స్థానిక సంస్థల ప్రతినిధులతో నేడు జగన్ భేటీ
వరుసగా వివిధ జిల్లాల నేతలు, పార్టీ నేతలు, ప్రజా సంఘాలు.. ఇలా వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్.. ఈ సమావేశానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మున్సిపాలిటీ, అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు నగర పంచాయతీ, శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం వైసీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో భేటీ కానున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు జగన్.. మరోవైపు, నేడు ప్రకాశం జిల్లా పొదిలిలో వైఎస్ జగన్ పర్యటనకు వెళ్లనున్నారు.. పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించనున్నారు జగన్.. పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించేలా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో భాగంగానే ఈ పర్యటనకు వెళ్లనున్నారు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..
ఏపీలో మరో 3 కరోనా కేసులు.. ఒకరికి సీరియస్..!
కరోనా వైరస్ మరోసారి కలవరపెడుతోంది.. ప్రపంచవ్యాప్తంగా విజృంభించి.. ఎన్నో లక్షలమంది ప్రాణాలు తీసిన మాయదారి వైరస్.. మరోసారి విరుచుకుపడుతోంది.. దేశవ్యాప్తంగా క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.. ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటిపోయినట్టు అధికారిక లెక్కలే చెబుతున్నాయి.. అయతే, ఏపీలోనూ కోవిడ్ 19 కేసులు వెలుగు చూస్తున్నాయి.. రాష్ట్రంలో తాజాగా, మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రిలో పరీక్షల అనంతరం ఏలూరుకు చెందిన భార్యాభర్తలకు కరోనా సోకినట్లుగా తేల్చారు వైద్యులు.. మరోవైపు, తెనాలికి చెందిన 83 ఏళ్ల వృద్ధుడు కరోనా బారినపడ్డారు. వృద్ధుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఇద్దరికి కరోనా నిర్ధారణ కాగా, దేశవ్యాప్తంగా కేసులు వెయ్యి దాటినట్టు అధికారులు వెల్లడించారు. అయితే, కరోనా బారినపడకుండా.. ప్రజలు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు..
నేడే టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్నిక.. నామినేషన్లు వేసేది ఎవరు..?
తొలిరోజు అట్టహాసంగా ప్రారంభం అయ్యింది టీడీపీ మహానాడు.. తెలుగుదేశం పార్టీ చరిత్రలో మొట్టమొదటిసారి కడప జిల్లాలో మహానాడు నిర్వహిస్తున్నారు. తిరుమల తొలిగడప, దేవుని కడపలో జరుగుతున్న మహానాడు చరిత్ర సృష్టిస్తుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇక, మహానాడు ఈ రోజు కీలక ఘట్టానికి వేదిక కానుంది.. టీడీపీ జాతీయ అధ్యక్ష పదవికి నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.. ఆ తర్వాత మధ్యాహ్నం జాతీయ అధ్యక్షుడు ఎన్నిక జరగనుంది.. సాయంత్రం నూతనంగా ఎన్నికైన జాతీయ అధ్యక్షుని చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మరోసారి నామినేషన్ దాఖలు చేయనున్నారని తెలుస్తోంది.. పోటీ లేనందున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడునే నేడు టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉంది.. అయితే, గత కొంత కాలంగా పార్టీలోనూ మంత్రి నారా లోకేష్‌కి కీలక బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ సాగుతూ వస్తోంది.. దీంతో, లోకేష్‌కి ఏం బాధ్యతలు ఇస్తారు? అనేది ఆసక్తికరంగా ఆమారింది.. ఇప్పటికే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు లోకేష్.. ఇప్పుడు మరింత కీలకమైన పదవి కట్టబెడతారని తెలుస్తుండగా..? అది ఏ పదవి అనేది చర్చగా మారింది..
సౌదీ అరేబియా అధికారిక ప్రకటన.. హజ్ యాత్ర అప్పటినుంచే ప్రారంభం..!
