్ తో హాస్పిటల్ లో చేరినప్పుడు కానీ ఆమె పడిన బాధను వర్ణించడం కష్టతరమే. ఎన్ని విమర్శలు.. ఆ విమర్శలను తట్టుకొని నిలబడడం అనేది ఎంతో కష్టంతో కూడుకున్న పని. అది సామ్ చేసి నిలబడి.. అనారోగ్యం నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే స్ట్రాంగ్ అవుతోంది. ఇక ప్రస్తుతం సామ్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. హిందీ వెబ్ సిరీస్ లు పక్కనపెడితే.. తెలుగులో ఖుషీ, శాకుంతలం సినిమాల్లో నటిస్తుంది. శాకుంతలం వచ్చే నెల రిలీజ్ కు సిద్ధమవుతోంది. స్టార్ డైరెక్టర్ గగుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సామ్ శకుంతల గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్ల జోరును పెంచేశారు. ఒకపక్క ఇంటర్వ్యూలు.. ఇంకోపక్క సోషల్ మీడియాలో కొత్త పోస్టర్లు రిలీజ్ చేస్తూ సినిమాపై హైప్ పెంచేస్తున్నారు. తాజాగా సమంత కొత్త పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. బంగారు వర్ణం దుస్తుల్లో సామ్ దేవతలా మెరిసిపోతుంది. ఈ సినిమా కోసం సామ్ అన్ని బంగారు నగలనే వాడిందట. బంగారు వర్ణం దుస్తులు.. ఒంటినిండా బంగారు నగలతో సమంత బంగారు బొమ్మల మెరిసిపోతోంది. నిజంగా బంగారు బొమ్మ దిగివస్తే ఇలాగే ఉంటుందా..? అని అనిపించేలా ఉంది ఆమె అందం. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమా సామ్ కు ఎలాంటి విజయాన్ని తీసుకొచ్చి పెడుతుందో చూడాలి.
నంది అవార్డు అందుకున్న ‘బలగం’.. ఓటిటీ బాట పట్టిందోచ్
ప్రస్తుతం ప్రేక్షకుల మైండ్ సెట్ మారిపోయింది. స్టార్ హీరోలు ఉంటే సినిమా హిట్ అవుతుంది అన్న దగ్గరనుంచి కథ ఉంటే చాలు స్టార్ హీరోలు లేకపోయినా అనే రేంజ్ కు వచ్చేశారు. అందుకే ఈ మధ్య చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చూపిస్తున్నాయి. అలా ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న చిత్రం బలగం. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు కూతురు హర్షిత రెడ్డి నిర్మించింది. ఇక మొదటి రోజు నుంచి ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంది. పల్లెటూరి కథలా.. తల్లిదండ్రుల కథగా ప్రేక్షకులు ఈ సినిమాను చూసి ఆదరించారు. ఇక ఈ సినిమాతో రిలీజైన పెద్ద సినిమాలు కూడా బొక్క బోర్లా పడినా ఇప్పటికీ కొన్ని ఏరియాలో నిర్విరామంగా ఆడుతుంది. సినీ ప్రముఖుల ప్రశంసలతో పాటు నంది అవార్డును కూడా అందుకుంది. ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఓటిటీలో వస్తుందా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. తాజాగా వారికి ఒక శుభవార్త. ఎట్టకేలకు ఈ సినిమా ఓటిటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. మార్చి 24 నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానుంది. భారీ ధరను పెట్టి అమెజాన్ బలగం హక్కులను కొనుగోలు చేసింది. దీంతో పాటు సింప్లీ సౌత్ ఓటిటీలో కూడా రిలీజ్ కానుంది. మరి ఇంకెందుకు ఆలస్యం తెలంగాణ సంస్కృతిని కళ్ళకు కట్టినట్లు చూపించిన ఈ పల్లెటూరి కథను రేపటి నుంచి అమెజాన్ లో కుటుంబంతో సహా ఇంట్లోనే కూర్చొని వీక్షించండి. మరి థియేటర్ లో రచ్చ చేసిన ఈ సినిమా ఓటిటీ లో ఎలాంటి రచ్చ చేస్తుందో చూడాలి.