లోకేష్ పాదయాత్రలో అపశృతి..
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది.. లోకేష్ పాదయాత్ర బందోబస్తులో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రమేష్ గుండెపోటుతో మృతి చెందారు. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గంలో సాగుతున్న పాదయాత్రలో రమేష్ కుప్పకూలాడు.. వెంటనే అప్రమత్తమైన సహచర పోలీసులు.. అతన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే, రమేష్.. ఐరాల పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేసేవారు. పాదయాత్ర కాన్వాయ్ నిర్వహణలో ఉండగా గుండెపోటు వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. కాగా, కుప్పం నుంచి ప్రారంభమైన లోకేష్ యువగళం పాదయాత్ర 14వ రోజుకు చేరింది..
పిల్లలకు గుడ్‌న్యూస్.. జగనన్న గోరుముద్దలో చేరిన మరో పోషకాహారం.
జగనన్న గోరుముద్ద పథకంలో మరో పోషకాహారం చేరింది.. మధ్యాహ్న భోజన పథకంలో మార్చి 2 నుంచి రాగిజావ అందించనున్నారు.. పిల్లలకు ఐరన్, కాల్షియం లోపాలు లేకుండా నివారించడానికి రాగిజావ అందించాలని నిర్ణయించారు.. ఇక, జగనన్న గోరుముద్ద మెనూలో రాగిజావ కార్యక్రమంలో భాగస్వామ్యం కానుంది శ్రీ సత్యసాయి ఛారిటబుల్ ట్రస్టు.. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఎంఓయూ చేసుకున్నారు విద్యాశాఖ అధికారులు, సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ప్రతినిధులు.. జగనన్న గోరుముద్ద (మధ్యాహ్న భోజన పథకం) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది.. బడి ఈడు పిల్లల్లో ఎన్‌రోల్‌మెంట్‌ను పెంచడంతో పాటు వారిలో ధారణ సామర్ధ్యం మెరుగుపర్చి, డ్రాపౌట్స్‌ను తగ్గించే కార్యక్రమాల్లో భాగంగా వారికి స్కూళ్లోనే రుచికరమైన పౌష్టికాహారాన్ని మధ్యాహ్న భోజనంలో అందిస్తోంది. జగనన్న గోరుముద్ద పథకం ద్వారా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 44,392 స్కూళ్లలో.. 37,63,698 విద్యార్ధులకు పౌష్టికాహారాన్ని అందిస్తోంది. ఈ పథకాన్ని 1 నుంచి 10 వ తరగతి వరకూ అమలు చేస్తోంది సర్కార్.
వారికి శుభవార్త చెప్పిన సీఎం జగన్.. రేపే ఖాతాల్లోకి సొమ్ము..
ఇప్పటికే పలు రకాల పథకాలతో ఎంతో మందికి మేలు చేస్తున్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.. మరో ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించబోతోంది. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకం కింద ఆర్థిక సాయాన్ని అందించేందుకు సిద్ధం అయ్యింది.. ఈనెల 10వ తేదీన అనగా రేపు దీనికి సంబంధిచిన సొమ్మును బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయనున్నారు సీఎం వైఎస్ జగన్.. గతేడాది అక్టోబరు 1 నుంచి డిసెంబరు 31 మధ్య వివాహాలు చేసుకుని.. అర్హత ఉన్న వివిధ వర్గాలకు చెందిన యువతులకు ఆర్థిక సాయాన్ని అందించనున్నారు.. అక్టోబర్ – డిసెంబర్ 2022 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 4,536 మంది లబ్ధిదారులకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా క్రింద రూ. 38.18 కోట్ల ఆర్ధిక సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం జగన్.. పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి వారి వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించి తమ సామాజిక బాధ్యత నిర్వర్తించేందుకు అండగా నిలుస్తూ, ఎస్‌సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైఎస్సార్ కళ్యాణమస్తు ద్వారా, ముస్లిం మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు వైఎస్సార్ షాదీ తోఫా ద్వారా ఈ ఆర్ధిక సాయం అందిస్తున్నారు.
