డ్రగ్స్ కేసులో నేడు మోహిత్ విచారణ
డ్రగ్స్ కేసులో ఇవాళ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు నార్కోటిక్ అధికారులు మోహిత్ ను ప్రశ్నించనున్నారు. ఎడ్విన్తో సంబంధాలపై కూపీ లాగనున్నారు. మోహిత్ కు 50 మంది ప్రముఖులతో కాంటాక్టులు ఉన్నాయని భావిస్తున్న అధికారులు వీటిపై ఆరా తీయనున్నారు. మోహిత్ ను ఒకరోజు కస్టడీకి నాంపల్లి కోర్టు నిన్న అనుమతి ఇచ్చింది. అటు డ్రగ్స్ కేసులో మరో నిందితుడు కృష్ణ కిషోర్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రముఖ హీరోయిన్ నేహాదేశ్ పాండే మోహిత్ భర్త మోహిత్ ను డ్రగ్స్ సప్లై చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా నార్కోటిక్ అధికారులు పట్టుకున్నారు. కాగా.. మోహిత్ తోపాటు ప్రముఖ వ్యాపారి కృష్ణ కిషోర్ రెడ్డిని అరెస్టు చేశారు. భాగ్యనగరంతో పాటు.. గోవా, ముంబైలో డ్రగ్స్ సరఫరా చేసేవారితో మోహిత్ కు పరిచయాలున్నాయి.సినీ ప్రముఖులకు కూడా డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా గుర్తించారు అధికారులు. 12 ఏళ్ల క్రితం హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లిన మోహిత్ ఓ పబ్ లో వెయిటర్ గా పనిచేసేవాడు. రాను రాను పరిచయాలు పెంచుకుని తను డ్రగ్స్ సప్లైర్ గా మారాడు. బడాబాబులతో పరిచయాలు వారికి డ్రగ్స్ సప్లై చేస్తూ పెరిగాడు. ఆవిధంగా.. ఓసాధారణ వెయిటర్ స్థానం నుంచి ఓ హీరోయిన్ కు భర్త అవ్వటమేకాకుండా తన డ్రగ్స్ దందాను పెంచుకున్నాడు.
విద్యాసంస్థలకు సెలవుల్లో నిజమెంతా..?
కరోనా కొత్త వేరియంట్ భయాలు వెంటాడుతున్నాయి.. ఈ తరుణంలో.. త్వరలో స్కూళ్లు, కాలేజీలు బంద్ చేస్తారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. లాక్‌డౌన్ కూడా విధించే అవకాశం ఉందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.. ఆ ప్రచారంలో నిజం ఎంత అనిదానిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని కొట్టిపారేసింది.. ఇదంతా నిరాధారమైనది.. ఫేక్ న్యూస్ అని తేల్చేసింది.. స్కూళ్లు, కాలేజీలకు 15 రోజులు సెలవులు ప్రకటిస్తారనే బోగస్ వార్తలను ఎవరూ నమ్మవద్దని స్పష్టం చేసింది.. వాస్తవాలు తెలుసుకోవాలని ప్రజలకు సూచించింది. ఈ మేరకు ఫ్యాక్ట్ చెక్ చేసి ట్విట్టర్‌లో పోస్టు చేసింది. కాగా, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, జనవరి 4, బుధవారం, భారతదేశంలో 175 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ, చలిగాలుల దృష్ట్యా లక్నోలోని పాఠశాలలను మూసివేయాలని ఆదేశించబడింది. జమ్మూ మరియు కాశ్మీర్, ఢిల్లీతో సహా రాష్ట్రాల్లో శీతాకాల సెలవుల కోసం పాఠశాలలు మూసివేయబడ్డాయి. పొగమంచు కారణంగా కొన్ని చోట్ల స్కూళ్ల సమయాన్ని మార్చారు. అంతేగానీ, కరోనా మహమ్మారి కారణంగా ఇచ్చిన సెలవులు కాదని స్పష్టం చేస్తున్నారు.
కుప్పంలో రెండో రోజు చంద్రబాబు పర్యటన..
