మరో స్కూల్‌కి ఉపాధ్యాయుడి బదిలీ.. మమ్మల్ని వదిలి వెళ్లకండి సార్ అంటూ విద్యార్థుల కన్నీరు..
తాము అభిమానించే మాస్టారు మరో స్కూల్‌కు బదిలీ అవుతున్నారంటే జీర్ణించుకోలేరు.. అలాంటి ఘటనే ఇప్పుడు అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది.. కంబదూరు మండల కేంద్రం లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయుడు హనుమంతురాయుడు మరొక పాఠశాలకు బదిలీ అయ్యారు.. దీంతో, పాఠశాలలో వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ‘మమ్మల్ని వదిలి వెళ్లకండి సార్’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హనుమంతురాయుడు విద్యార్థుల మనస్తత్వాన్ని అర్థం చేసుకొని.. వారికి అనుగుణంగా బోధన చేసే వారని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు.. పేద విద్యార్థులకు గురుకులం, ఏపీఆర్ఎస్ వంటి వాటికి శిక్షణ ఇచ్చి.. ఎంపిక కావడంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేసుకుంటున్నారు..
మరోసారి తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్డి యత్నం..
వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు మరోసారి యత్నాలు చేశారు.. దీని కోసం అనుమతి కోరుతూ ఎస్పీ జగదీష్ కు లేఖ రాశారు కేతిరెడ్డి పెద్దారెడ్డి.. రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చిన విషయం విదితమే కాగా.. తాను తాడిపత్రి నియోజకవర్గంలో రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమాన్ని నిర్వహించాలి, అనుమతి ఇవ్వాలని ఎస్పీని కోరారు పెద్దారెడ్డి.. కాగా, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు ఏప్రిల్ 30వ తేదీన ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. అయితే, పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లినప్పుడు తగిన భద్రత కల్పించాలని ఆదేశాల్లో పేర్కొంది.. తాజాగా మరోసారి ఎస్పీకి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి లేఖ రాయడంపై చర్చ సాగుతోంది.. గతంలో ఆయన చేసిన ప్రయత్నాలు విఫలం కాగా.. మరి ఈ సారి పోలీసులు ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది..
డానిష్ ఫైబర్ టెక్నాలజీతో రోడ్లు.. ఏపీలో తొలిసారి..!
ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాలతో కూడిన ఆధునిక టెక్నాలజీతో ఏపీ రహదారులు పటిష్టంగా మారనున్నాయి, రాష్ట్రంలో మొట్ట మొదటి సారిగా డెన్మార్క్ డానిష్ ఫైబర్ టెక్నాలజీతో ఆర్ అండ్ బీ శాఖ వినూత్న ప్రయోగంతో రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. నంద్యాల జిల్లా సంజామల ముదిగేడు డబుల్ లైన్ రోడ్డులో పైలెట్ ప్రాజెక్టుగా కిలో మీటర్ మేరకు డానిష్ ఫైబర్ టెక్నాలజీతో ప్రయోగాత్మకంగా రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ వినూత్న ప్రయోగం సక్సెస్ అయితే రాష్ట్ర మొత్తం డానిష్ ఫైబర్ టెక్నాలజీతో కూడిన రహదారులు రూపు దిద్దు కొనున్నాయి. డెన్మార్క్ కు చెందిన డానిష్ ఆస్ఫాల్ట్ రీ-ఇన్ఫోర్సింగ్ ఫైబర్ ఆధునాతన టెక్నాలజీతో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన హీత్రో ఎయిర్ పోర్ట్ (యూకే), దుబాయ్ మెట్రో, A7 మోటార్ వే జర్మనీ, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ లాంటి దేశాల్లో భారీ ప్రాజెక్టుల్లో ఇప్పటికే విజయవంతం గా ఉపయోగించారు. ఈ టెక్నాలజీ ద్వారా అరమిడ్ మరియు పాలియోలెఫిన్ అనే అధిక బలం కలిగిన ఫైబర్లు ఆస్ఫాల్ట్ మిశ్రమంలో కలప బడతాయి.. ఇందులో ఉన్న జిగురు వంటి రసాయనిక ద్రవం, తారులో కలవడం వల్ల ప్లాస్టిక్ లాంటి పొర ఏర్పడుతుంది.. ఈ ప్రక్రియ ద్వారా సాధారణంగా రహదారులపై ఏర్పడే పగుళ్లు, గుంతలను నియంత్రించే సామర్థ్యం అత్యధికంగా ఉంటుంది.
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. 20 మంది విద్యార్థులు ఉంటే చాలు!