ఆదాయాన్నిచ్చే శాఖలపై సీఎం జగన్ సమీక్ష.. ఆ విధానాలను అధ్యయనం చేయాలని ఆదేశాలు
ఆదాయార్జనశాఖలపై సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. కోవిడ్ పరిస్థితులను దాటుకుని ఆదాయాలు గాడిలో పడుతున్నాయని.. లక్ష్యాలకు దగ్గరగా ఆదాయాలు ఉన్నాయన్న ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. డిసెంబర్ 2022 వరకు జీఎస్టీ గ్రాస్ వసూళ్లలో దేశ సగటు 24.8 శాతం అయితే.. ఏపీలో వసూళ్లు 26.2 శాతంగా ఉన్నాయన్నారు.. ఇదే సమయంలో తెలంగాణ(17.3శాతం), తమిళనాడు(24.9 శాతం), గుజరాత్(20.2శాతం) కన్నా మెరుగైన వసూళ్లు సాధించామని వెల్లడించారు.. జీఎస్టీ వసూళ్లు 2022 జనవరి నాటికి రూ. 26,360.28కోట్లు ఉంటే, 2023 జనవరి నాటికి రూ. 28,181.86 కోట్లు వసూళ్లు వచ్చాయని, గత ఏడాది ఇదే కాలపరిమితితో పోల్చుకుంటే 6.91 శాతం పెరుగుదల కనిపించిందని పేర్కొన్నారు.. జీఎస్టీ, పెట్రోల్, ప్రొఫెషనల్ ట్యాక్స్, ఎక్సైజ్ ఆదాయాలను కలిపిచూస్తే జనవరి 2023 నాటికి ఆదాయాల లక్ష్యం రూ. 46,231 కోట్లు కాగా, రూ.43,206.03 కోట్లకు చేరుకున్నామన్న అధికారులు.. దాదాపు 94శాతం లక్ష్యాన్ని సాధించినట్టుగా వెల్లడించారు. ఇక, గతంలో సీఎం ఇచ్చిన ఆదేశం మేరకు పన్ను వసూలు యంత్రాంగంలో కీలక మార్పులు తీసుకువచ్చామని తెలిపిన అధికారులు. పన్ను చెల్లింపు దారులకు సౌలభ్యమైన విధానాల ద్వారా ఆదాయాలు మెరుగుపడుతున్నాయన్న అధికారులు. విధానాలను సరళీకరించుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని వెల్లడించారు. డేటా అనలిటిక్స్ వల్ల వసూళ్లు మెరుగుపడుతున్నాయని.. సిబ్బందికి శిక్షణ, వారి సమర్థతను మెరుగుపరుచుకుంటున్నామన్నారు. టాక్స్ అసెస్మెంట్‌ను ఆటోమేటిక్ పద్ధతుల్లో అందించే వ్యవస్థను నిర్మించుకున్నామని, దీనివల్ల పన్ను చెల్లింపుదారులకు మరింత సులభంగా సేవలు అందిస్తున్నామన్నారు. డివిజన్ స్ధాయిలో కేంద్రీకృత రిజిస్ట్రేషన్ యూనిట్లు ఏర్పాటు చేశామని.. పన్ను చెల్లింపుదారులకు పారదర్శకత పద్ధతులను అందుబాటులో ఉంచామని తెలిపారు.. అయితే, ఏపీ కన్నా మెరుగైన పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల్లో విధానాలను అధికారులు అధ్యయనం చేయాలని.. తద్వారా మంచి విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలని ఆదేశించారు సీఎం వైఎస్ జగన్.