హజ్ అనేది ముస్లింలకు అత్యంత పవిత్రమైన తీర్థయాత్రగా పరిగణించబడుతుంది. ఇది సౌదీ అరేబియాలోని మక్కాలో ఉన్న మస్జిద్ అల్-హరామ్ (పవిత్ర మసీదు) ప్రాంతంలో జరగుతుంది. హజ్ యాత్ర ఇస్లాం మతంలోని కీలక అంశం. అంటే ఒక ముస్లిం ఆర్థికంగా, శారీరకంగా స్తోమత ఉన్నంతలో తన జీవితంలో కనీసం ఒక్కసారి హజ్ యాత్ర చేయాలి. ఇక హజ్ ప్రతి సంవత్సరం ఇస్లామిక్ క్యాలెండర్‌లోని 12వ నెల ధుల్ హిజ్జా లో నిర్వహించబడుతుంది. ధుల్ హిజ్జా 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరిగే ఈ పవిత్ర యాత్రలో లక్షలాది ముస్లింలు పాల్గొంటారు. హజ్ లో భాగంగా ముస్లింలు ‘కాబా’ చుట్టూ తవాఫ్ చేయడం, సఫా-మర్వా కొండల మధ్య నడవడం, మినా, అరాఫాత్, ముజ్దలిఫాలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనడం వంటి ఆత్యాద్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 2025లో హజ్ యాత్ర, చంద్రుని దర్శనాన్ని ఆధారంగా చేసుకుని, జూన్ 4 నుండి జూన్ 9 మధ్యలో జరగనుందని అంచనా. కాగా, హజ్ తేది ఖచ్చితంగా చంద్రుని తొలినాటి దర్శనంపై ఆధారపడి నిర్ణయించబడుతుంది. ఇస్లామిక్ క్యాలెండర్ చంద్రుని చక్రాన్ని అనుసరిస్తుంది, అందువల్ల ఇది గ్రెగోరియన్ క్యాలెండర్ (సాధారణ క్యాలెండర్)తో పోలిస్తే ప్రతి సంవత్సరం 11–12 రోజులు ముందుకు వస్తుంది. అందుకే ప్రతి సంవత్సరం హజ్ తేది మారుతూ ఉంటుంది.
విద్యార్థి వీసా ఇంటర్వ్యూలను నిలిపివేయాలని ట్రంప్ ప్రభుత్వం ఆదేశం.. ఆ కారణంతోనే..
విదేశీ విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూలను ట్రంప్ ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధించింది. సోషల్ మీడియా ఖాతాలపై లోతైన దర్యాప్తును తప్పనిసరి చేసే ప్రణాళికలో భాగంగా ఈ చర్య తీసుకుంది. విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంతకం చేసిన పత్రాలను ఉటంకిస్తూ పొలిటికో ఈ సమాచారాన్ని అందించింది. ఈ చర్య విద్యార్థుల వీసా ప్రక్రియపై తీవ్రమైన ప్రభావాలను చూపుతుందని, ఆర్థికంగా నిలకడగా ఉండటానికి విదేశీ విద్యార్థుల ప్రవేశాలపై ఎక్కువగా ఆధారపడే అనేక US విశ్వవిద్యాలయాలను దెబ్బతీస్తుందని నివేదిక పేర్కొంది. జాతీయ భద్రత, రాజకీయ వ్యూహాన్ని దృష్టిలో ఉంచుకుని ట్రంప్ ప్రభుత్వం ఈ చర్య తీసుకుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ నిర్ణయం అమెరికా వీసా ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల విదేశీ విద్యార్థులపై ఆధారపడిన విశ్వవిద్యాలయాలకు ఆర్థిక నష్టాలు సంభవించవచ్చు. తదుపరి మార్గదర్శకాలు జారీ అయ్యే వరకు, విద్యార్థి (F), వ్యాపార (M), ఎక్స్ఛేంజ్ విజిటర్ (J) వీసాలకు కొత్త ఇంటర్వ్యూలు షెడ్యూల్ చేయబడవని నివేదిక పేర్కొంది. కొత్త నిబంధన ప్రకారం, గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యకు వ్యతిరేకంగా నిరసనలలో పాల్గొన్న విద్యార్థుల సోషల్ మీడియా కార్యకలాపాలను ప్రత్యేకంగా తనిఖీ చేస్తారు. విదేశీ విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాల తనిఖీపై అమెరికా దృష్టి పెడుతుండటంతో వివిధ దేశాల నుంచి దరఖాస్తు చేసుకొన్న విద్యార్థులు యూఎస్‌లో తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. అమెరికా వెళ్లి చదువుకోవడం కష్టంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలోనే ‘ఒకే ఒక్కడు’!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ సహా టీ20 క్రికెట్‌లో ఓ జట్టు తరఫున 9 వేల పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2025 లో భాగంగా మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) తరఫున 9000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ 24 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద 9000 పరుగుల మార్కును చేరుకున్నాడు. ఇందులో ఐపీఎల్‌తో పాటు ఛాంపియన్స్ లీగ్‌లో ఆర్‌సీబీ తరఫున చేసిన పరుగులు ఉన్నాయి. టీ20 క్రికెట్‌లో ఓ జట్టు తరఫున 9వేల పరుగుల మైలురాయి అందుకున్న జాబితాలో విరాట్ కోహ్లీ అగ్ర స్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ 6060 రన్స్ చేశాడు. హంప్‌షైర్ తరఫున జేమ్స్ విన్స్ 5934 పరుగులు చేసి మూడో స్థానంలో ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సురేశ్ రైనా 5529 పరుగులు, ఎంఎస్ ధోనీ 5314 రన్స్ చేశారు. కోహ్లీ ఐపీఎల్ ఆరంభం నుంచి ఆర్‌సీబీకే ఆడుతున్న విషయం తెలిసిందే. రోహిత్ ముందుగా డెక్కన్ ఛార్జర్స్, ఆపై ముంబై తరఫున ఆడుతున్నాడు.
ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళి!
నేడు నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 102వ జయంతి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళులు అర్పించారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒకే కారులో వచ్చి తాత సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. నందమూరి మిగతా కుటుంబ సభ్యులు కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చి నివాళులర్పించనున్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్దకు భారీగా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. దీంతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఎన్టీఆర్ జయంతి సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది మే 28న ఎన్టీఆర్ జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించాలని పేర్కొంటూ జీవో జారీ చేసింది.
ఆయనతో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను..
ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎంతో ఆటహాసంగా జరిగింది. ఇందులో పలువురు భారతీయ నటీమణులు, హీరోలు పాల్గోనగా. బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్, ఐశ్వర్యారాయ్, ఊర్వశి రౌతెలా, ప్రణీత సుభాష్.. ఇలా ఎందరో స్టార్స్ రెడ్ కార్పెట్‌పై నడిచారు. అయితే లేటుగా వచ్చినా కేన్స్‌లో అదరగొట్టింది బాలీవుడ్ అందాల తార అలియా భట్. కలర్ ఫుల్ డ్రెస్సుల్లో రెడ్ కార్పెట్ పై నడిచి అందరినీ చూపు తన వైపు తిప్పుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు అని సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. కాగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమానికి కూడా అలియా భట్ ముఖ్య అతిథిగా హాజరయ్యారకాగా. ఈ క్రమంలో పలు ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చింది. ఇందులో భాగంగా ఒక దక్షిణ భారతీయ నటుడి గురించి అలియా మాట్లాడటం విశేషం.. ఇంతకీ ఎవరతను అనుకుంటున్నారా.. ‘పుష్ప 2’ విలన్ ఫహాద్ ఫాజిల్. ‘నిజంగా నేను ఆరాధించే నటుల్లో ఫహాద్ ఒకరు. ఆయన చాలా అద్భుతమైన నటుడు. ఆయన నటించిన చిత్రాల్లో ‘ఆవేశం’ నాకు చాలా ఇష్టం. కచ్చితంగా అవకాశం వస్తే అతనితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా సినిమాలు ఆస్వాదిస్తున్నారు ప్రేక్షకులు. అందుకే చిత్రపరిశ్రమలన్నీ ఒకే యూనిట్ అని కరోనా రోజుల్లో తెలుసుకున్నా’ అని అంది అలియా. ప్రజంట్ ఈ అమ్మడు మాటలు వైరల్ అవుతున్నాయి..
‘టూరిస్ట్ ఫ్యామిలీ’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
ప్రస్తుతం కోలీవుడ్‌లో ఓ సెన్సేషన్‌గా మారిపోయిన చిత్రం ‘టూరిస్ట్ ఫ్యామిలీ’. శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో నటించగా.. యోగి బాబు, మిథున్ జై శంకర్, కమలేశ్ జగన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. అభిషాన్ జీవింత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, మే 1న చిన్న చిత్రంగా ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా చూసి పలువురు సెలబ్రిటీలు సైతం ఫిదా అయ్యారు. ఇప్పటికే రజినీకాంత్, రాజమౌళి, సూర్య, నాని వంటి వారు కూడా ఈ మూవీపై ప్రశంసలు కురిపించగా. సూర్య అయితే టీంను పిలిపించుకుని మరీ అభినందించాడు. అలా టూరిస్ట్ ఫ్యామిలీ అయితే ఇటు ఆడియెన్స్‌ని, అటు సెలెబ్రిటీలను ఆకట్టుకుంది. ఇప్పటికే రూ.75 కోట్లకు పైగానే కలెక్షన్‌లు రాబట్టగా.. మొదటి సినిమాతోనే డైరెక్టర్ అభిషాన్ ఈ రేంజ్ విక్టరీ సాధించడం అంటే చిన్న విషయం కాదు. అయితే తాజాగా ఈ మూవీ OTT రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు జియో హాట్ స్టార్ వారు సొంతం చేసుకోగా, ఈ జూన్ 2 నుంచి సినిమా అందుబాటులోకి వస్తుంది అని రివీల్ చేశారు. అయితే ఈ చిత్రం తమిళ్ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా స్ట్రీమింగ్ కావచ్చని తెలుస్తోంది. మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే కేవలం తమిళ్ లోనే రిలీజ్ అవ్వడం తో, తెలుగు ప్రేక్షకులు కూడా ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.