ఆంక్షలు, అడుగడునా అడ్డంకుల మధ్య తన సొంత నిజయోకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఆయన పర్యటన రెండో రోజుకు చేరుకుంది.. ఇవాళ కుప్పం పార్టీ కార్యాలయంలో పార్టీ కేడర్ తో సమావేశం కానున్నారు.. నిన్నటి ఘటన నేపథ్యంలో న్యాయ పోరాటం చేస్తానని ఇప్పటికే ప్రకటించారు చంద్రబాబు.. అయితే, అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.. ప్రచారరథం ఇవ్వకుంటే ధర్నాకు దిగుతానని నిన్న హెచ్చరించారు చంద్రబాబు.. శాంతిపురం మండలం కెనుమాకులపల్లిలో రచ్చబండ వద్ద గ్రామస్థులతో చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్తు రానున్న ఎన్నికలతో ముడిపడి ఉందన్నారు.. వైసీపీలోనూ నష్టపోయిన వారున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆయన.. ఆ పార్టీ ఎమ్మెల్యేల్లోనూ తిరుగుబాటు వస్తోందన్నారు.. వైఎస్ జగన్ రెడ్డి పాలనలో పోలీసులు కూడా సైకోల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలతో జగన్ పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.. కుప్పం పర్యటనలో పోలీసుల తీరుపై న్యాయ పోరాటం చేయడమే కాదు తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు.. అయితే, ఇవాళ పూర్తిగా పార్టీ క్యాడర్ తో భేటీకి సమయం కేటాయించారు చంద్రబాబు నాయుడు.. కుప్పంలోని పార్టీ కార్యాలయంలో బూత్‌ల వారీగా కార్యకర్తలతో చంద్రబాబు నాయుడు వరుస సమీక్షలు నిర్వహించనున్నారు.. షెడ్యూల్ ప్రకారం పార్టీ కేడర్ తో సమావేశాలు ఉంటుందా లేక లేకుంటే నిన్నటి పరిణామాలు నేపథ్యంలో ఇవాళ ఆయన కార్యక్రమాల షెడ్యూల్ మారుతుందా అన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. చంద్రబాబు రెండో రోజు పర్యటన ఎలా సాగుతుంది..? పోలీసులు ఎలాంటి ఆంక్షలు పెడతారు? ఆయన ముందుకు ఎలా వెళ్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.
అమిత్ షా విమానం అత్యవసర ల్యాండింగ్..
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమానం అత్యవసర పరిస్థితుల్లో అస్సాంలో ల్యాండ్ అయింది. అగర్తలాకు వెళ్తుండగా వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల గౌహతిలోని లోక్‌ప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దట్టమైన పొగమంచు కారణంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమానం బుధవారం రాత్రి అగర్తలలోని మహారాజా బీర్ బిక్రమ్ విమానాశ్రయంలో ల్యాండ్ కాలేదని అధికారులు తెలిపారు. విమానాన్ని గౌహతిలోని లోక్‌ప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించినట్లు ఏటీసీ వర్గాలు తెలిపాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో అగర్తలాలోని ఎంబీబీ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. అగర్తలా ఏటీసీ నివేదించిన ప్రకారం.. దట్టమైన పొగమంచు కారణంగా దృశ్యమానత సరిగా లేనందున రాలేకపోయారని ఎస్పీ శంకర్ దేబ్‌నాథ్ తెలిపారు. ఎంబీబీ విమానాశ్రయానికి వెళ్లాల్సిన విమానం గౌహతిలో దిగిందని, ఆ రాత్రి అక్కడే బస చేస్తారని ఆయన చెప్పారు.
పశ్చిమ బెంగాల్‌లో బీఎఫ్-7 కలకలం
పశ్చిమ బెంగాల్‌లో ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ బీఎఫ్-7 కలకలం సృష్టిస్తోంది. ఇటీవల నాలుగు కేసులు కనుగొనబడినట్లు ఆరోగ్య అధికారి బుధవారం తెలిపారు. ఇటీవలే అమెరికా నుంచి తిరిగి వచ్చిన నలుగురు వ్యక్తులకు జీనోమ్ సీక్వెన్సింగ్‌లో వారికి కొత్త వైరస్ సోకినట్లు నిర్ధారించినట్లు ఆయన తెలిపారు. నలుగురు రోగుల పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. నలుగురిలో, ముగ్గురు నాడియా జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి చెందినవారు. ఒకరు బీహార్‌కు చెందినవారు. కానీ ప్రస్తుతం కోల్‌కతాలో నివసిస్తున్నారని అధికారి పేర్కొన్నారు. ఈ నలుగురు వ్యక్తులతో కలిపి మొత్తం 33 మంది వ్యక్తులకు బీఎఫ్-7 బారినపడినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం 33 మంది ఆరోగ్యంగా ఉన్నారని, వారి పరిస్థితిని కూడా పర్యవేక్షిస్తున్నామని ఆ అధికారి చెప్పారు.