ఫోన్ చూసి చూసి కళ్ళు పోగొట్టుకున్న హైదరాబాదీ మహిళ
ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా మారారు. ఎంతలా అంటే అవి వారి జీవితంలో భాగం. ఫోన్ లేకుండా రోజు గడవదు. అన్ని పనులూ స్మార్ట్ ఫోన్ నుంచే చేసేవిధంగా టెక్నాలజీ మారింది. తాజాగా గంటలకొద్ది స్మార్ట్ ఫోన్ చూడటం వల్ల కంటి చూపు కూడా పోతోందని తేలింది. హైదరాబాద్‌కు చెందిన మంజు అనే 30 ఏళ్ల మహిళ తన చూపు తగ్గిపోతోందని వైద్యుల దగ్గరకు వెళ్లింది. టెస్టులు చేసిన వైద్యులు అసలు సమస్య అంతా స్మార్ట్ ఫోన్ ను గంటల తరబడి చూడటం వల్లే వచ్చిందని గుర్తించారు. చీకటిలో ఫోన్ ను అదే పనిగా చూస్తూ కంటి చూపు కోల్పోయే స్థితికి చేరుకుంది ఆ మహిళ. ఇందుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ న్యూరాలజిస్ట్ డా.సుధీర్ ట్విట్టర్ లో తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. మంజు అనే మహిళ ప్రతిరోజు రాత్రిళ్లు చీకటి గదిలో చాలా సేపు స్మార్ట్ ఫోన్ చూస్తూ గడిపారు. దీనివల్ల ఆమె దాదాపు ఏడాదిన్నర కాలంగా కంటి సమస్యలతో బాధపడుతున్నారు. వస్తువులను సరిగ్గా చూడలేని స్థితికి ప్రస్తుతం ఆమె కళ్లు చేరుకున్నాయి. కంటి వైద్యుడి వద్దకు వెళ్లినా లాభం లేకుండాపోయింది. న్యూరాలజిస్ట్ వద్దకు వెళ్లాలని కంటి వైద్యుడు ఆమెకు సూచించారు. దీంతో ఆమెకు మరిన్ని వైద్య పరీక్షలు చేసి, స్టార్ట్ ఫోన్ విజన్ సిండ్రమ్ (SVS)గా న్యూరాలజిస్ట్ నిర్ధారించారు. ఈ సిండ్రమ్ ఉంటే కంటి సంబంధిత సమస్యలు రావడమే కాకుండా అంధులుగా మారే ప్రమాదమూ ఉంటుంది. మంజుకి ఉన్న అలవాట్లు, ఆమె పని వంటి పలు విషయాలను వైద్యుడు తెలుసుకున్నారు. ఫోన్ చూడడం తగ్గించుకోమని.. కొన్ని మందులు రాసిచ్చారు. ఆ రెండింటినీ పాటించాక మంజు కంటి చూపు మెరుగుపడింది. 18 నెలలుగా ఆమె పడుతున్న బాధ నుంచి విముక్తి పొందారు. మొబైల్ ను గంటల కొద్దీ చూస్తుండడం వల్లే ఆమె కంటిలో సమస్య ఏర్పడిందన్న తమ అంచనా నిజమేనని నిర్ధారణ అయిందని వైద్యుడు చెప్పారు. మొబైల్ ఫోన్లను అధికంగా వాడే వారు కంటి గురించి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
బీఆర్ఎస్‌తో ఎంఐఎం వరస చర్చలు.. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంపై నజర్
తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. దీంతో తెలంగాణలో ఎన్నికల హడావుడి ప్రారంభం అయింది. తెలంగాణలో ఒక టీచర్, ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కాబోతున్నాయి. ముఖ్యం హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంపై మజ్లిస్ పార్టీ నజర్ పెట్టింది. దీంతో ఈ ఎన్నికలు ఆసక్తిగా మారబోతున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఎంఐఎం పార్టీకి చెందిన సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ ఉన్నారు. మే 1తో గడువు ముగుస్తోంది. అయితే మరోసారి ఈ స్థానంలో