వణికిస్తున్న చలి.. సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు
తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి.. తెల్లవారుజామున బయటకు రావాలంటేనే వణికిపోయే పరిస్థితులు వస్తున్నాయి.. ఇక, ఏజెన్సీల్లో అయి మరీ దారుణంగా పరిస్థితులు ఉన్నాయి.. అల్లూరి సీతారామ రాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో కనిష్ట స్థాయికి పడిపోయాయి ఉష్ణోగ్రతలు.. ఈ సీజన్ లో తొలిసారి సింగిల్ డిజిట్ నమోదు అయ్యింది.. ఈ రోజు ముంచింగిపుట్టులో 9 డిగ్రీల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు అధికారులు తెలిపారు.. ఇక, పాడేరులో 12 డ్రిగ్రీలు నమోదు కాదు.. మినుములూరు, ముంచంగి పుట్టులో 09 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.. మొత్తంగా ఏజెన్సీని చలి వణికిస్తోంది.. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.. చలి తీవ్రతకు చలి మంటలను ఆశ్రయిస్తున్నారు స్థానికులు.. ఈ ఏడాది ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మరింత ఉష్ణోగ్రతలు పడిపోతాయే అంచనాలు ఉన్నాయి.. మరోవైపు.. పాడేరు, వంజంగి పర్యటక కేంద్రం వద్ద మేఘాల మాటున సూర్యోదయం తిలకించేందుకు కొండ పైకి భారీగా చేరుకున్నారు పర్యాటకులు.. సాధారణంగా చలి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో అరకు సహా ఏజెన్సీ ప్రాంతాల సందర్శనకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే విషయం విదితమే..
ముంచుకొస్తున్న పోలీసుల డెడ్‌లైన్..! ఆర్జీవీ ఏం చేస్తారు..?
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇప్పుడు ఏం చేస్తారు? అనేది ఉత్కంఠగా మారింది.. ఓ వైపు పోలీసుల పెట్టిన డెడ్‌లైన్ ముంచుకొస్తుంది.. మరోవైపు.. హైకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది ఈ నేపథ్యంలో ఆర్జీవీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.. ఇవాళ ప్రకాశం జిల్లా మద్ధిపాడు పోలీస్ స్టేషన్‌లో డైరెక్టర్ రాంగోపాల్ వర్మ విచారణకు హాజరుకావాల్సి ఉంది.. ట్విట్టర్ (ఎక్స్)లో అనుచిత పోస్టింగ్ పై టీడీపీ నేత ఫిర్యాదుతో రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేశారు పోలీసులు.. అంతేకాదు.. ఇవాళ విచారణకు హాజరుకావాలని నోటీసులు కూడా జారీ చేశారు.. అయితే, హాజరుకు రెండు వారాల సమయం ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు రాంగోపాల్ వర్మ.. కానీ, పోలీసుల ముందు హాజరుకు గడువు కావాలంటే సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ నే అభ్యర్థించాలని స్పష్టం చేసింది కోర్టు.. దీంతో.. వర్మకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది.. అనివార్యంగా ఇవాళ మద్ధిపాడు పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి వచ్చింది.. ఈ నేపథ్యంలో సంచలన దర్శకుడు ఆర్జీవీ ఏం చేస్తారు? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అసలు విచారణకు వస్తారా? పోలీసు విచారణ నుంచి తప్పించుకోవడానికి ఇంకా ఏదైనా చేస్తారా? మరోసారి కోర్టుకు వెళ్లే అవకాశం ఉందా? ఇలా ఆర్జీవీ వ్యవహారంలో ఉత్కంఠ నెలకొంది.