ఆలు లేదు చూలు లేదు.. అంతా తుస్!
‘బేషరమ్ రంగ్’ పాట పఠాన్ సినిమాను వివాదాల్లో ముంచెత్తిన విషయం తెలిసిందే! అందులో దీపికా పదుకొణె కాషాయం రంగులో వేసుకున్న బికినీనే అందుకు కారణం. దీనిపై హిందూ సంఘాల దగ్గర నుంచి రాజకీయ నేతల దాకా.. అందరూ తీవ్రంగా స్పందించారు. హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉన్న ఆ సన్నివేశాన్ని వెంటనే తొలగించాలని.. లేకపోతే సినిమానే బ్యాన్ చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికీ ఈ వ్యవహారంపై నానా రాద్ధాంతం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే పఠాన్ సినిమాపై ఒక గాసిప్ గుప్పుమంది. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి కాబట్టి.. ఆయా సీన్లను తొలగించాలని సీబీఎఫ్‌సీ కండీషన్స్ పెట్టిందని ప్రచారం జరిగింది. అంతేకాదు.. టైటిల్‌ని కూడా మార్చాలని సూచించినట్టు వార్తలొచ్చాయి. ఇదే సమయంలో తనని తాను గొప్ప క్రిటిక్‌గా చెప్పుకునే కమాల్ ఆర్ ఖాన్ కూడా ఈ సినిమా వాయిదా పడనుందని ట్వీట్ చేయడం, టైటిల్ కూడా మారుస్తారని చెప్పడంతో.. బహుశా నిజమే అయ్యుండొచ్చని అంతా అనుకున్నారు. ఎలాగో ఈ చిత్రంపై తారాస్థాయిలో వ్యతిరేకత నెలకొంది కాబట్టి, పఠాన్ సినిమా కచ్ఛితంగా మార్పులు చేసి ఉండొచ్చని జనాలు భావించారు. అయితే.. అందులో ఏమాత్రం వాస్తవం లేదంటూ చిత్రబృందం ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. తమ సినిమా ట్రైలర్‌ని ఈనెల 10న విడుదల చేస్తున్నామని పేర్కొన్న చిత్రబృందం.. టైటిల్ మార్చడం లేదని, సినిమాని కూడా వాయిదా వేయడం లేదని స్పష్టం చేసింది. ముందుగా ప్రకటించిన జనవరి 25వ తేదీనే తమ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని ప్రకటించింది. చూస్తుంటే.. ఏ సన్నివేశాలపై అయితే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయో, వాటిని కూడా చిత్రబృందం తొలగించలేదని తెలుస్తోంది. మరి, ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాల్ని యూనిట్ ఎలా ఎదుర్కుంటుందో చూడాలి.
కోతులతో సెల్ఫీ తీసుకుంటూ లోయలో పడిపోయిన యువకుడు
మహారాష్ట్రలో సెల్ఫీ మోజు ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. ఓ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. మహారాష్ట్రలోని వరంధా ఘాట్ రోడ్డులో కోతులతో సెల్ఫీ తీసుకుంటూ 500 అడుగుల లోతైన లోయలో పడి 39 ఏళ్ల వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. మృతుడు అబ్దుల్ షేక్ మృతదేహాన్ని బుధవారం తెల్లవారుజామున వెలికితీసినట్లు అధికారి తెలిపారు. తన కారులో కొంకణ్ వైపు వెళుతున్న అబ్దుల్ షేక్, వరంధా ఘాట్ రోడ్డులోని వాఘ్‌జై దేవాలయం దగ్గర ఆగాడు. చుట్టూ కొన్ని కోతులు ఉండగా.. వాటితో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో కాలు జారి 500 అడుగుల లోయలో పడిపోయాడని భోర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ విఠల్ దబాడే చెప్పారు. స్థానిక సహ్యాద్రి రెస్క్యూ గ్రూప్ సహాయంతో పోలీసులు మృతదేహాన్ని వాగు నుంచి వెలికితీశారు. అబ్దుల్ ప్రాణాలు కోల్పోవడంతో.. అతడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.