ఎంఐఎం పాగా వేయాలని అనుకుంటోంది. దీని కోసం బీఆర్ఎస్ పార్టీ మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఎంఐఎం పార్టీ ముఖ్యనేతలు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ బీఆర్ఎస్ నేతలతో వరసగా భేటీ అవుతున్నారు. ఎమ్మెల్సీ షెడ్యూల్ విడుదల కావడంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఇటీవల పాతబస్తీ పర్యటన సమయంలో అక్బరుద్దీన్ ఓవైసీ, మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. తాజాగా అసద్ ఈ రోజు కేటీఆర్ తో సమావేశం అయ్యారు. అయితే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మద్దుతు ఇస్తుందా..? లేదా..? అనేది ఉత్కంఠగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీకి కూడా కార్పొరేటర్లు ఉండటంతో ఆ పార్టీ కూడా అభ్యర్థిని పెట్టే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో బీఆర్ఎస్ మద్దతు పీఆర్టీయూ కా..? కమ్యూనిస్ట్ పార్టీకా..? అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాజ్య సభ చైర్మన్ గా పీటీ ఉష.. మేడమ్ సర్.. మేడమ్ అంతే
రాజ్యసభలో గురువారం అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఛైర్మన్ జగదీష్ థన్‌కర్ సభలో లేని సమయంలో పీటీ ఉష సభా కార్యక్రమాలను నిర్వహించారు. తనకు దక్కిన అరుదైన అవకాశం గురించి ట్విటర్ లో పీటీ ఉష పంచుకున్నారు. పయ్యోలీ ఎక్స్‌ప్రెస్‌గా పేరుగాంచిన పీటీ ఉష, తన ట్విట్టర్ లో ఈ ఘటనకు చెందిన వీడియోను పోస్టు చేశారు. సభా కార్యక్రమాలను చూడడం గర్వంగా ఉందన్నారు. ‘అత్యున్నత అధికారం గొప్ప బాధ్యతను కలిగి ఉంటుంద’ని ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్ చెప్పిన మాటలు.. నేను రాజ్యసభ సమావేశానికి అధ్యక్షత వహించినప్పుడు నాకు గుర్తుకు వచ్చాయి. నా ప్రజలు నాపై ఉంచిన నమ్మకం, విశ్వాసంతో నేను ఈ ప్రయాణంలో మైలురాళ్లను అందుకుంటానని ఆశిస్తున్నాన’ని పీటీ ఉష ట్వీట్ చేశారు. ఆమె ట్వీట్ చూసిన అభిమానులు ‘మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది. మీ ప్రయాణానికి ఆల్ ది బెస్ట్. ముందుకు సాగుతూ మరోసారి చరిత్ర సృష్టించండి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. నిజమైన సాధికారత!! ఆల్ ది బెస్ట్ మరియు కచ్చితంగా మీరు దేశానికి చాలా ఎక్కువ తిరిగి ఇస్తారు మేడమ్’ అంటూ ప్రశంసిస్తున్నారు. 2022లో బీజేపీ తరఫున రాజ్యసభకు పీటీ ఉష నామినేట్ అయిన విషయం తెలిసిందే. రాజ్యసభ వైస్ చైర్‌పర్సన్‌ల ప్యానెల్‌లో గత డిసెంబరులో పీటీ ఉషకు చోటు దక్కింది. ఈ ఘనత సాధించిన మొదటి నామినేటెడ్ ఎంపీగా ఆమె నిలిచారు. మహిళా స్ప్రింటర్‌గా ఉష ఇండియా తరఫున ఎన్నో రికార్డులను నెలకొల్పారు. ఏషియన్ గేమ్స్, ఏషియన్ చాంపియన్ షిప్, వరల్డ్ జూనియర్ ఇన్విటేషనల్ మీట్లలో పాల్గొన్నారు తన కెరీర్‌లో ఎన్నో జాతీయ, ఆసియా రికార్డులను నెలకొల్పారు.