ఉమ్మడి జిల్లాలో హడలెత్తిస్తున్న పులులు.. ఒకవైపు మగ పులి, మరో వైపు ఆడపులి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులులు హడలెత్తిస్తున్నాయి. ఒకవైపు మగ పులి, మరో వైపు ఆడపులి సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తోడు కోసం వందల కిలో మీటర్ల ప్రయాణం చేస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. అడ్డొచ్చిన ఆవులు, ఎద్దుల పై దాడి చేస్తూ ముందుకు సాగుతున్నాయి. అటు ఆకలి తీర్చుకుంటూ ఇటు తోడు కోసం ఆరాటం పడుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ రెండు పులులు అడవులు, కొండ,గుట్టలు, పంటచేనులను చుట్టేస్తున్నట్లు తెలిపారు. మెటింగ్ సీజన్ కావడంతో ఆ రెండు కలుస్తాయని అటవీ శాఖ అధికారులు అంటున్నారు. మహారాష్ట్ర నుండి నిర్మల్, బోథ్ సరిహద్దు మండలాల్లోకి ప్రవేశించన పులి జానీగా గుర్తించారు. గత నెల 23 న తెలంగాణలోకి ప్రవేశించి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా అడవుల్లో సంచరిస్తున్నట్లు తెలిపారు. మరో వైపు రెండు నెలల క్రితం కొమురం భీం జిల్లా కెరమేరి అడవుల్లోకి వచ్చిన ఆడ పులి జోడేఘాట్ అడవుల్లో సంచరించింది. ప్రస్తుతం రెండు టైగర్స్ సమీపంకు చేరుకున్న ట్లు అధికారులు గుర్తించారు. కేవలం పదుల కిలో మీటర్ల దూరంలోనే రెండు పులులు సంచరిస్తున్నట్లు తెలిపారు. రెండు పులుల సంచారంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. పులి సంచరించే ప్రాంతాల్లో అటవీ శాఖ అప్రమత్తమైంది. ఆయా గ్రామాల్లో పులి రక్షణపై జనంకు అవగాహన కల్పిస్తు్న్నారు. పులులకు హాని తలపెట్టే ఉచ్చులు, విద్యుత్ వైర్లు పెట్టకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పులులకు హాని తల పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ హెచ్చరించింది. పశువులపై పులులు దాడి చేస్తే వెంటనే పరిహారం చెల్లింపు ఉంటుందని తెలిపారు.
నేడు వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..
నేడు వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ప్రజా పాలన – ప్రజా విజయోత్సవా సభలో పాల్గొననున్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2:30 కు ముఖ్యమంత్రి హన్మకొండ కుడా గ్రౌండ్స్ హెలిపాడ్‌కు చేరుకుంటారు. ముందుగా కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవంలో పాల్గొని ఆర్ట్ గ్యాలరీని సందర్శిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆర్ట్స్ కాలేజ్ లో ఏర్పాటు చేసిన విజయోత్సవ వేదికకు చేరుకుంటారు. మధ్నాహ్నం 3:20కి అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శించి.. మహిళా స్వయం సహాయక సంఘాలు, మండల సమాఖ్య, జిల్లా సమాఖ్య సభ్యులతో ముఖాముఖి మాట్లాడుతారు. రాష్ట్రంలోని 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు ముఖ్యమంత్రి అక్కడే శంకుస్థాపన చేస్తారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా బ్యాంక్ లింకేజ్ చెక్కులు, భీమా చెక్కులు పంపిణీ చేస్తారు. అనంతరం వేదికపై ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు.సాయత్రం 5.10 హెలికాప్టర్ లో హైదారాబాద్ కి తిరిగి వెళతారు.
నేడు 500 మార్క్ను తాకిన ఢిల్లీ వాయు కాలుష్యం..
దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇండ్లు, కార్యాలయాల లోపల కూడా పొగ అలుముకోవడంతో ఢిల్లీ వాసులకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారిపోయింది. కళ్లు పొడిబారడం, మంట లాంటి సమస్యలో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే, ఈ రోజు (మంగళవారం) ఏక్యూఐ 500 మార్క్ తాకింది. దీంతో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) IV ప్రస్తుతం దేశ రాజధానిలో కఠినమైన ఆంక్షలనను అమలు చేస్తుంది. ఈ కాలుష్యం తీవ్రతకు వృద్ధులు శ్వాస తీసుకోవడానికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇంత తీవ్రమైన కాలుష్యాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని ఢిల్లీ ప్రజలు పేర్కొంటున్నారు. ఊపిరి తీసుకుంటున్నామో, పొగ తాగుతున్నామో అర్థం కానంతగా కాలుష్యం పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఢిల్లీ నగరంలో సోమవారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 494గా రికార్డు అయ్యింది. గత ఆరేళ్లలో ఇది రెండోసారి అత్యధికం అని అధికారులు చెప్పారు. ఇక, సీపీసీబీ లెక్కల కంటే చాలా ప్రమాదకరంగా కాలుష్యం మారినట్లు స్విట్జర్లాండ్‌కు చెందిన ఐక్యూఎయిర్ సంస్థ తెలిపింది. ఈ గాలి కాలుష్యం కారణంగా ఇప్పటికే 14 విమానాలను దారి మళ్లించగా.. మరి కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక, పాఠశాలలు, కాలేజీలను మూసి వేసి ఆన్‌లైన్ తరగతులు చెప్తున్నారు.