పేదరికాన్ని రూపుమాపాలన్నా.. ఒక వ్యక్తిని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లేది కేవలం చదువు మాత్రమే. అందుకే విద్యకు అంత ప్రాధాన్యతనిస్తూ ఖర్చుకు వెనకాడకుండా తమ పిల్లలను చదివిస్తున్నారు. ప్రభుత్వాలు సైతం విద్యావ్యాప్తికి కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. 20 మంది విద్యార్థులు ఉంటే చాలు.. ఆ ఏరియాలో ప్రభుత్వ పాఠశాల లేనట్టైతే వెంటనే ప్రాథమిక పాఠశాలను ప్రారంభించాలని ఆదేశించింది.
ఉదయం పెళ్లి.. మధ్యాహ్నం ప్రియుడితో పెళ్లి కూతురు జంప్..! బతికిపోయాడా..?
చెన్నైలో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిన్న ఉదయం 6 గంటలకు మాధవరం బర్మా కాలనీ ప్రాంతానికి చెందిన విజయకుమార్ అనే వ్యక్తికి పెరంబూరులోని అంబేద్కర్ నగర్‌కు చెందిన అర్చనకు బెసెంట్ నగర్ చర్చిలో వివాహం జరిగింది.. పెళ్లి తర్వాత కొత్త జంట ఇంటికి వచ్చింది.. అయితే, సాయంత్రం జరగనున్న రిసెప్షన్ కోసం తాను బ్యూటీ పార్లర్‌కు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లిన అర్చన.. ఎంతకీ రాకపోవడంతో అనుమానంతో గాలింపు చర్యలు చేపట్టారు.. కానీ, బ్యూటీ పార్లర్ వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి బయటకు వెళ్లిన అర్చన.. తన ప్రియుడు కలైతో కలిసి వెళ్లిపోయినట్టుగా గుర్తించారు.. దీనిపై తిరువిగ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు అర్చన తల్లి నాగవల్లి.. దీంతో, పోలీసులు రంగంలోకి దిగగా.. సాయంత్రం తిరువిగనగర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన అర్చన.. తాను వివాహం చేసుకున్న విజయకుమార్‌కు క్షమాపణ చెప్పి ప్రియుడు వెళ్లిపోయింది.. అయితే, ముందే ఈ విషయం చెబితే ఇంత వరకు వచ్చేవాళ్లం కాదు కదా.? అని పెళ్లి కొడుకు కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది.. ఎంగేజ్‌మెంట్, వివాహ తంతుకు అయిన ఖర్చులు ఎవరు బరిస్తారని మండిపడ్డారు.. దీంతో, వివాహ ఖర్చులకు తగిన పరిహారం అందిస్తామని అర్చన కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు.. అయితే, ఈ ఘటనపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.. తన భార్య, ప్రియుడి చేతిలో హత్యకు గురికాకుండా.. విజయ్‌కుమార్ బతికిపోయాడని కామెంట్ చేస్తున్నారు.
ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ కీలక సమావేశాలు.. బీజేపీ కొత్త చీఫ్‌పై చర్చ జరిగే ఛాన్స్
దేశ రాజధాని ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ కీలక సమావేశాలు జరగనున్నాయి. కేశవ్ కుంజ్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ నేతృత్వంలో మంతన్ బైటక్ జరగనుంది. ఈ సమావేశాల్లో ప్రధానంగా ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్దోత్సవాల ప్రణాళికలపై కీలకంగా చర్చించనున్నారు. అలాగే సామాజిక సమరసతపై ‘పంచ్ పరివర్తన్’ దిశానిర్దేశం చేయనున్నారు. అంతేకాకుండా డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాలపై కూడా మార్గదర్శకాలు చేయనున్నారు. ఇక ముంబై, బెంగుళూరు, కోల్‌కతా తదితర నగరాల్లో ప్రత్యేక సమావేశాలకు సన్నాహాలు చేస్తున్నారు. వీటిన్నంటితో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపికపై కూడా ఆర్ఎస్ఎస్ సమావేశంలో చర్చించనున్నారు.
టెక్సాస్‌లో ఆకస్మిక వరదలు.. 24 మంది మృతి.. 23 మంది చిన్నారులు గల్లంతు
అగ్ర రాజ్యం అమెరికాలోని టెక్సాస్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. టెక్సాస్ హిల్ కంట్రీలో ఆకస్మిక వరదలు సంభవించాయి. వరదలు కారణంగా 24 మంది మృతి చెందగా.. సమ్మర్ క్యాంప్ నుంచి 23 మంది పిల్లలు గల్లంతయ్యారు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. టెక్సాస్ హిల్ కంట్రీలో నెలల పాటు కురిసే వర్షమంతా కొన్ని గంటల్లోనే కురిసేసింది. దీంతో ఆకస్మిక వరదలు సంభవించాయి. అయితే అదే ప్రాంతంలో చిన్నారులకు సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. హఠత్తుగా వరదలు సంభవించడంతో దాదాపు 23 మంది బాలికలు గల్లంతయ్యారు. వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. పడవ, హెలికాప్టర్ సాయంతో రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో తల్లిదండ్రులు తమ బిడ్డల జాడ తెలిస్తే.. తెలియజేయాలని వేడుకుంటున్నారు.
ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? కొన్ని రోజుల్లో మారనున్న రూల్స్.. ఇకపై ఆ బెనిఫిట్స్ ఉండవు
క్రెడిట్ కార్డు ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగకరంగా ఉండడంతో వినియోగదారుల సంఖ్య పెరిగింది. బ్యాంకులు సైతం రకరకాల ఆఫర్లతో క్రెడిట్ కార్డులను ఇస్తున్నాయి. మరి మీరు కూడా క్రెడిట్ కార్డును యూజ్ చేస్తున్నారా? ముఖ్యంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూజ్ చేసేవారు ఖచ్చితంగా ఇది తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే కొన్ని రోజుల్లో చాలా రూల్స్ మారబోతున్నాయి. జూలై 15 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. వీటిలో, ప్రతి నెలా బిల్లు చెల్లించాల్సిన కనీస మొత్తం (MAD) గురించి కొత్త మార్గదర్శకాలు అమలు చేయబడతాయి. కాబట్టి కంపెనీ కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ కవర్ విషయంలో కూడా పెద్ద నిర్ణయం తీసుకుంది.
‘తమ్ముడు’ని నమ్ముకుని నిండా మునిగిన హీరోయిన్
నేషనల్ క్రష్ రష్మికను స్పూర్తిగా తీసుకుని ఎంతో మంది ముద్దుగుమ్మలు సౌత్ ఇండస్ట్రీపై ఎటాక్ చేస్తున్నారు. ఇప్పటికే ఆషికా రంగనాథ్, రుక్మిణీ వసంత్, శ్రీనిధి శెట్టి, శ్రద్ధా శ్రీనాథ్ లాంటి కన్నడ కస్తూరీలు లక్ పరీక్షించుకున్నారు. వీరి జాబితాలోకి చేరింది కాంతార ఫేం సప్తమి గౌడ. నితిన్ తమ్ముడుతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది.కాంతారతో పాపులరైన సప్తమి గౌడ.. ఆ తర్వాత కూడా అలాంటి రోల్సే రావడంతో చూజీగా సినిమాలు ఎంచుకొంటోంది. ది వాక్సిన్ వార్ తో బాలీవుడ్‌లో లెగ్గెట్టిన ఈ చిన్నది అక్కడ హిట్ కొట్టింది.
ఫిష్ వెంకట్ కు ప్రభాస్ సాయం.. ఫేక్ వార్తలపై క్లారిటీ ఇదే
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, హాస్యనటుడు ఫిష్ వెంకట్ చాలాకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో పాటు షుగర్, బీపీ వ్యాధులతో బాధపడుతున్నాడు. అనారోగ్య కారణాలతో సినిమాలకు కూడా దూరంగా ఉంటున్నాడు. ఫిష్ వెంకట్ కు అనారోగ్య సమస్యలు ఎక్కువ అవడంతో కుటుంబ సభ్యులు కొద్దీ రోజుల క్రితం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఫిష్ వెంకట్ పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు. తండ్రి అనారోగ్యం గురించి చెప్తూ ఆర్థిక సాయం కావాలని ఫిష్ వెంకట్ కుమార్తె స్రవంతి ఒక వీడియో ద్వారా వేడుకుంది. అందుకు స్పందించి ‘ హీరో ప్రభాస్ అసిస్టెంట్ అని ఒకరు కాల్ చేశారు. ఎవరైనా కిడ్నీ ఇచ్చే డోనర్ ను వెతకండి. మీ నాన్నగారి ఆపరేషన్ కు కావల్సిన రూ. 50 లక్షలు మేము ఏర్పాటు చేస్తాం’ అని చెప్పినట్లు స్రవంతి తెలిపింది. కానీ ఫిష్ వెంకట్ వైఫ్ గబ్బర్ సింగ్ గ్యాంగ్ తప్ప ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీ నుండి ఎవ్వరూ రాలేదు, ఫోన్ చెయ్యలేదు అని చెప్పారని మరొక వర్షన్ బయటకు వచ్చింది. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో కాస్త రచ్చకు దారి తీసింది. అసలు వినిపిస్తున్న సమాచారం ప్రకారం ప్రభాస్ టీమ్ కాల్ చేసింది వాస్తవం. డోనర్ దొరికితే చెప్పండి అందుకు తగ్గ సాయం చేస్తామని చెప్పారట. ఇది అసలు విషయం.