జడేజా చీటింగ్ చేశాడా? వైరల్‌గా మారిన వీడియో
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. ముఖ్యంగా స్పిన్నర్ రవీంద్ర జడేజా ఐదు వికెట్లతో ఆస్ట్రేలియా నడ్డి విరిచాడు. కాగా, ఈ మ్యాచ్ సమయంలో జడేజా చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో పలువురు దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు మాజీలు జడేజా బాల్ టాంపరింగ్‌కు పాల్పడ్డాడంటూ ఆరోపిస్తున్నారు. మరికొందరు మాత్రం అతడు తన వేలికి లోషన్ రాస్తున్నాడని అంటున్నారు. ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసేందుకు జడేజా సిద్ధమయ్యాడు. క్రీజులో అలెక్స్ కారే, హ్యాండ్స్‌కాంబ్ ఉన్నారు. అప్పటికి ఆస్ట్రేలియా 120-5తో బ్యాటింగ్ చేస్తోంది. జడేజా 30 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు కూడా తీసేశాడు. ఈ సమయంలో జడ్డూ బౌలింగ్ వేసే ముందు సిరాజ్ చేతిపై నుంచి ఏదో తీసుకున్నాడు. దానిని తన బౌలింగ్ వేస్తున్న చేతి వేలికి రాశాడు. ఇప్పుడు ఇదే వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. పలు అనుమానాలకూ తావిస్తోంది. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఇదే విషయమై స్పందిస్తూ.. జడేజా తన వేలికి ఏదో రాస్తున్నాడని.. ఇలాంటి సంఘటన తానెప్పుడూ చూడలేదు అంటూ రిప్లై ఇచ్చాడు.
సూపర్ ఫీచర్స్‌తో గూగుల్ మ్యాప్స్..ఉన్నచోటు నుంచే!
గూగుల్ మ్యాప్స్..టెక్నాలజీ యుగంలో ప్రతి స్మార్ట్ ఫోన్ వినియోగదారుడికి కచ్చితంగా ఉపయోగపడే యాప్. ఇప్పటికే సరికొత్త ఫీచర్స్‌తో కస్టమర్లను ఆకర్షిస్తోన్న ఈ యాప్.. మరో కొత్త అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. ఇమ్మెర్సివ్ వ్యూ అనే కొత్త ఫీచర్‌తో అందరినీ అట్రాక్ట్ చేయాలని గూగుల్ అనుకుంటోంది. దీనికి సంబంధించిన అప్ డేట్‌ను పారిస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో కంపెనీ ప్రకటించింది. మొదట ఐదు ముఖ్య నగరాల్లో దీన్ని తీసుకొస్తున్నామని త్వరలోనే మిగిలిన అన్ని నగరాలకు కూడా ప్రవేశపెడతామని చెప్పింది. ఇమ్మెర్సివ్ వ్యూ విషయానికి వస్తే గూగుల్ మ్యా్ప్స్‌లో మనకు కావల్సిన ప్రదేశాన్ని మరింత స్పష్టంగా చూపించడమే దీని ప్రత్యేకత. మామూలు వ్యూ పీచర్‌లాగే కనిపించినప్పటికీ ఇందులో స్ట్రీట్ వ్యూ, ఏరియల్ ఇమేజస్‌తో వర్చువల్ వరల్డ్ మోడల్‌ను అందించనుంది. అలాగే ట్రాఫిక్, లోకేషన్ ఎంత బిజీగా ఉంది అనే వివరాలు కూడా ఉంటాయి. ఇది కాకుండా మరికొన్ని రోజుల్లో ఆండ్రాయిడ్, ఐవోఎస్‌ల్లో గ్లాన్సబుల్ డైరెక్షన్స్ అనే కొత్త ఫీచర్ కూడా వస్తుందని కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతానికి లండన్, లాస్ ఏంజిల్స్, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, టోక్యో నగరాల్లో ఇమ్మెర్సివ్ వ్యూను తీసుకొచ్చింది. అలాగే ఆమ్స్టర్‌డమ్, డబ్లిన్, ఫ్లోరెన్స్, వెనిస్‌లతో సహా మరిన్ని నగరాలకు ఈ ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. దీనివల్ల ఆ నగరాల గురించి ముందే తెలుసుకుని, అక్కడ విజిట్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెబుతోంది. ఈ ఫీచర్‌లోని అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా కంప్యూటర్ వ్యూలో డిజిటల్ వరల్డ్‌ని కూడా చూడొచ్చని చెప్పింది. ఇది మరింత నేచురల్‌గా కనిపించడానికి మామూలు పిక్స్‌ని కూడా 3డి ఇమేజ్‌లోకి మార్చే కొత్త ఏఐ టెక్నాలజీ అయిన న్యూరల్ రేడియన్స్ ఫీల్డ్‌లను ఉపయోగిస్తున్నామని గూగుల్ తెలిపింది.