మాజీ మంత్రిపై రాళ్లతో దాడి.. చికిత్స పొందుతున్న అనిల్ దేశ్‌ముఖ్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల హడావుడి నెలకొన్న సమయంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఎన్సీపీ (ఎస్పీ) నేత, మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వెహికిల్ పై నాగ్‌పుర్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఇక, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్ఖేడ్‌లో నిర్వహించిన ఓ సమావేశానికి హాజరైన అనిల్ దేశ్‌ముఖ్.. ఆ తర్వాత కటోల్‌కు తిరుగు ప్రయాణమవ్వగా.. ఈ క్రమంలోనే మార్గ మధ్యంలో జలాల్‌ఖేడా రోడ్‌లోని బెల్ ఫాటా దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ప్రయాణిస్తున్న కారుపై రాళ్లతో దాడికి దిగారు. అయితే, ఈ ఘటనలో మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే కటోల్‌లోని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనపై విచారణ స్టార్ట్ చేశామని.. దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు చర్యలు చేపట్టినట్లు నాగ్‌పుర్ రూరల్ ఎస్పీ హర్ష్ పొద్దర్ పేర్కొన్నారు. అనిల్ దేశ్‌ముఖ్ గతంలో మహారాష్ట్ర హోంమంత్రిగా విధులు నిర్వహించారు. రూ. కోట్లలో లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలు వచ్చాయి.. దీంతో మంత్రివర్గం నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు సలీల్ దేశ్‌ముఖ్ కటోల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్‌సీపీ (ఎస్పీ) తరఫున ఎన్నికల బరిలో నిలిచారు.
శబరిమలకు పోటెత్తిన భక్తులు.. అయ్యప్ప దర్శనానికి 10గంటల సమయం
శబరిమలకు అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. వేలాది మంది భక్తులు రావడంతో శబరిగిరులు అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగిపోతున్నాయి. ఇక, అయ్యప్ప స్వామి దర్శనానికి దాదాపు 10 గంటల సమయం పడుతుంది. సన్నిధానం నుంచి పంబ వరకూ అయ్యప్ప భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. మండల పూజలు ప్రారంభం కావడంతో శబరిమలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుండటంతో అందుకు తగినట్లుగా ఏర్పాట్లను ఆలయ కమిటీ ట్రావెన్ కోర్ చేస్తుంది. కాగా, ఇప్పటికే శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తుల దర్శనం కోసం ట్రావెన్ కోర్ దేవస్థానం కమిటీ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ముందుగానే ఆన్ లైన్ లో టిక్కెట్లను బుక్ చేసుకోవడం ద్వారా దర్శనం కల్పిస్తుంది. అయినా భక్తుల తాకిడి తగ్గకపోవడంతో దర్శనానికి చాలా సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఈ నెల మొత్తం శబరిమలలో భక్తుల సంఖ్య అధికంగా ఉంటుందనే అంచనాతో అనేక నిర్ణయాలు ట్రావెన్ కోర్ దేవస్థానం తీసుకుంటుంది.
నింగిలోకి దూసుకుపోయిన జీశాట్-20 శాటిలైట్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రూపొందించిన అత్యంత అధునాతన సమాచార శాటిలైట్ జీశాట్-20 (జీశాట్-N2) నింగిలోకి దూసుకుపోయింది. స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ఈ జీశాట్-20ను నింగిలోకి మోసుకుపోయింది. అమెరికాలోని ఫ్లోరిడా కేప్ కెనావెరల్ వేదికగా ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. సుమారు 34 నిమిషాల పాటు ప్రయాణించిన తర్వాత ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశ పెట్టారు. కాగా, 4700 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని మన రాకెట్‌లు తీసుకెళ్లేందుకు సాధ్యపడలేదు.. దీంతో స్పేస్ ఎక్స్ ద్వారా ఇస్రో ప్రయోగించింది. జీశాట్-20 శాటిలైట్ 14 ఏళ్ల పాటు సేవలు అందించనుంది. వాణిజ్య పరంగా ఇస్రో, స్పేస్‌ఎక్స్ మధ్య ఇదే తొలి ప్రయోగం అని చెప్పాలి. భారత్‌లోని మారుమూల ప్రాంతాలు, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ లాంటి ద్వీపాల్లోనూ ఇంటర్నెట్ సేవలను అందించడమే ఈ ఉపగ్రహం యొక్క ప్రధాన లక్ష్యం. అంతేకాకుండా అడ్వాన్స్‌డ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ లక్ష్యంగా ఇస్రో దీన్ని తయారు చేసింది. జీశాట్-ఎన్2 శాటిలైట్ ద్వారా విమానాల్లో వై-ఫై సేవలు మరింత విస్తృతం కాబోతున్నాయి.
ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు కానీ.. ఆర్‌సీబీకి కోచ్‌గా ఎంపికయ్యాడు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) సిద్దమైంది. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ముగ్గురిని మాత్రమే రిటైన్ చేసుకున్న ఆర్‌సీబీ.. కొత్త జట్టు కోసం ప్రణాళికలు రూపొందించింది. వేలంలో టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను తీసుకునేందుకు ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. భారీ ధర పెట్టైనా రాహుల్‌ను సొంతం చేసుకుని.. జట్టు పగ్గాలు అప్పగించాలనే ప్రణాళికతో ఆర్‌సీబీ ఉందట. అయితే వేలంకు ముందే సపోర్ట్ స్టాఫ్ విషయంలోనూ ఆర్‌సీబీ మేనేజ్మెంట్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఆర్‌సీబీ తమ బౌలింగ్ కోచ్‌గా ముంబై రంజీ టీమ్ హెడ్ కోచ్ ఓంకార్ సాల్విని నియమించుకుంది. ఈ దేశవాళీ సీజన్ ముగిసిన తర్వాత సాల్వి కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. సాల్వి ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకపోవడం విశేషం. 2005లో రైల్వేస్ తరఫున ఒక్క మ్యాచ్ ఆడి.. ఒక వికెట్ తీశాడు. అయితే ఓంకార్‌కు ఆటగాడిగా అనుభవం లేకున్నా.. కోచ్‌గా మాత్రం సూపర్ క్రేజ్ ఉంది. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు అసిస్టెంట్ బౌలింగ్ కోచ్‌గా సాల్వి పనిచేశారు. అక్కడ అతడికి పెద్దగా గుర్తింపు రాలేదు.
కాస్త ఓపిక పట్టండి.. ఏం జరుగుతుందో చూస్తారు: పీసీబీ చీఫ్
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విషయంలో సందిగ్థత వీడడం లేదు. ఓవైపు ఆతిథ్యం విషయంలో పాకిస్థాన్ మొండిగా ఉండగా.. మరోవైపు పాక్‌కు వెళ్లి ఆడేందుకు భారత్ సిద్ధంగా లేదు. టోర్నమెంట్‌ను హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహిస్తేనే పాల్గొంటామని ఐసీసీకి బీసీసీఐ తేల్చి చెప్పగా.. భారత్ ఆడే మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని పీసీబీని అంతర్జాతీయ క్రికెట్ మండలి కోరింది. ఈ ప్రతిపాదనకు పీసీబీ ఒప్పుకోవడం లేదు. సోమవారం లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఆధునీకీకరణ పనులను పరిశీలించిన పీసీబీ ఛైర్మన్ మొహసీన్ నఖ్వీ మీడియాతో మాట్లాడారు. పాకిస్థాన్‌లో పర్యటించకపోవడానికి గల కారణాలను బీసీసీఐ వివరించాలని తాము ఐసీసీకి లేఖ రాశామని మొహసీన్ నఖ్వీ చెప్పారు. ‘ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి అర్హత సాధించిన ప్రతి టీమ్ పాకిస్థాన్‌కు వచ్చేందుకు రెడీగా ఉంది. భద్రత విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భారత్‌కు ఏవైనా అభ్యంతరాలు ఉంటే.. మేం వారితో చర్చించి పరిష్కరిస్తాం. క్రీడలు, రాజకీయాలు వేరు. క్రీడలను రాజకీయం చేయడం నాకు ఇష్టం లేదు. అంతా బాగానే జరుగుందని ఆశిస్తున్నాము. ఐసీసీ త్వరలో ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను ప్రకటిస్తుంది’ అని నఖ్వీ తెలిపారు.
కీర్తిసురేష్ పెళ్లి ఎప్పుడు – ఎక్కడంటే..?
నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది కీర్తి సురేష్. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాతో స్టార్ స్టేటస్ ను అందుకుని తమిళం, తెలుగు, మలయాళం సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది కీర్తి . ఇటీవల కీర్తి సోలోగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. కాగా కీర్తి పెళ్లి అని ఇటీవల న్యూస్ హల్ చల్ చేస్తున్నాయి. ఓ సారి కమెడియన్ తో లవ్ అని, మరోసారి మ్యూజిక్ డైరెక్టర్ ను పెళ్లి చేసుకోబోతుందని , ప్రముఖ బిజినెస్ మ్యాన్ తో ఎంగేజ్‌మెంట్ రోజుకొకపుకార్లు వినిపించాయి. తాజాగా మరోసారి కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ ఈ వార్తలు నిజమే అని కోలీవుడ్ మీడియా అంటోంది. కీర్తి సురేష్ తన చిరకాల మిత్రుడు ఆంటోని తత్తిల్ ను పెళ్లాడబోతుంది. కీర్తి, ఆంటోనీ గత 15సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారట. ఇక ఆంటోనీ విషయానికి వస్తే కేరళ లోని కొచ్చికి చెందిన వాడు. గత పదేళ్లుగా ఆంటోనీ దుబాయ్ లో పెద్ద బిజినెస్ మాన్ గా సెటిల్ అయ్యారు. ఎప్పటి నుండో ప్రేమలు ఉన్న ఈ జంట పెద్దల అంగీకారం కోసం ఎదురుచూస్తూ మొత్తానికి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పెళ్లి చేసుకోబోతున్నారు. కీర్తి , ఆంటోని కళ్యాణం డిసెంబరు 11న ఫిక్స్ చేశారట. ఈ వివాహ వేడుకను గోవా బీచ్లో డెస్టినేషన్ వెడ్డింగ్ లా గ్రాండ్ గా నిర్వహించబోతున్నారట. మొత్తానికి మహానటి మెట్టినింట అడుగుపెట్టనుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
ఎ.ఆర్.రెహ్మాన్‌కిచ్చిన మాట నిలబెట్టుకున్న మెగా పవర్ స్టార్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహ్మాన్‌కిచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కడప దర్గాను సందర్శిస్తానన్న చరణ్.. ఇచ్చిన మాట ప్రకారం కడప దర్గాలో జరిగిన 80వ జాతీయ ముషైరా గజల్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ దర్గాను ఎ.ఆర్.రెహ్మాన్ క్రమ తప్పకుండా సందర్శిస్తుంటారు. 2024లో ఇక్కడ జరిగే 80వ జాతీయ ముషైరా గజల్ ఈవెంట్‌కు చరణ్‌ను తీసుకొస్తానని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన చరణ్‌ను ఆహ్వానించారు. ఓ వైపు బిజీ షెడ్యూల్.. మరో వైపు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పటికీ రెహ్మాన్‌తో ఉన్న అనుబంధం కారణంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు చరణ్. ఇది అక్కడి వారికి ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. ఈ సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ ‘‘కడప దర్గాతో నాకెంతో అనుబంధం ఉంది. ఈ దర్గా రుణం తీర్చుకోలేనిది. ఎందుకంటే, నా కెరీర్‌లో ఎంతో ముఖ్యమైన మగధీర సినిమా రిలీజ్ ముందు రోజు నేను ఈ దర్గాను సందర్శించుకున్నాను. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యి, మంచి స్టార్ డమ్ తీసుకొచ్చిందో అందరికీ తెలిసిందే. అలాగే ఎ.ఆర్.రెహ్మాన్‌గారు ఈ దర్గాలో జరిగే కార్యక్రమానికి హాజరు కావాలంటూ మూడు నెలల ముందే ఆహ్వానించారు. నేను కూడా వస్తానని ఆయనతో అన్నాను. ఆయనకు ఇచ్చిన మాట కోసం, మాలలో ఉన్నా కూడా ఈ దర్గాకు వచ్చాను. ఇక్కడకు రావటం ఎంతో ఆనందంగా ఉంది’’ అన్నారు. రామ్ చరణ్ రాకతో కడప వీధులన్నీ ఫాన్స్ తో నిండిపోయాయి. తమ అభిమాన హీరో తమ ఊరు రావడంతో భారీ ర్యాలీ నిర్వహించారు ఫ్యాన్స్.