శ్రీనివాస్ అవసరాల మార్క్ సినిమా
నటుడు, డైరెక్టర్ శ్రీనివాస్ అవసరాల సినిమాలన్నీ ఎంతో పొయిట్రీక్ గా ఉంటాయి. ఒక పక్క రియాలిటీని చూపిస్తూనే ఇంకోపక్క కవిత్వాన్ని జోడు చేసి అద్భుతమైన ప్రేమకథను చూపిస్తాడు. ఊహలు గుసగుసలాడే చిత్రం తరువాత నాగ శౌర్య- శ్రీనివాస్ అవసరాల కాంబోలో వస్తున్న చిత్రం ఫలానా అబ్బాయి- ఫలానా అమ్మాయి. ఈ చిత్రంలో నాగశౌర్య సరసన మాళవిక నాయర్ నటిస్తోంది. వీరిద్దరూ కలిసి కల్యాణ వైభోగమే చిత్రం తరువాత వస్తున్న చిత్రమిది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అప్పుడెప్పుడో ఈ సినిమా షూటింగ్ మొదలయ్యిందని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ లేదు. ఇక తాజగా ఈ మధ్యనే ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేస్తూ నేడు టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. చెప్పినట్లుగానే కొద్దిసేపటి ముందు ఈ టీజర్ రిలీజ్ అయ్యింది. టీజర్ ను బట్టి శ్రీనివాస్ అవసరాల మార్క్ సినిమా అని అర్ధమవుతోంది. “ఇందుమూలంగా ఎవత్ ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా సంజయ్ పీసుపాటి మరియు అనుపమ కస్తూరి బెస్ట్ ఫ్రెండ్స్ అహో” అంటూ మాళవిక నాయర్ చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలయ్యింది. బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య ప్రణయం, విరహం చూపించారు. సినిమాలో నటించడానికి ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఏం చేశారు. వారిద్దరి మధ్యకు వచ్చిన మూడో వ్యక్తిగా శ్రీనివాస అవసరాల కనిపించాడు. మరి అతని పాత్ర ఏంటి..? అనేది సినిమా చూడాల్సిందే. కథ మొత్తం తెలియకపోయినా టీజర్ ను బట్టి బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య జరిగే ప్రేమకథగా తెలుస్తోంది. ఇక కళ్యాణ్ మాలిక్ సంగీతం అయితే ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తోంది. ఇక నాగశౌర్య లుక్ చూస్తుంటే ఊహలు గుసగుసలాడే సినిమా గుర్తురాకమానదు. క్లీన్ షేవ్ తో లవర్ బాయ్ లా కనిపించాడు. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా హిట్ కొట్టేలా ఉన్నాడు శ్రీనివాస్ అవసరాల.. ఇకపోతే ఈ సినిమా మార్చి 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ఈ కాంబోలు ఎలాంటి హిట్ ను అందుకుంటాయో చూడాలి.